తల్లి సంరక్షణలో బీబీజాన్, తల్లీ, కుమార్తెలతో బీబీ జాన్
పెళ్లి వయసు కాదు.. మెడలో తాళి పడింది. ఇకపై అన్నీ ఆయనే.. ఈ పెత్తనంతోనేమో ఆదరించాల్సిన చేతులు పదే పదే లేచాయి. కాపు కాయాల్సిన కళ్లు అణువణువూ అనుమానపు పొరలు కప్పుకున్నాయి. ఆయన తాగొచ్చిన ప్రతిసారీ ఆమె శరీరంపై వాతలు తేలాయి. ఇది వరకెప్పుడూ కన్నీళ్లు రాలేదు.. పెళ్లయ్యాక అవే తోడయ్యాయి. రోజూ వేధింపులే.. ఇక భరించలేనంటూ ఇద్దరు బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మనిషి రూపంలో ఉన్న ఆ మృగం అక్కడికీ వచ్చాడు. కిరాతకంగా ఆమె రెండు చేతులు తెగ నరికాడు. బతుకును ముక్కలు చేశాడు. ఆ సమయంలో బతకలేననుకుంది.. ఇద్దరు పిల్లలు..వాళ్లకు రెక్కలు తేవాలి.. ఆ మానవ మృగానికి శిక్ష పడాలి. అందుకే బతకాలి. పోరాడింది.. ఆ మృగాడిని కటకటాల వెనక్కి పంపే వరకూ పోరాడింది. ఇప్పుడు బిడ్డల భవిష్యత్తే శ్వాసగా కాలం వెళ్లదీస్తోంది తెనాలికి చెందిన బీబీజాన్..మళ్లీ అమ్మ ఒడిలో చిన్నపాపగా..
అనుమానం పెనుభూతంలా మారిన కర్కశత్వానికి రెండు చేతులనూ కోల్పోయిన మానవి తెనాలికి చెందిన బీబీజాన్ (28). గృహహింసతో బిడ్డలతో సహా పుట్టింటికి పారిపోయిన ఆమెను భర్త వదల్లేదు. తలుపు పగులగొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించి, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న తనను నరికాడు. తెగిపడిన చేతులను పట్టుకుని రాక్షసంగా ప్రవర్తించాడు. ఆరేళ్లుగా ప్రతి చిన్నపనికీ తల్లిపై ఆధారపడుతూ రోజులు నెట్టుకొస్తోంది. ఆటవిక దాడికి పాల్పడి తనను జీవితాంతం నిస్సహాయురాలిగా చేసిన తాళి కట్టిన మృగాన్ని జైలుకు పంపాలన్న పంతాన్ని నెరవేర్చుకుంది. హాస్టల్లో ఉంటూ చదువుతున్న బిడ్డల భవిష్యత్తే బతుక్కి శ్వాసగా జీవిస్తోంది. 2012 జనవరి 6 నాటి దుర్మార్గం, న్యాయపోరాటం, జీవితేచ్ఛతో సాగిస్తున్న జీవన పోరాటం తన మాటల్లోనే...
తెనాలి: ‘వాడు మొగుడు కాదు..రెండు కాళ్ల జంతువు. వాడి పీడ పడలేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని, అమ్మ దగ్గరకొచ్చి ఉంటున్నా. 2012 జనవరి 6వ తేదీ శుక్రవారం. మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్‌మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి. గుండె జారిపోయింది. నేలక్కరుచుకోవటమే గుర్తుంది...’ అని నాటి ఆటవిక దాడిని తలచుకున్నపుడు బీబీజాన్ ఉద్వేగానికి గురైంది.
రెండు చేతులూ నరికేశాడు...
నా పేరు బీబీజాన్. మాది తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ. నాకు 15 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. 22 ఏళ్ల వయసుకే ఐదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు. భర్త చిన ఖాశింది బట్టల వ్యాపారం. తాగటం, తన్నటం, గొడవలు పడటం మామూలే. కొద్ది రోజులకు సర్దుకుపోతుంటాం. నాపై అనుమానం రోజురోజుకీ పెరగసాగింది. హింస భరించటానికి కష్టమైంది. మెగుడూ మొద్దులూ వద్దనుకొని బిడ్డల్ని తీసుకొని అమ్మ వాళ్లింటికెళ్లి తలదాచుకున్నా. అక్కడ కూడా వదల్లేదా దుర్మార్గుడు. ఆ రోజు బలవంతంగా ఇంట్లోకి వచ్చి నా చేతులు నరికేశాడు. వీపుపైనా, తొడల మీదా చేసిన దాడికి ఒళ్లు పచ్చిపుండైంది. చచ్చిపోయాననే అనుకున్నా.
బతకలేదన్నారు...
మెలకువ వచ్చేసరికి ఎక్కడున్నానో తెలీదు...‘పోయిందిగా...పోస్టుమార్టంకు పంపుదామా’ అన్న మాటలు వినిపించాయి. ఎవరో చేతిని పట్టుకుని, ‘లేదు..లేదు బతికే ఉంది’ అన్నారు. మెల్లగా కళ్లు తెరిచి చూశాను. పెద్దాసుపత్రిలో ఉన్నట్టు అర్థమైంది. డాక్టరు, నర్సులు, పక్కన పోలీసులు...చేతులకేసి చూసుకుంటే భుజాల దిగువన కట్లు...దుఃఖం తన్నుకొచ్చింది. నాకు తెలియకుండానే కన్నీటి పొర కట్టలు తెంచుకుంది. మంచం పక్కనే బిడ్డలు బిక్కమొఖంతో నా రెండు చేతులవైపు అమాయకంగా చూస్తున్నారు. వారిని దగ్గరకు తీసుకుందామని రెండు చేతులు చాచపోయాను. సూదులు పొడిచినట్లు నొప్పులు..బిడ్డలను పట్టుకోలేకపోయాననే గుండెలను పిండే బాధ.. రెండూ ఒకేసారి కలిపి నా దుస్థితిని వెక్కిరించినట్టే అనిపించాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిన కళ్లలో పిల్లలే మెదిలాడారు. అభం శుభం తెలీని వాళ్ల కోసం ఎలాగైనా బతకాలనుకున్నాను. ఇదే సమయంలో నాపై ఘోరానికి తలపడిన కిరాతకుడికి శిక్ష పడేలా చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పంతోనే మూడు నెలలకుపైగా మృత్యువుతో పోరాడి బతికా.
మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్‌మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి.
న్యాయపోరాటంలో గెలిచా...
సిరి మహిళా సాధికారిత సంఘం అనే సంస్థ అండగా న్యాయ పోరాటానికి దిగా. కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయ్. ‘సిరి’ ప్రతినిధులు తోడునీడుగా వీటిని ఎదుర్కొన్నాను. రాయబారాలు నడిపిన ప్రబుద్ధుడు నేరుగా కాళ్ల బేరానికొచ్చాడు. రూ.3 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టినా లొంగ లేదు. న్యాయ పోరాటంలో గెలిచాను. ఘాతుకానికి తగిన శిక్ష పడింది. ప్రభుత్వానికి నా బాధను విన్నవించాను. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ నా బిడ్డలు సద్దాం హుస్సేన్ (11) ఆరో తరగతి, ఆసియాబేగం (10) ఐదో తరగతి చదువుతున్నారు.
నా తల్లికి రోజూ కన్నీటితో అభిషేకిస్తున్నా..
తల్లి షేక్ హబీబూన్ (55) సంరక్షణలో ఉంటూ నేను జీవనపోరాటం చేస్తున్నా. పసితనంలో సాకినట్టే, ఈ వయసులోనూ నా ఆలనాపాలన చూస్తోంది. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ ‘పెద్దయ్యాక నాకు ఇంత ముద్ద పెడతావా బేటీ’ అనేది. కానీ ఈ వయసులో కూడా అమ్మే నాకు తినిపించాల్సి వస్తోంది. అమ్మ మాటలు తలుచుకుంటే గుండె చెరువవుతుండేది. ఏం చేయను. తల్లి రుణం ఎలా తీర్చుకోగలను. అమ్మకు రెండు చేతులతో మొక్కలేని అశక్తురాలిని. అందుకే రోజూ మనసులోనే కన్నీటితో అభిషేకం చేస్తున్నా. పింఛను డబ్బులు, రేషను బియ్యమే మా జీవనాధారం. ఇంత పేదరికం అనుభవిస్తున్నా..కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నా నాకున్న ఆశ ఒక్కటే. బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ల జీవితాలను విద్యా దీపంతో వెలిగించాలి. పదో తరగతి తర్వాత ఎలాగనేది అర్థం కావటం లేదు. సమాజంలో ఏదో మూల మానవత్వం బతికే ఉందనుకుంటున్నా.. అదే నా బిడ్డలకు చేయూతనిస్తుందనే నమ్మకంతో బతుకుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment