పరువు కోసం పేగుబంధాన్ని తెంచుకుంది!
ప్రేమలో పడిందని కూతుర్ని కడతేర్చిన తల్లి
* విజయవాడలో దారుణం
వీరులపాడు: పేగుబంధం విలువ.. నవమాసాలు మోసిన తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. కానీ ఓ కన్నతల్లి పరువు కోసం కూతురి ఉసురు తీసింది. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందంటూ కుమార్తెను కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మైసూర్ జానీకి 20 ఏళ్ల కిందట బీబీజానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె నజ్మా(16) నగరంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తోంది.
ఆమె వారు నివాసముంటున్న అపార్ట్‌మెంట్ పైఅంతస్తులో ఉండే దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో నజ్మాను మందలించింది. అయినా వినకపోవడంతో బుధవారం నిద్రపోతున్న కుమార్తెను హతమార్చింది. కాగా, నజ్మా మృతిపై దీపక్ ఫిర్యాదు చేయడంతో విజయవాడ నున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జుజ్జూరులో కూతురి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న తల్లిదండ్రులను విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అదేరోజు రాత్రి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు కూతురి అంత్యక్రియలు నిర్వహించారు.
చెప్పినా వినలేదని..
బీబీజానీ గురువారం జుజ్జూరులో విలేకరులతో మాట్లాడింది. వివాహితుడైన దీపక్‌తో నజ్మా ప్రేమలో పడిందని తెలిసి మందలించానని చెప్పింది. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని దీపక్‌ను వేడుకున్నానంది. కానీ అతను వినకపోగా నజ్మాతో తన పెళ్లి జరిపించాలని, లేకుంటే తామిద్దరం దిగిన ఫొటోలను నెట్‌లో పెడతానని బెదిరించాడని తెలిపింది.
దీంతో బుధవారం మధ్యాహ్నం దీపక్‌తో కలసి ద్విచక్రవాహనంపై వచ్చిన నజ్మాను మరోసారి మందలించగా తనను ఇష్టమొచ్చినట్లు తిట్టిందని చెప్పింది. కుటుంబ పరువు పోతుందన్నా వినలేదనే ఆక్రోశంతో నిద్రపోతున్న కూతురి మొహంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైంది. కన్న కూతురిని కడతేర్చినట్లు బీబీ జానీ స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.