10 శాతం వృద్ధి సాధ్యమే: దీపక్ పరేఖ్
ముంబై: దేశం 10 శాతం వృద్ధి రేటును సాధించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ఫండమెంటల్స్ ఇందుకు అనుకూలంగానే ఉన్నాయని అన్నారు.
అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఐఎస్బీ కేపిటల్ మార్కెట్ల సదస్సులో పరేఖ్ మాట్లాడుతూ, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, చమురు ధరల పతనం, స్థిరమైన, మెజారిటీ ప్రభుత్వం ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూలమైనవని వివరించారు.
అయితే వీటికితోడు న్యాయ, ఎన్నికలు, పోలీస్, కార్మిక, భూ సంస్కరణలతోపాటు ఫైనాన్షియల్ రంగంలోనూ సంస్కరణలు అవసరమని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు 6.5 నుంచి 7% వృద్ధి సాధనకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు.