పీజీ కోర్సులకు బయోమెట్రిక్
ఈ ఏడాది నుంచే అమలుకు ఉన్నత విద్యామండలి యత్నం
ఎంబీఏ కోర్సులపై ఎక్కువ ప్రభావం
ప్రస్తుతం దూర విద్య కోర్సుల్లా కొనసాగుతున్న పీజీ కోర్సులు
ఎచ్చెర్ల: కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు అయిదేళ్ల నుంచి ప్రతి పాదనల దశలోనే ఉంది. అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈ ఏడాది ఎలాగైనా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తప్పనిసరిగా పీజీ, యూజీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలు సైతం ఏఫిలియేష న్ కమిటీలకు నోటీసులు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం తప్పదని కళాశాలలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చాలా వరకు దూర విద్య కంటే దారుణంగా నడుస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు మాత్రమే విద్యార్థులు రాస్తున్నారు. అంతకు మించి కళాశాలలకు వెళ్లడం లేదు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తే చాలా కళాశాలలు పీజీ కోర్సులు రద్దు చేసుకోవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే ఇకపై పీజీ కోర్సుల్లో చేరవలసి ఉంటుంది.
అధిక శాతం ఎంబీఏ కళాశాలలు
పీజీ కోర్సులకు సంబంధించి ఎంబీఏ జిల్లాలో ఎక్కువ కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఎనిమిది కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. గత ఏడాది మొత్తం సీట్లు నిండగా, ఈ ఏడాది ప్రవేశాలు కౌన్సెలింగ్ దశలో ఉంది. ప్రైవేట్ కళాశాలలు మాత్రం బయోమెట్రిక్ అమలు సాధ్యం కాదని, తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని అంటున్నారు. అయితే బయోమెట్రిక్ అమలు చేస్తే 50 శాతం ప్రవేశాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఎం.ఫార్మశీ, ఎంటెక్, ఎల్ఎల్ఎం వంటి కోరుసల్లో ప్రవేశాలు ఘణనీయింగా తగ్గిపోతాయి. ఎం.పార్మశీ రెండు కళాశాలల్లో నిర్వహిస్తుండగా, ఎంటెక్ ఏడు కళాశాలల్లో, ఎల్ఎల్ఎం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేటుగా ఉద్యోగాలు చేసున్న వారే ఈ కోర్సులు చేస్తున్నారు. దూర విద్య ద్వారా చేస్తే పాస్ శాతం, మార్కులు శాతం పీజీ కోర్సుల్లో తక్కుగా ఉంటుంది. రెగ్యులర్ కోర్సుల్లో మార్కులతో పాటు కొన్ని కళాశాలల్లో చూసిరాతను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఈ రెండు అంశాల వల్ల పీజీ కోర్సులకు డిమాండ్ ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారు ఎక్కువగా ఎంబీఏకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఎంబీఏ తరగతులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీతో పాటు, మరో రెండు కళాశాలల్లో మాత్రమే పక్కాగా తరగతులు నిర్వహిస్తున్నారు. మిగతా కళాశాలలో దూరవిద్యా కోర్సు కంటే ఆధ్వానంగా నిర్వహిస్తున్నారు.
75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్
బయోమెట్రిక్ పక్కాగా అమలు చేస్తే 75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సాధ్యం. కనీసం 65 శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతి సాధ్యం అవుతుంది. బయోమెట్రిక్ అమలు చేస్తే విద్యార్థి ప్రవేశాన్ని ఆధార్‌తో సీడింగ్ చేస్తారు. జాతీయ సమాచార కేంద్రం పలు సంస్థలకు బయోమెట్రిక్ అనుసంధానం చేస్తుంది. ఉన్నత విద్యా మండలి, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వర్సిటీలు ఇలా అన్ని విభాగాలు అనుసంధానం చేస్తే విద్యార్థులు హాజరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా చదవడం సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు ఈ ఏడాది అమలు అవుతుందో... లేదో, ప్రవేశాలపై ఎటు వంటి ప్రభావం చూపుతుందో నిరీక్షించవలసిదే. అయితే మొదటి ఏడాదిలో తప్పని సరిగా అమలు చేయాలని రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ భారం తగ్గించుకోవాలన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు అమలు చేయడం సాధ్యం అయ్యే పరిస్థికాదన్నది కళాశాలల భావన.