Bison
-
జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్లో ఫారెస్టు చాలా దట్టంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందతో ప్రమాదం లేదు గొరగేదెలు మందలుగా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. – సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్‌వో -
సదర్ కింగ్..సర్తాజ్
మహానగరానికే ప్రత్యేకమైన సదర్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్‌ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్‌లో ‘సర్తాజ్’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన ‘సర్తాజ్’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
అదొక భయానక దృశ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ‘ఎల్లోస్టోన్ నేషనల్ స్టోన్ పార్క్’లో సోమవారం చోటుచేసుకున్న భయానక దశ్యం ఇదీ. ఫ్లోరిడాలోని ఒడిస్సా ప్రాంతానికి చెందిన యాభై మంది సందర్శకులు ఆ రోజు నేషనల్ పార్క్‌లో సంచరిస్తూ అమెరికా అడవి దున్నగా పిలిచే (బైసన్) సమీపంలోకి వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాల సేపు అక్కడే గడిపారు. అనూహ్యంగా ఓ అడవిదున్న మిగతా వారికి కొంచెం ఎడంగా ఉన్న ముగ్గురు పిల్లల మీదకు దూసుకెళ్లింది. దాని దాడి నుంచి ఇద్దరు పిల్లలు తప్పించుకోగా, ఓ తొమ్మిదేళ్ల బాలకను అది కొమ్ములతోనే ఆకాశంలోకి గిరాటేసింది. ఆ దశ్యాన్ని చూసిన సందర్శకులు భయభ్రాంతులతో తలోదిక్కుకు పరుగులు తీశారు. తీవ్రంగా దెబ్బతగిలిన ఆ బాలికను ‘ఓల్డ్ ఫేత్‌ఫుల్ క్లినిక్’కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు నేషనల్ పార్క్ సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పార్క్ అధికారులు సంఘటనకు సంబంధించి సందర్శకులు తీసిన ఓ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. 2018లో ఓ అమ్మాయిని కూడా ఓ అడవిదున్న ఇలాగే కుమ్మేసింది. ఆ తర్వాత అలాంటి సంఘటన జరగడం ఇదేనని పార్క్ సిబ్బంది తెలిపారు. ఈపార్క్‌లో అమెరికా జాతికి చెందిన అడవి దున్నలు 4,527 ఉన్నాయి. వాటిలో మగ దున్నలు దాదాపు 920 కిలోల బరువుంటే, అడ దున్నలు దాదాపు 500 కిలోల బరువు ఉంటాయని సిబ్బంది తెలిపారు. -
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
సీన్ రివర్సైంది.. పరిగెత్తరో
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కు.. మధ్యాహ్నం.. లంచ్ టైం.. డొక్క మాడుతుండటంతో రెండు సింహాలు (ఫొటోలో ఒకటే కనిపిస్తోంది) వేటకు బయల్దేరాయి. దారిలో బాగా బలిసిన అడవి దున్నలు కనిపించాయి. ఒకదాన్ని పట్టుకున్నా.. రెండ్రోజులు ఫుడ్ గురించి చూసుకోనక్కర్లేదు అనుకున్నాయి. వేటకు రెడీ అయ్యాయి. అమాంతం ఓ దున్నపై పడ్డాయి. కానీ సీన్ రివర్సైంది. ఆ దున్న వాటిని ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నింది. ఇంకేముంది.. సింహాలకు సీన్ అర్థమైంది. ఈగోను పక్కనపెట్టి.. ఇలా కాళ్లకు పని చెప్పాయి. -
పట్టుబడిన అడవి దున్న
వెలిచేరు (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : దారి తప్పి వెలిచేరు గ్రామంలోకి చేరుకుని వీరంగం సృష్టించిన అడవి దున్నను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు శనివారం బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆత్రేయపురం మండలం వెలి చేరు ఊదలమ్మ గవళ్ల పాలెం సమీపంలో అడవి దున్న శుక్రవారం అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలి సిందే. పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలం చెందడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. శనివారం ఉదయం విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు చెందిన మత్తు వైద్యుడు శ్రీనివాసరావు తుపాకీతో అడవి దున్నకు మత్తు ఇచ్చారు. అది సరిగా పనిచేయకపోవడంతో సమీపంలో ఉన్న ఏటిగట్టుపైకి వచ్చి ప్రజలను పరుగులు తీయించింది. వారంతా భయాందోళనకు గురయ్యారు. చాకచక్యంగా మళ్లీ మత్తు మందు ఇవ్వడంతో కొద్దిసేపటికి స్పృహ కోల్పోయింది. అనంతరం అటవీ శాఖ, పోలీసుల సహాయంతో అడవి దున్న తలకు గుడ్డ కట్టి, కాళ్లను తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో అరటి తోట నుంచి ఏటుగట్టుపై ఉన్న అటవీ శాఖకు చెందిన వ్యాన్‌లోకి చేర్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి సీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దున్నను మారేడుమిల్లి సమీపంలోని అడవిలో వదలి పెట్టనున్నట్టు తెలిపారు. దీనిని బంధించేందుకు సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దున్న దాడిలో తీవ్ర గాయాలపాలైన చీలి వెంకన్న ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాకినాడ ఫారెస్టు రేంజ్ అధికారి నర సింహా రావు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఎస్సై సత్యనారాయణ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.