పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి
ప్రధాని మోదీ పిలుపు
మోదీ సూచనలపై బ్లూప్రింట్ రూపకల్పన
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసులు పల్స్ పోలియో లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇటీవల గుజరాత్లో పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన డీజీపీలు, ఐజీల సదస్సులో మోదీ చర్చించిన విషయాలపై తాజాగా బ్లూప్రింట్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆయా విభాగాలు తయారుచేసిన బ్లూప్రింట్ ప్రకారం పోలీసులు, సాయుధ బలగాలు పనిచేయడం ప్రారంభించాయి. వారి ఠాణా పరిధిలో పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడం, పాఠశాలలు, కళాశాలల్లో మెరిట్ విద్యార్థులను, వక్తృత్వ పోటీల్లో విజేతలను పోలీసు మెమెంటోలతో అభినందించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని మోదీ పేర్కొన్నారు. ట్వీటర్, ఫేస్బుక్ ఖాతాలను తెరిచి వదంతులను అరికట్టేందుకు కృషిచేయాలన్నారు.
రాష్ట్రానికో ‘ఐకాన్’ రైల్వేస్టేషన్
ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్క రైల్వే స్టేషన్ను అయినా.. దానికి ఒక విశిష్ట నిర్మాణం (ఐకాన్)గా, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా రూపొందించేలా అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఢిల్లీలో ప్రగతి (క్రియాశీల పరిపాలన, సమయానికి అమలు) సమావేశంలో రాష్ట్రాల్లో కొనసాగుతున్న రోడ్డు, రైల్వే,విద్యుత్ పలు మౌలిక ప్రాజెక్టులపై సమీక్షించారు.