boggula Srinivas
-
'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ
హైదరాబాద్: 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తక రచయితకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ఈ పుస్తకాన్ని రాసిన తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ బుధవారం నుంచి 26వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో పుస్తకాలను కూడా ప్రదర్శించి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ సోమవారం సచివాలయంలో హోంమంత్రిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. అంతేకాకుండా హోమంత్రి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. మహేందర్‌రెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. రక్షణ కల్పించినందుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
పదవులు తుచ్ఛమైనవంటూ ఆయన రాజ్యాంగాన్ని అవమానించారు 24 గంటల్లో జాతికి క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు వెళ్తా ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని అవమానించిన పవన్‌కల్యాణ్ జాతికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తాను ఈ విషయంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడానికీ వెనుకాడనని ‘పవన్ కల్యాణ్ హఠావో... పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయనాయకుడిగా పనికిరాడని, ఆ ఉద్దేశంతోనే తాను ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ అనే పిలుపునిచ్చానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం తన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం బొగ్గుల శ్రీనివాస్ పవన్‌పై తాను ఎందుకు పుస్తకం రాయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం లాంటి పదవులన్నీ తుచ్ఛమైనవని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన పవన్.. రాజ్యాంగబద్ధమైన పదవులు తుచ్ఛమైనవి అంటూనే తనకు నచ్చిన పార్టీలను అందలం ఎక్కించాలని అభిమానులకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయాలలో ఉండేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలకోడ్ వచ్చినప్పుడే పవన్ కూడా కోడై కూస్తాడని విమర్శించారు. ఆయన ప్రసంగాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పవన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం తన పుస్తకాలకు మరిన్ని భాగాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. పవన్ ఓ కుహనా రాజకీయవేత్త, కుహనా ఉద్యమకారుడు, కుహనా సంస్కర్త అని ధ్వజమెత్తారు. -
పవన్ రాజకీయ అజ్ఞాని
ఆయన నిలకడలేని వ్యక్తి.. పూటకోమాట..ప్రాంతానికో వ్యాఖ్య ఆయన నైజం చంద్రబాబును తిట్టి.. ఆయన పంచన చేరడం దుర్మార్గం ‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకావిష్కరణలో రచయిత ధ్వజం పంజగుట్ట,న్యూస్‌లైన్: పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. ‘పవన్‌కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం, మతం, ప్రాంతం తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన ఆయన పూటకోమాట మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని..ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని అంటున్నాడు. బాబు సింగపూర్‌లో డబ్బు దాచుకున్నారని విమర్శించి..ఇప్పుడు రెండురాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్‌లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారు’ అని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు స్పందించని ఆయన రాష్ట్ర విభజన విషయంలో దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఐదేళ్లు ఏమి మాట్లాడకుండా కేవలం ఎన్నికల సమయంలో పవన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. తెలంగాణ లో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరుప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన శైలి మారకుంటే తమ పుస్తకం భాగాలు వస్తూనే ఉంటాయని శ్రీనివాస్ ఈసందర్భంగా వెల్లడించారు.