
పవన్ రాజకీయ అజ్ఞాని
పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు.
- ఆయన నిలకడలేని వ్యక్తి..
- పూటకోమాట..ప్రాంతానికో వ్యాఖ్య ఆయన నైజం
- చంద్రబాబును తిట్టి.. ఆయన పంచన చేరడం దుర్మార్గం
- ‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకావిష్కరణలో రచయిత ధ్వజం
పంజగుట్ట,న్యూస్‌లైన్: పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. ‘పవన్‌కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం, మతం, ప్రాంతం తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన ఆయన పూటకోమాట మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని..ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని అంటున్నాడు.
బాబు సింగపూర్‌లో డబ్బు దాచుకున్నారని విమర్శించి..ఇప్పుడు రెండురాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్‌లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారు’ అని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు స్పందించని ఆయన రాష్ట్ర విభజన విషయంలో దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
ఐదేళ్లు ఏమి మాట్లాడకుండా కేవలం ఎన్నికల సమయంలో పవన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. తెలంగాణ లో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరుప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన శైలి మారకుంటే తమ పుస్తకం భాగాలు వస్తూనే ఉంటాయని శ్రీనివాస్ ఈసందర్భంగా వెల్లడించారు.