
పవన్ క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగాన్ని అవమానించిన పవన్‌కల్యాణ్ జాతికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తాను ఈ విషయంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడానికీ వెనుకాడనని ‘పవన్ కల్యాణ్ హఠావో...
- పదవులు తుచ్ఛమైనవంటూ ఆయన రాజ్యాంగాన్ని అవమానించారు
- 24 గంటల్లో జాతికి క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు వెళ్తా
- ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని అవమానించిన పవన్‌కల్యాణ్ జాతికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తాను ఈ విషయంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడానికీ వెనుకాడనని ‘పవన్ కల్యాణ్ హఠావో... పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయనాయకుడిగా పనికిరాడని, ఆ ఉద్దేశంతోనే తాను ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ అనే పిలుపునిచ్చానని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఆదివారం తన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం బొగ్గుల శ్రీనివాస్ పవన్‌పై తాను ఎందుకు పుస్తకం రాయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం లాంటి పదవులన్నీ తుచ్ఛమైనవని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన పవన్.. రాజ్యాంగబద్ధమైన పదవులు తుచ్ఛమైనవి అంటూనే తనకు నచ్చిన పార్టీలను అందలం ఎక్కించాలని అభిమానులకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయాలలో ఉండేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలకోడ్ వచ్చినప్పుడే పవన్ కూడా కోడై కూస్తాడని విమర్శించారు. ఆయన ప్రసంగాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పవన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం తన పుస్తకాలకు మరిన్ని భాగాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. పవన్ ఓ కుహనా రాజకీయవేత్త, కుహనా ఉద్యమకారుడు, కుహనా సంస్కర్త అని ధ్వజమెత్తారు.