
చంద్రబాబుకు నిరాదరణ
- జనం లేక వెలవెలబోయిన ఎన్నికల ప్రచార సభలు
- అసహనంతో ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగిన బాబు
- చంద్రబాబు సభలకు ముఖం చాటేసిన పురందేశ్వరి
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సొంత జిల్లాలో ప్రజల నుంచి నిరాదరణ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం పుంగనూరు, పీలేరు, కుప్పం, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. కుప్పం, పలమనే రు సభలకు ఓ మోస్తరు జనసమీకరణ చేయ గా పీలేరు, పుంగనూరు, చిత్తూరు సభలు వెలవెలబోయాయి. నిర్ణీత సమయం కంటే, 3 గంటల ఆలస్యంగా బాబు సభలు జరిగాయి. ఈ సభలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అసహనంతో రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో టీడీపీ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. అధినేత స్థాయికి దిగజారి ప్రసంగించడాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి.
చిత్తూరు సభలో కనీసం వెయ్యిమంది కూడా లేరు. దీంతో టీడీపీ శ్రేణులు డీలాపడ్డాయి. చంద్రబాబు ఆలస్యంగా రావడంతో వచ్చిన జనాన్ని నిలపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు తనయుడు లోకేష్‌ను హుటాహుటిన చిత్తూరుకు రప్పించారు. ఒక పది నిమిషాల పాటు లోకేష్ ప్రసంగించి వెళ్లిపోయారు. జనం లేకపోవడంతో ఆయన సభనిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పవన్‌కల్యాణ్ వస్తున్నట్టు హోరెత్తించిన టీడీపీ కార్యకర్తలు
కుప్పం సభకు జనం హాజరు పై ముందునుంచే అనుమానాలు తలెత్తడంతో సినీనటుడు పవన్‌కల్యాణ్ కూడా వస్తున్నట్లు మైకుల ద్వారా శనివారం సాయంత్రం నుంచి ప్రచారం జరిపారు. దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుప్రాంతాల నుంచి యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. కుప్పం సభకు హాజరైన జనంలో సగం మందికి పైగా కర్ణాటక, తమిళనాడు వాసులే ఉండడం గమనార్హం. సభ ప్రారంభమైన తరువాత పవన్‌కల్యాణ్ రాలేదని తెలుసుకున్న అభిమానులు అసంతృప్తితో తిరుగు ముఖం పట్టారు.
దీంతో చంద్రబాబు ప్రసంగించే సమయానికి హాజరైన వారిలో సగం మందే తేలారు. ఉద్దేశపూర్యకంగానే పవన్‌కల్యాణ్ వస్తున్నట్లు తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేశారు. చివరగా జరిగిన చిత్తూరు సభకు చంద్రబాబు వచ్చే సమయానికి స్టేడియంలో వెయ్యిమంది కూడా జనం లేరు. అప్పటికే లోకేష్‌ను రప్పించి జనాల్ని నిలువరించే ప్రయత్నం చేసినా విఫలమైంది. దీనికి తోడు సభలో వెనుకవైపున ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు వాదులాడుకోవడాన్ని వేదికపై నున్న బీసీ నేత షణ్ముగం పోలీసుల పైకి నెట్టేప్రయత్నం చేశారు. దీంతో విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది టీడీపీ నేతలను గట్టిగా ప్రశ్నించారు.
తమకు సంబంధం లేనప్పటికీ తమనెందుకు వివాదంలోకి లాగుతున్నారని నేతలను నిలదీశారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన టీడీపీ నాయకులు పోలీసులను బ్రతిమలాడుకోవడం కన్పించింది. రాజంపేట లోకసభ నియోజక వర్గం పరిధిలోని పుంగనూరు, పీలేరు సభలకు వెయ్యి నుంచి రెండువేల మంది లోపు జనం వచ్చారు. ఇక్కడ చంద్రబాబు తన ప్రసంగాల్లో ఆవేశంతో ఊగిపోయారు. ఈ రెండు నియోజక వర్గాల్లో ఘోరపరాభావం తప్పదని గ్రహించి ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో వేదిక పై నున్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైయ్యారు. కాగా బీజేపీ లోకసభ అభ్యర్థి పురందేశ్వరి హాజరు కాలేదు. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో పురందేశ్వరి పేరును ఉచ్ఛరించలేదు. మొత్తానికి చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.