Border check post
-
బస్సులో అర కిలో బంగారం పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో అర కిలో బంగారు నగలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్ సీఐ మంజుల, ఎస్ఐ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్ బ్యాగ్‌లో 544 గ్రాముల బంగారు వడ్డాణాలు, నెక్లెస్‌లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బళ్లారిలోని రాజ్‌మహల్ ఫ్యాన్సీ జ్యూవెలర్స్ షాపునకు చెందిన గుమస్తానని తెలిపిన రాజేష్ అందుకు ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లో నగలు చేయించి బళ్లారి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ కానీ చూపకపోవడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని రవాణాదారునితో పాటు ఆభరణాలను తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరిహద్దులను క్లియర్ చేయండి!
టొరెంటో: కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఇరుదేశాల మధ్య సరిహద్దును దిగ్బంధిస్తున్న ఆందోళనకారులపై ఫెడరల్ అధికారాలను ఉపయోగించాలని బైడెన్ ప్రభుత్వం ట్రూడో ప్రభుత్వాన్ని కోరింది. ట్రక్కులను చేర్చి సరిహద్దులను అడ్డుకోవడంతో ఇరువైపులా ఉన్న ఆటో ప్లాంట్లు మూసివేయాల్సివస్తోందని తెలిపింది. ఫ్రీడం కాన్వాయ్ పేరిట నిరసనకారులు వరుసగా నాలుగో రోజు కూడా ట్రక్కులను అంబాసిడర్ వారధి (కెనెడా, అమెరికాలను కలిపే వారధి)పై నిలిపి నిరసనలు కొనసాగించారు. దీనిపై అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో, రవాణా కార్యదర్శి పీట్ కెనెడా అధికారులతో మాట్లాడారు. సరిహద్దులను క్లియర్ చేసేందుకు రాయల్ కెనడియన్ పోలీసులను పంపిస్తున్నట్లు కెనెడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలతో కెనెడా ప్రధాని ట్రూడో ఆన్లైన్లో చర్చలు జరిపారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో అక్రమ వసూళ్లు
-
వెళ్లిన ప్రతిసారీ వాయింపే!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రవల్లి చౌరస్తా నుంచి 45 కి.మీ. దూరంలో ఉన్న కర్నూలుకు లారీ సరుకుతో వెళ్తోంది. అక్కడ సరుకు దింపి తిరిగి రావాలి. కేవలం 45 కి.మీ దూరమే. కానీ లారీ డ్రైవర్ రూ.1,700 ‘సరిహద్దు రుసుము’చెల్లించాల్సి వచ్చింది. దూరంతో నిమిత్తం లేదు.. సరిహద్దు దాటితే చాలు రుసుం చెల్లించాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విచిత్ర పరిస్థితి ఇది. ఇక్కడే కాదు.. తెలంగాణ సరిహద్దు దాటి సరుకు రవాణా వాహనం పొరుగునున్న ఉన్న ఏపీలోకి ప్రవేశిస్తే చాలు.. రూ.1700 చెల్లిస్తేనే చెక్‌పోస్టు వద్ద అనుమతి లభిస్తుంది. దీంతో లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. నిత్యం తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లే వేల సంఖ్యలో లారీలు ఈ విధంగా రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా రోజుకు రూ.కోటికి పైగా చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో ఉన్న 60 శాతం లారీలకు యజ మాని–డ్రైవర్ ఒక్కరే. ఉపాధి కోసం లారీ కొనుక్కుని సరుకును రవాణా చేసుకునే వారే ఎక్కువ. ఎక్కువ లారీలు ఉండి పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారికి ఈ సరిహద్దు రుసుం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ స్వయం ఉపాధి కోసం లారీలు నడుపుతున్న చిరు వ్యాపారులకు మాత్రం భరించలేని భారంగా మారింది. నెలలో ఎన్నిసార్లు సరిహద్దు దాటితే అన్నిమార్లు రుసుము చెల్లించాల్సి రావటం వారికి పెద్ద సమస్యగా మారింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఇక్కడ ఎందుకిలా.. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా సరిహద్దు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేషనల్ పర్మిట్ విధానం ఉంటుంది. దాని ప్రకారం వార్షికంగా రూ.17 వేలు చెల్లిస్తే ఎక్కడికైనా ఎలాంటి అదనపు రుసుము లేకుండా వెళ్లొచ్చు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేనివారు, పొరుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే వారు ‘కౌంటర్ సిగ్నేచర్’పర్మిట్ తీసుకుంటారు. దీని ప్రకారం రూ.5 వేలు చెల్లిస్తే చాలు ఏడాది పాటు మరే సరిహద్దు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించొచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేకపోవటం సమస్యకు కారణమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలా ఉండగా, పొరుగు రాష్ట్రాలతో ఈ విధానం కొనసాగింది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది అమల్లోకి రాలేదు. ఫలితంగా సరిహద్దు దాటిన ప్రతిసారీ రూ.1700 చెల్లించాల్సి వస్తోంది. కొన్ని లారీలు సరుకు తీసుకుని ఏపీకి నెలలో ఏడెనిమిది మార్లు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో రుసుం పెనుభారంగా పరిణమిస్తోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. రాష్ట్రంలో 5.76 లక్షల లారీలున్నాయి. వీటిల్లో 1.75 లక్షలు హెవీ లారీలే. 40 శాతం లారీలకు నేషనల్ పర్మిట్ ఉండగా, మిగతావి ఎక్కువగా ఏపీతోనే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం అందుబాటులోకి తేవాలని యజమానులు కోరుతున్నా ఇంతవరకు ఫలితం లేదు. గతంలో చర్చల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ దీనికి సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వైపు నుంచి చొరవ లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని రాష్ట్రానికి చెందిన లారీల యజమానులు విమర్శిస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాం ఎక్కువగా ఏపీతోనే లావాదేవీలుంటున్నందున ఆ రాష్ట్రానికి సరుకు తరలిస్తూ, భారీ రుసుములు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నాం. మాలో చిన్న వ్యాపారులే ఎక్కువ. దీంతో కౌంటర్ సిగ్నిచర్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా చర్యల్లేవు. ఈ విషయమై మాట్లాడేందుకు తెలంగాణ యంత్రాంగం నుంచి మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదు. – రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ లారీ యజమానుల సంఘం -
పాక్ చెరలో 19మంది భారతీయులు
లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు. -
సరిహద్దుల్లో చేతివాటం!
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా సరిహద్దులో కృష్ణ చెక్‌పోస్టు మాముళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఆర్టీఏ శాఖ, ఆబ్కారీ శాఖల తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి రావడంతో ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖను ఎత్తివేశారు. ప్రస్తుతం ఉన్న శాఖలు చెక్‌పోస్టులను అడ్డాలుగా మార్చుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. పైకం అందిస్తే చాలు ఏ వాహనమైనా దర్జాగా తరలిపోయే పరిస్థితి కొనసాగుతోంది. చెక్‌పోస్ట్‌లో రవాణాశాఖకు సంబంధించి ఎంవీఐ, ఏఎంవీఐలుతో పాటు ఇతర సిబ్బంది విధులు ని ర్వహిస్తున్నారు. 24గంటలకో ఒక బృందం షిప్ట్‌ల పద్ధతిలో మారుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి అటు ఇటు సరకులు తీసుకెళ్లే వాహనాలు తప్పనిసరిగా ఇక్కడ ఆగి పత్రాలపై ముద్ర వేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల్లో ఏ సరుకు, ఎంత మేర సామర్థ్యంతో రవాణా అవుతుందో తనిఖీ చేయడం, పత్రాలు సరిచూడటం ఇక్కడివారి బాధ్యత. అసలు ఏం చేస్తున్నారు.. తనిఖీ కేంద్రం వద్ద వాహనం ఆగగానే సంబంధిత డ్రైవర్ అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కాగితాలు చూపుతాడు. స్థాయిని బట్టి సొమ్ము చేతిలో ఉంచగానే వాహనాన్ని ముందుకు పంపిస్తారు. ఇందుకు ప్రైవేట్ వ్యక్తులు సహాయంగా ఉంటారు. సహకరించినందుకు వారికి కొంత వాటా ఇవ్వడం జరుగుతుంది. ఆబ్కారీ ఆగడాలే వేరు ఆబ్కారీ ఆగడాలకు అదుపేలేకుండా పోతోంది. మహారాష్ట్ర, రాయిచూర్, యాదగిరి తదితర పట్టణాల నుంచి తెలంగాణలో మద్యం తయారీకి సంబంధించిన ముడి సరకు ట్యాంకర్లు వస్తుంటాయి. వీటికి అన్ని అనుమతులు ఉన్నా ఇక్కడ ఎంతో కొంత రాబడుతుంటారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో కూడా అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చిన తర్వాత జిల్లాలో సారా తయారీ చాలా వరకు తగ్గించారు. కానీ సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాకు నాటుసారాను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు దగ్గర అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోస్టింగ్‌కు భలే డిమాండ్.. కృష్ణ చెక్‌పోస్టు వద్ద పని చేసేందుకు ఎక్కవ మంది అధికారులు ఆసక్తి చూపుతారు. ఇక్కడ విధుల నిర్వహణ అదృష్టంగా భావిస్తారు. పోస్టింగ్ రావడానికి లేదా డిప్యూటేషన్‌పై పని చేయడానికి పై అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ పోస్టింగ్‌లు పొందుతుంటారు. -
సినిమా ఫక్కీలో కారు దొంగిలించబోయి..
పోలీసులకు చిక్కిన ముఠా ఇంజిన్ కోసం మరో కారు చోరీ యత్నం బాడుగకు కారు మాట్లాడుకుని డ్రైవర్‌పైనే దాడి, కారుతో పరార్ గంట వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు పలమనేరు: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. కా రును దొంగిలించేందుకు పక్కా ప్లాన్‌చేసి డ్రైవర్‌పై దాడిచేసి ఇంకాసేపట్లో తప్పించుకొనేలోపే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఓ తమిళనాడు ముఠా. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం రాత్రి పలమనేరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఇ న్నోవా కారు ఉంది. అయితే ఆ వాహనానికి రికార్డులు లేవు. దీంతో ఇలాంటి వాహనాన్నే చోరీ చేసి దాని ఇం జిన్, ఛాసిస్‌లను తన కారుకు అమర్చుకోవాలనుకున్నాడు. తనతో పాటు మరో నలుగురితో కలసి తిరుపతికెళ్లాడు. అక్కడ ఏపీ03 డబ్ల్యూ 8509 అనే నెంబరు గల ఇన్నోవా వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. తాము తమిళనాడులోని కృష్ణగిరి వెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ఆదివారం సాయంత్రం మూడు గంట లకు ఈ నలుగురు బయలుదేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పలమనేరు సమీపంలోని ఓ డాబా వద్ద ఆపి మద్యం సేవించారు. అక్కడి నుంచి కుప్పం రోడ్డు మీదుగా వెళుతూ మండలంలోని కొలమాసనపల్లె సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద 8.30కు మూత్రవిసర్జన కోసం అని డ్రైవర్ చెప్పి కారును ఆపించారు. ఉన్నట్టుండి డ్రైవర్‌పై కత్తితో దాడిచేసి అతని మొబైల్‌ను లాక్కొని అక్కడినుంచి కారులో పరారయ్యారు. దీంతో డ్రైవర్ గోవిందరాజులు రోడ్డుపక్కనే ఉన్న సబ్‌స్టేషన్ వద్దకెళ్లి జరిగిన విషయాన్ని వారికి చెప్పి అక్కడినుంచి పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లతో పాటు తమిళనాడు, కర్ణాటక పీఎస్‌లకు సమాచారం అందించారు. సరిహద్దు చెక్‌పోస్టులనుసైతం అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా 9.30 గంటలపుడు కుప్పం పట్టణం వద్ద సిద్ధంగా ఉన్న పోలీసులను చూసి ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. దీంతో కుప్పం పోలీసులు ఛేజ్ చేసి ఆ కారుతో పాటు అందులోని నలుగురు నిందింతులను పట్టుకున్నారు. వారిని పలమనేరు పోలీసులకు అప్పగించారు. వీరిలో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కాట్పాడికి చెందిన శివకుమార్‌గా తెలిసింది. ఈ సంఘటనలో కేసును పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే ఛేదించడం గమనార్హం.