సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రవల్లి చౌరస్తా నుంచి 45 కి.మీ. దూరంలో ఉన్న కర్నూలుకు లారీ సరుకుతో వెళ్తోంది. అక్కడ సరుకు దింపి తిరిగి రావాలి. కేవలం 45 కి.మీ దూరమే. కానీ లారీ డ్రైవర్ రూ.1,700 ‘సరిహద్దు రుసుము’చెల్లించాల్సి వచ్చింది. దూరంతో నిమిత్తం లేదు.. సరిహద్దు దాటితే చాలు రుసుం చెల్లించాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విచిత్ర పరిస్థితి ఇది. ఇక్కడే కాదు.. తెలంగాణ సరిహద్దు దాటి సరుకు రవాణా వాహనం పొరుగునున్న ఉన్న ఏపీలోకి ప్రవేశిస్తే చాలు.. రూ.1700 చెల్లిస్తేనే చెక్‌పోస్టు వద్ద అనుమతి లభిస్తుంది. దీంతో లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. నిత్యం తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లే వేల సంఖ్యలో లారీలు ఈ విధంగా రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా రోజుకు రూ.కోటికి పైగా చెల్లింపులు జరుగుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేదు..
రాష్ట్రంలో ఉన్న 60 శాతం లారీలకు యజ మాని–డ్రైవర్ ఒక్కరే. ఉపాధి కోసం లారీ కొనుక్కుని సరుకును రవాణా చేసుకునే వారే ఎక్కువ. ఎక్కువ లారీలు ఉండి పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారికి ఈ సరిహద్దు రుసుం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ స్వయం ఉపాధి కోసం లారీలు నడుపుతున్న చిరు వ్యాపారులకు మాత్రం భరించలేని భారంగా మారింది. నెలలో ఎన్నిసార్లు సరిహద్దు దాటితే అన్నిమార్లు రుసుము చెల్లించాల్సి రావటం వారికి పెద్ద సమస్యగా మారింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం.
ఇక్కడ ఎందుకిలా..
దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా సరిహద్దు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేషనల్ పర్మిట్ విధానం ఉంటుంది. దాని ప్రకారం వార్షికంగా రూ.17 వేలు చెల్లిస్తే ఎక్కడికైనా ఎలాంటి అదనపు రుసుము లేకుండా వెళ్లొచ్చు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేనివారు, పొరుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే వారు ‘కౌంటర్ సిగ్నేచర్’పర్మిట్ తీసుకుంటారు. దీని ప్రకారం రూ.5 వేలు చెల్లిస్తే చాలు ఏడాది పాటు మరే సరిహద్దు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించొచ్చు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేకపోవటం సమస్యకు కారణమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలా ఉండగా, పొరుగు రాష్ట్రాలతో ఈ విధానం కొనసాగింది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది అమల్లోకి రాలేదు. ఫలితంగా సరిహద్దు దాటిన ప్రతిసారీ రూ.1700 చెల్లించాల్సి వస్తోంది. కొన్ని లారీలు సరుకు తీసుకుని ఏపీకి నెలలో ఏడెనిమిది మార్లు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో రుసుం పెనుభారంగా పరిణమిస్తోంది.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..
రాష్ట్రంలో 5.76 లక్షల లారీలున్నాయి. వీటిల్లో 1.75 లక్షలు హెవీ లారీలే. 40 శాతం లారీలకు నేషనల్ పర్మిట్ ఉండగా, మిగతావి ఎక్కువగా ఏపీతోనే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం అందుబాటులోకి తేవాలని యజమానులు కోరుతున్నా ఇంతవరకు ఫలితం లేదు. గతంలో చర్చల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ దీనికి సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వైపు నుంచి చొరవ లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని రాష్ట్రానికి చెందిన లారీల యజమానులు విమర్శిస్తున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం
ఎక్కువగా ఏపీతోనే లావాదేవీలుంటున్నందున ఆ రాష్ట్రానికి సరుకు తరలిస్తూ, భారీ రుసుములు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నాం. మాలో చిన్న వ్యాపారులే ఎక్కువ. దీంతో కౌంటర్ సిగ్నిచర్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా చర్యల్లేవు. ఈ విషయమై మాట్లాడేందుకు తెలంగాణ యంత్రాంగం నుంచి మాకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదు.
– రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ లారీ యజమానుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment