Boris
-
బోరిస్ తుఫాన్.. వరదలతో యూరప్ అతలాకుతలం (ఫొటోలు)
-
యూరప్‌లో వరద విలయం
కుండపోత వర్షాలు మధ్య, తూర్పు యూరప్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. బోరిస్ తుఫాను ధాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది. రొమేనియా, ఆ్రస్టియా, జర్మనీ, స్లొవేకియా, హంగేరీ సహా పలు మధ్య యూరోపియన్ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెక్ రిపబ్లిక్ కూడా ఎడతెరిపి లేని వానలతో అతలాకుతలమవుతోంది. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 90 చోట్ల వరద హెచ్చరికలను ప్రకటించారు. ఓపావా సహా పలు నగరాల్లో వేలాది మందిని ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాజధాని ప్రేగ్నూ వరద విలయం సృష్టిస్తోంది. దక్షిణ బొహెమియా ప్రాంతంలో వరదల దెబ్బకు ఓ డ్యామ్ బద్దలైంది. 1997 నాటి ‘శతాబ్దపు వరద’ల కంటే పరిస్థితి దారుణంగా ఉందని చెక్ ప్రధాని పీటర్ ఫియాలా వాపోయారు. నైరుతి పోలెండ్‌లోని ఒపోల్ ప్రాంతంలో నది ఉప్పొంగడంతో పట్టణం వరద ముంపుకు గురైంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం క్రాకోవ్ కూడా వరదలో చిక్కుకుంది. కరెంటు లేక, టెలిఫోన్ నెట్వర్క్ పని చేయక జనం నరకం చూస్తున్నారు. ఆస్ట్రియాలో వియన్నా పరిసరాలను విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. భారీ వర్షాలు మంగళవారం దాకా కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. – ప్రేగ్ -
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
జాన్సన్ గుడ్‌బై...
లండన్: అనుకున్నట్టే అయింది. నిండా వివాదాల్లో మునిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) ఎట్టకేలకు తప్పుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి గురువారం రాజీనామా చేశారు. పార్టీ ఎన్నుకునే కొత్త నాయకునికి ప్రధాని పగ్గాలు కూడా అప్పగించి తప్పకుంటానని ప్రకటించారు. అందుకు ఒకట్రెండు నెలలకు పైగా పట్టేలా కన్పిస్తోంది. అప్పటిదాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని బోరిస్ స్పష్టం చేశారు. అంతేగాక రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారి నియామకాలను కూడా ప్రకటించారు! దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైతిక విలువలకు పాతరేసిన బోరిస్ ఆపద్ధర్మంగా కూడా పదవిలో కొనసాగేందుకు అనర్హుడని విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు. సొంతవాళ్లే వెంటపడ్డారు ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ బయటి నుంచి బోరిస్ వీడ్కోలు ప్రసంగం చేశారు. సొంత పార్టీ నేతలే మూక మనస్తత్వంతో దిగిపోవాలంటూ మూకుమ్మడిగా తన వెంటపడ్డారంటూ వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని మార్చడం సరికాదని వారికి సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. దాంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పదవీ బాధ్యతలకు గుడ్‌బై చెప్పాల్సి రావడం ఎంతగానో బాధిస్తోందన్నారు. 2019లో ప్రజలు తనకు భారీ మెజారిటీ కట్టబెట్టారని గుర్తు చేసుకున్నారు. సాధించిన విజయాలను నెమరేసుకున్నారు. కానీ తన రాజీనామాకు దారి తీసిన పార్టీ గేట్, పించర్‌గేట్ తదితర వివాదాలను మాత్రం ప్రస్తావించలేదు. తన వారసునిగా దేశాన్ని కష్టకాలంలో సరైన దారిలో ముందుకు తీసుకెళ్లే సమర్థుడైన నాయకుడు తెరపైకి వస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. అంతకుముందు బోరిస్ రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి వెల్లువెత్తిన డిమాండ్లు తారస్థాయికి చేరాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్, పాక్ మూలాలున్న సాజిద్ జావిద్ రెండు రోజుల క్రితం మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ‘గో బోరిస్’ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడం తెలిసిందే. రాజీనామా చేసిన మంత్రులు తదితరుల సంఖ్య గురువారానికి 50 దాటింది. రిషి స్థానంలో ఆర్థిక మంత్రిగా బోరిస్ ఏరికోరి నియమించిన నదీమ్ జవాహీ కూడా ఆయన తప్పుకోవాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టి షాకిచ్చారు. నాయకుని ఎంపిక.. పెద్ద ప్రక్రియే కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుని ఎన్నికకు కొద్ది వారాలు మొదలుకుని ఒకట్రెండు నెలల దాకా పట్టవచ్చు. ఎందుకంటే ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే పలు అంచెల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఎన్నిక ప్రక్రియకు పార్టీలోని 1922 కమిటీ త్వరలో శ్రీకారం చుట్టనుంది. పార్టీ నేత పదవికి పోటీ పడుతున్నట్టు భారత మూలాలున్న యూకే అటార్నీ జనరల్ సుయెలా బ్రావర్మన్ (42) ఇప్పటికే ప్రకటించారు. ఆమె తండ్రి పూర్వీకులు గోవాకు చెందినవారు. జవాహీ, రిషి, జావిద్, భారత మూలాలున్న హోం మంత్రి ప్రీతీ పటేల్, పలువురి పేర్లు కూడా గట్టిగా విన్పిస్తున్నాయి. జవాహీ, రిషి త్వరలో రేసులోకి వస్తారని భావిస్తున్నారు. వివాదాలమయం బ్రిటన్ ప్రధానిగా బోరిస్ మూడేళ్ల పదవీకాలం వివాదాలతో పెనవేసుకుని సాగింది. కరోనా కల్లోలాన్ని సరిగా నియంత్రించలేదన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పార్టీగేట్ మొదలుకుని పించర్‌గేట్ దాకా నైతికతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటిగా మార్చుకున్నారు. లండన్ మేయర్‌గా 2012 ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో బోరిస్ పేరు మార్మోగిపోయింది. 2018 దాకా రెండేళ్లు థెరెసా మే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. తర్వాత మే రాజీనామాతో ప్రధాని పదవి చేపట్టారు. బ్రెగ్జిట్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అడ్డుపడుతోందంటూ పార్లమెంటును సస్పెండ్ చేసి సుప్రీంకోర్టుతో తలంటించుకున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను తప్పిస్తానన్న బోరిస్ హామీకి 2019 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి ఏకంగా 80 సీట్ల మెజారిటీ దక్కింది. థాచర్ తర్వాత అత్యంత విజయవంతమైన పార్టీ నేతగా పేరొందారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రధాని అధికార నివాసంలో మందు పార్టీలు జరిగిన వైనం 2021 నవంబర్‌లో బయటపడటంతో బోరిస్ అప్రతిష్టపాలయ్యారు. వాటిని తొలుత ఖండించినా పార్టీలు చేసుకున్నది నిజమేనని అంగీకరించి క్షమాపణలు చెప్పారు. కానీ నిజాయతీ లేని వ్యక్తి ప్రధానిగా తగడంటూ అప్పటి నుంచే ఆయనపై ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. జూన్‌లో పార్టీపరమైన విశ్వాసపరీక్షలో గట్టెక్కినా 41 శాతం మంది ఆయన్ను వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలున్న క్రిస్ పించర్‌కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి ఇచ్చి బోరిస్ వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఆరోపణల విషయం తనకు తెలియదంటూ బుకాయించి, తర్వాత తెలుసని ఒప్పుకుని మరోసారి నవ్వులపాలయ్యారు. British media say UK Prime Minister Boris Johnson has agreed to resign: The Associated Press pic.twitter.com/tzISv6CSso — ANI (@ANI) July 7, 2022 -
ప్రేమ కానుక
గ్రేట్ లవ్‌స్టోరీస్ ప్రేమ అంటే ఆనందం మాత్రమే కాదు నిత్యచలన సంగీతం. అబ్బురపరిచే అద్భుతం. అది సరికొత్త ఊహాలోకాలకు ప్రాణం పోస్తుంది. ఊహకు కూడా అందని విషయాలను నిజం చేసి ఆహా అనిపించి ఆశ్చర్యపరుస్తుంది... దీనికి నిలువెత్తు ఉదాహరణ అన్నా, బోరిస్ల ప్రేమకథ! బొరొయంక... రెబ్రింక్స్కై(రష్యా) జిల్లాలోని అందమైన గ్రామీణ ప్రాంతం. సుదీర్ఘ కాలం తరువాత సొంత ఊరుకు వచ్చింది అన్నా. తన కుటుంబం ఒకప్పుడు నివసించిన ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో ఆమెను రకరకాల జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆ ఇంట్లోనే తన కలల రాకుమారుడు బోరిస్ గురించి తీయటి కలలు కన్నది. ఆ ఇంట్లోనే తన భవిష్యత్ చిత్రపటానికి ఇంద్రధనస్సుల రంగులు అద్దుకున్నది. ఆ ఇంట్లోనే తమ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. బోరిస్ రెడ్ ఆర్మీలో పనిచేసేవాడు. మరోవైపు అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం ‘వర్గ శత్రువు’గా ప్రకటించింది. దీంతో సొంత ఊళ్లోనే అన్నా కుటుంబం అనాథ అయిపోయింది. అన్నాను పెళ్లి చేసుకోవద్దని సన్నిహితులు వారించినా వెనక్కి తగ్గలేదు బోరిస్. పై అధికారుల ఆదేశాల మేరకు పెళ్లైన మూడు రోజులకే రెడ్ ఆర్మీలో విధులు నిర్వహించడానికి బయలుదేరాడు బోరిస్. అన్నా కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఇక బోరిస్ మనసులో అయితే కన్నీటి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ‘ఈ ఎడబాటు కోసమేనా నేను పెళ్లి చేసుకుంది’ అనే చిన్నపాటి వైరాగ్యం ఒకవైపు కలవర పెట్టింది. అంతలోనే ‘ఈ ఎడబాటు ఎన్ని రోజులని? త్వరలోనే మేమిద్దరం కలుసుకుంటాం’ అనే ఆశ మరోవైపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆశ... నిజం కావడానికి అక్షరాలా అరవై సంవత్సరాలు పట్టింది! పెళ్లి తరువాత మూడో రోజు రెడ్ ఆర్మీలో తిరిగి విధులు నిర్వహించడానికి వెళ్లిన బోరిస్ కొద్దికాలం తరువాత అన్నాను చూడడానికి ఊరికి వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చిన బోరిస్‌కు పిడుగుపాటులాంటి వార్త తెలిసింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అన్నా కుటుంబం... ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని. అన్నా కోసం ఎన్నో చోట్ల వెదికాడు బోరిస్. ‘‘నువ్వు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నావు. అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం చంపేసి ఉంటుంది’’ అని కొందరు నిరాశ పరిచారు. ‘‘అలా ఎప్పుడూ జరగదు... అన్నా ఖచ్చితంగా బతికే ఉంది’’ అనేవాడు బోరిస్. అలా ఆశాజనక ఊహలతో అన్నా కోసం సంవత్సరాల నుంచి వేచి చూస్తూనే ఉన్నాడు బోరిస్. 2008 సంవత్సరం. ఊరు గుర్తుకు వచ్చి, అంతకంటే ఎక్కువగా అన్నా గుర్తుకు వచ్చి బొరొయంక వచ్చాడు బోరిస్. అమ్మానాన్నల సమాధుల దగ్గర నివాళులు అర్పించి అన్నా కుటుంబం నివసించిన ఇంటిని చూడడానికి బయలుదేరాడు. చిత్రమేమిటంటే, సైబిరియాలో ప్రవాసంలో ఉంటున్న అన్నా ఇదే సమయంలో ఊరికి వచ్చింది. పాత ఇంట్లోనే ఉంది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు కావడంతో బయటికి వచ్చింది అన్నా. కారు నుంచి దిగివస్తున్న వ్యక్తి బాగా పరిచయం ఉన్నవ్యక్తిలా కనిపిస్తున్నాడు. బోరిస్ అయితే కాదు కదా...! ‘‘నా పేరు బోరిస్...’’ అని తనను తాను పరిచయం చేసుకోబోతున్నాడు బోరిస్.‘కలా? నిజమా?’ అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అన్నా. అంతలోనే తేరుకొని ‘‘బోరిస్... నేను అన్నా...’’ అందో లేదో బోరిస్ ఆనందానికి అంతు లేదు. ‘‘ఈ క్షణం కోసమే నేను బతికుంది. దేవుడు నాకు పెద్ద ప్రేమకానుక ఇచ్చాడు’’ అన్నాడు. దుఃఖంతో చాలాసేపటి వరకు వారి మధ్య మాటలు ఘనీభవించాయి. నరక ప్రాయమైన ఏకాంత దీవిలో నుంచి ఇద్దరూ బయటికి వచ్చారు. ఆనందంతో ఇద్దరూ మరోసారి ఒక్కటయ్యారు. -
హృదయం: 60 ఏళ్ల తర్వాత కలిశారు!
అప్పటికి మూడు రోజులే అయింది అన్నా కొజ్లొవ్కు, బోరిస్ ఎడ్యూల పెళ్లయి. రెడ్ ఆర్మీ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు బయల్దేరాడు బోరిస్. ఇంతలోనే ఎడబాటా అనుకుంది అన్నా. కానీ ఆ ఎడబాటు 60 ఏళ్లకు దాటిపోతుందని ఆమె ఆనాడు ఊహించలేదు. బోరిస్ వెంటనే తిరిగిరాలేదు. సోవియెట్ యూనియన్‌లో అలజడుల కారణంగా అన్నా కుటుంబంతో సహా ఆ దేశాన్ని విడిచి, సైబీరియాకు వెళ్లాల్సి వచ్చింది. ఏళ్లు గడిచాయి. బోరిస్‌కు, అన్నాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకరి జాడ కోసం ఇంకొకరు ఎంతో ప్రయత్నించారు. అన్నా ఓ దశలో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ తల్లి ఆమెను కాపాడి, కొత్త జీవితం ఆరంభించమని చెప్పింది. అయిష్టంగానే సరేనంది అన్నా. మరోవైపు భార్య కోసం ఎదురు చూసీ చూసీ అలసిపోయిన బోరిస్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు. ఆరు దశాబ్దాలు గడిచాయి. ఈలోపు ఇద్దరూ తమ భాగస్వాముల్ని పోగొట్టుకున్నారు. అన్నా అనుకోకుండా రష్యాలోని తన సొంత నగరం బోరోవ్లియాంకాకు వెళ్లింది. ఆశ్చర్యం. అక్కడ బోరిస్ కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకున్నారు. ఒకరి కథలు ఒకరు పంచుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 60 ఏళ్ల సుదీర్ఘం విరామం తర్వాత మళ్లీ ఇటీవలే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.