
లండన్: అనుకున్నట్టే అయింది. నిండా వివాదాల్లో మునిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) ఎట్టకేలకు తప్పుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి గురువారం రాజీనామా చేశారు. పార్టీ ఎన్నుకునే కొత్త నాయకునికి ప్రధాని పగ్గాలు కూడా అప్పగించి తప్పకుంటానని ప్రకటించారు. అందుకు ఒకట్రెండు నెలలకు పైగా పట్టేలా కన్పిస్తోంది.
అప్పటిదాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని బోరిస్ స్పష్టం చేశారు. అంతేగాక రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారి నియామకాలను కూడా ప్రకటించారు! దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైతిక విలువలకు పాతరేసిన బోరిస్ ఆపద్ధర్మంగా కూడా పదవిలో కొనసాగేందుకు అనర్హుడని విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ఆక్షేపిస్తున్నారు.
సొంతవాళ్లే వెంటపడ్డారు
ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ బయటి నుంచి బోరిస్ వీడ్కోలు ప్రసంగం చేశారు. సొంత పార్టీ నేతలే మూక మనస్తత్వంతో దిగిపోవాలంటూ మూకుమ్మడిగా తన వెంటపడ్డారంటూ వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని మార్చడం సరికాదని వారికి సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. దాంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పదవీ బాధ్యతలకు గుడ్‌బై చెప్పాల్సి రావడం ఎంతగానో బాధిస్తోందన్నారు.
2019లో ప్రజలు తనకు భారీ మెజారిటీ కట్టబెట్టారని గుర్తు చేసుకున్నారు. సాధించిన విజయాలను నెమరేసుకున్నారు. కానీ తన రాజీనామాకు దారి తీసిన పార్టీ గేట్, పించర్‌గేట్ తదితర వివాదాలను మాత్రం ప్రస్తావించలేదు. తన వారసునిగా దేశాన్ని కష్టకాలంలో సరైన దారిలో ముందుకు తీసుకెళ్లే సమర్థుడైన నాయకుడు తెరపైకి వస్తారని ఆశాభావం వెలిబుచ్చారు.
అంతకుముందు బోరిస్ రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచి వెల్లువెత్తిన డిమాండ్లు తారస్థాయికి చేరాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్, పాక్ మూలాలున్న సాజిద్ జావిద్ రెండు రోజుల క్రితం మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ‘గో బోరిస్’ డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడం తెలిసిందే. రాజీనామా చేసిన మంత్రులు తదితరుల సంఖ్య గురువారానికి 50 దాటింది. రిషి స్థానంలో ఆర్థిక మంత్రిగా బోరిస్ ఏరికోరి నియమించిన నదీమ్ జవాహీ కూడా ఆయన తప్పుకోవాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టి షాకిచ్చారు.
నాయకుని ఎంపిక.. పెద్ద ప్రక్రియే
కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుని ఎన్నికకు కొద్ది వారాలు మొదలుకుని ఒకట్రెండు నెలల దాకా పట్టవచ్చు. ఎందుకంటే ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే పలు అంచెల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఎన్నిక ప్రక్రియకు పార్టీలోని 1922 కమిటీ త్వరలో శ్రీకారం చుట్టనుంది. పార్టీ నేత పదవికి పోటీ పడుతున్నట్టు భారత మూలాలున్న యూకే అటార్నీ జనరల్ సుయెలా బ్రావర్‌మన్ (42) ఇప్పటికే ప్రకటించారు. ఆమె తండ్రి పూర్వీకులు గోవాకు చెందినవారు. జవాహీ, రిషి, జావిద్, భారత మూలాలున్న హోం మంత్రి ప్రీతీ పటేల్, పలువురి పేర్లు కూడా గట్టిగా విన్పిస్తున్నాయి. జవాహీ, రిషి త్వరలో రేసులోకి వస్తారని భావిస్తున్నారు.
వివాదాలమయం
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ మూడేళ్ల పదవీకాలం వివాదాలతో పెనవేసుకుని సాగింది. కరోనా కల్లోలాన్ని సరిగా నియంత్రించలేదన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పార్టీగేట్ మొదలుకుని పించర్‌గేట్ దాకా నైతికతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటిగా మార్చుకున్నారు. లండన్ మేయర్‌గా 2012 ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో బోరిస్ పేరు మార్మోగిపోయింది. 2018 దాకా రెండేళ్లు థెరెసా మే ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. తర్వాత మే రాజీనామాతో ప్రధాని పదవి చేపట్టారు.
బ్రెగ్జిట్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అడ్డుపడుతోందంటూ పార్లమెంటును సస్పెండ్ చేసి సుప్రీంకోర్టుతో తలంటించుకున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్‌ను తప్పిస్తానన్న బోరిస్ హామీకి 2019 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి ఏకంగా 80 సీట్ల మెజారిటీ దక్కింది. థాచర్ తర్వాత అత్యంత విజయవంతమైన పార్టీ నేతగా పేరొందారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రధాని అధికార నివాసంలో మందు పార్టీలు జరిగిన వైనం 2021 నవంబర్‌లో బయటపడటంతో బోరిస్ అప్రతిష్టపాలయ్యారు.
వాటిని తొలుత ఖండించినా పార్టీలు చేసుకున్నది నిజమేనని అంగీకరించి క్షమాపణలు చెప్పారు. కానీ నిజాయతీ లేని వ్యక్తి ప్రధానిగా తగడంటూ అప్పటి నుంచే ఆయనపై ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. జూన్‌లో పార్టీపరమైన విశ్వాసపరీక్షలో గట్టెక్కినా 41 శాతం మంది ఆయన్ను వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలున్న క్రిస్ పించర్‌కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి ఇచ్చి బోరిస్ వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఆరోపణల విషయం తనకు తెలియదంటూ బుకాయించి, తర్వాత తెలుసని ఒప్పుకుని మరోసారి నవ్వులపాలయ్యారు.
British media say UK Prime Minister Boris Johnson has agreed to resign: The Associated Press pic.twitter.com/tzISv6CSso
— ANI (@ANI) July 7, 2022
Comments
Please login to add a commentAdd a comment