BP mandal
-
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్‌ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
భావ విప్లవంతోనే రాజ్యాధికారం
భావ విప్లవం తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. హన్మకొండ లోని కేయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ శతజయంతి ఉత్సవాల మహాసభలో ఆయన మాట్లాడారు. కేయూ క్యాంపస్ (వరంగల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని, ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకునే దిశగా ప్రయత్నించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల ప్రధాత బీపీ మండల్ శతజయంతి ఉత్సవాల మహాసభ కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీపీ మండల్ పోరాటం ద్వారా సాధించుకున్న బీసీలకు 27శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలోను క్రిమీలేయర్ విధానాన్ని అనుసరిస్తున్నారని, దీంతో ఎంతో మంది బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభించటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేస్తుందని, దీంతో బీసీలకు నష్టం జరుగుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. అలాగే అమలు చేస్తున్నారని ఆరోపించారు. క్రిమీలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయాల్సి సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించాలని ప్రధానీ నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లితే ఇటీవలనే చట్టబద్దత కల్పించారన్నారు. బీసీ కులాల మధ్య ఐక్యమత్యం లేకపోవడం వలనే మన ఓట్లు మనకు రావడం లేవని, తక్కువ ఓట్లు ఉన్న అగ్ర కులాల వారే అధికారంలోకి వచ్చి సీఎంలు అవుతున్నారన్నారు. ఇప్పటికైనా బీసీలు సమష్టిగా ఉండి బీసీ భావ విప్లవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగులు చోదకశక్తిగా పనిచేస్తూ గ్రామల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోను బీసీ సంఘాల కమిటీలు వేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నారు. అప్పుడే రాజ్యాధికారం సిద్దిస్తుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదు బీసీ ఉద్యోగులకు, పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు కావాడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప అన్నట్లుగా బీసీలు తమ హక్కులు సాధన కోసం పోరాడాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా కలిసికట్టుగా ముందుకుకెళ్దామన్నారు.వి ద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముత్యం వెంకన్నగౌడ్ మాట్లాడుతూ వి ద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని ప్రకటించి వర్తింపచేయాలన్నారు. సీఎండి గా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పత్తి మధుసూధన్‌రావు, తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలారంపు రాజేందర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, తెలంగాణ విద్యావంతులవేదిక బాధ్యులు కోల జనార్ధన్, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ఆర్టీసీ, రైల్వే, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘాల బాధ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ బీసీ లకు జరుగుతున్న అన్యాయాలను వివరిం చారు. అనంతరం బీసీల చైతన్య వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. రామలింగయ్య బృందం పాడిన పాటలు ఉత్తేజం పరిచాయి. వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. తొలుతఅ తిథులు బీసీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు కావడం లేదు'
న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఏపీ భవన్ లో జరిగిన బీపీ మండల్ 98వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఓబీసీ పార్లమెంటరీ కమిటీకి చట్టబద్దత కల్పించడానికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని పార్టీల ఏకాభిప్రాయం అవసరమన్నారు. త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి చట్టబద్ధత కల్పించాలని కోరతామని దత్తాత్రేయ తెలిపారు. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. బీసీల అభ్యున్నతికి బీపీ మండల్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాపోల్ ఆనంద్ భాస్కర్, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.