సర్కారు తలుచుకుంటే అన్నీ సక్రమమే..!
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజు తలచుకుంటే దెబ్బలకు కొద వేముందన్న చందాన అధికారం చేతిలో ఉంటే అక్రమాలన్నీ సక్రమాలై పోతాయ్ మరి. ప్రభుత్వం అవలంబించే తీరు చూస్తుంటే, ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తోంది. కృష్ణా నది కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు సీఎం నివాస గృహంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సదరు భవనానికి అన్ని అనుమతులూ ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన చేసింది.
దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం నివాసం, అందుకు సిద్ధం చేస్తోన్న భవనం గురించి చర్చ మొదలైంది.
కృష్ణానది గర్భంలో శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా కరకట్ట పక్కనే ఇరవైకి పైగా శాశ్వత భవనాలు, అతిథి గృహాల నిర్మాణాలు జరిగాయి. గతేడాది డిసెంబరు 31న నది కరకట్ట ప్రాంతంలో పర్యటించిన మంత్రి దేవినేని అక్రమ కట్టడాల సంగతి తేలుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలో నాలుగు నెలల కిందట జల వనరుల శాఖ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
ఆ తరువాత తాడేపల్లి తహశీల్దార్ ద్వారా 21 మంది యజమానులకు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో లింగమనేని రమేష్‌కు చెందిన అతిథి గృహానికీ నోటీసు జారీ అయ్యింది. వీజీటీఎం ఉడా (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), రెవెన్యూ అనుమతులు లేకుండా అతిథి గృహం నిర్మించారని రెవెన్యూ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేపుడు భూ మార్పిడి పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు లభించలేదని తెలిసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. సీఎం నివాసానికి లింగమనేని అతిథి గృహాన్ని ఎంపిక చేశారు. ఆ భవనానికి అన్నీ అనుమతులూ ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.
ఇదే సరైన సమయం..
ఇదే అదనుగా తీసుకుని కరకట్ట వెంబడి నదీ స్థలాన్ని ఆక్రమించి శాశ్వత భవనాలు నిర్మించుకున్న మిగతా వారిలో చాలా మంది తమ భవనాలను రెగ్యులరైజ్ చేయించుకునే పనుల్లో పడ్డారు. అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ నేతలతో పైరవీలు చేయిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక శాఖల అధికారులను కలుస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మున్సిపాల్టీల్లో అమలు చేస్తోన్న బీపీఎస్ పద్ధతి ప్రకారం వీటిని క్రమబద్ధీకరించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కొందరు ప్రభుత్వాన్ని కోరనున్నారని తెలిసింది.