Brain Implant: పక్షవాతం వచ్చినవాళ్లు నడవొచ్చు!
సాక్షి , సెంట్రల్ డెస్క్: వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నారు.. లాగిన్ అడిగింది.. జస్ట్ మనసులో పాస్వర్డ్ అనుకున్నారు.. ఆటోమేటిగ్గా టైప్ అయిపోయి ఓపెన్ అయింది. జస్ట్ మీ కళ్లతో స్క్రీన్ మీద అటూ ఇటూ చూస్తుంటే.. మౌస్ కర్సర్ కదులుతోంది.. ఏది కావాలంటే అది ఓపెన్ చేస్తోంది. ఇవే కాదు టెక్నాలజీతో ముడిపడిన చాలా పనులు ఇలా జరిగిపోతుంటాయంతే.. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని ఎలన్ మస్క్ స్థాపించిన ‘న్యూరాలింక్’ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘బ్రెయిన్ ఇంప్లాంట్’ ప్రత్యేకత ఇది. ఇటీవలే దీన్ని కోతులకు అమర్చి చూడగా మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలోనే మనుషులపైనా ప్రయోగాలు చేయనున్నారు. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
మెదడుకు.. కంప్యూటర్‌కు మధ్య..
మన శరీరంలో కళ్లు, నోరు, కాళ్లు, చేతులు సహా ప్రతి అవయవం పనితీరును మెదడే నిర్దేశిస్తుంది. అందుకు నాడుల ద్వారా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను చదివి అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఆదేశాలు జారీ చేసే పరికరమే ‘న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాంట్’. దీనిపై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న న్యూరాలింక్ సంస్థ.. ఇప్పటికే పూర్తిస్థాయి పరికరాన్ని అభివృద్ధి చేసింది. కోతులపై విజయవంతంగా ప్రయోగాలు పూర్తి చేసింది. త్వరలోనే మనుషులపై పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
‘న్యూరాలింక్’ ఇంప్లాంట్ పూర్తిగా వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్‌కు అనుసంధానం అవుతుంది. తల వెనుక భాగాన చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఈ ఇంప్లాంట్‌ను అమర్చుతారు. దానికి ఉండే ఎలక్ట్రోడ్లను మెదడు దిగువభాగాన నాడులకు అనుసంధానం చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి.. వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్ ఆ సంకేతాలను విశ్లేషించి.. మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటనేది గుర్తించి, అమలు చేస్తుంది.
కోతి ‘పింగ్ పాంగ్’గేమ్ ఆడింది
న్యూరాలింక్ శాస్త్రవేత్తలు ముందుగా ఒక కోతికి ‘పింగ్ పాంగ్’కంప్యూటర్ గేమ్ (రెండు వైపులా చిన్న ట్యాబ్స్ ఉండి.. బంతిని అటూ ఇటూ కొడుతూ ఆడే గేమ్)’పై శిక్షణ ఇచ్చారు. జాయ్‌స్టిక్‌ను అటూ ఇటూ కదిలిస్తూ ఆడటం నేర్పించారు. ఆ సమయంలో మెదడు స్పందన, ఆదేశాలను గుర్తించి.. అందుకు అనుగుణంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రూపొందించారు. తర్వాత ఆ కోతి మెదడుకు ఇంప్లాంట్లను అమర్చారు. గేమ్ ఓపెన్ చేసి.. జాయ్‌స్టిక్ ఇవ్వకుండా, ఇంప్లాంట్లకు లింక్ చేశారు.
స్క్రీన్‌పై గేమ్‌లో బంతి కదులుతున్నప్పుడు.. రెండు వైపులా ట్యాబ్స్ పైకి/ కిందికి జరపాలని కోతి భావించింది. అందుకు అనుగుణంగా మెదడు సంకేతాలను ఉత్పత్తి చేసింది. ఇంప్లాంట్లు ఈ సంకేతాలను కంప్యూటర్‌కు చేరవేయగా.. అందుకు అనుగుణంగా ట్యాబ్స్ పైకి/ కిందకు జరిగాయి. ఇలా జాయ్‌స్టిక్ లేకుండా, కేవలం మెదడు సంకేతాలతో కోతి గేమ్ ఆడగలిగింది. దీనిపై ఇటీవల ఎలన్‌మస్క్ ట్వీట్ కూడా చేశారు.
ఆలోచనలు, ఐడియాలు.. డౌన్లోడ్, అప్లోడ్
న్యూరాలింక్ సాంకేతికతను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ఎలన్‌మస్క్ ఇటీవల ప్రకటించారు. కంప్యూటర్ డేటాను అప్లోడ్, డౌన్లోడ్ చేసిన తరహాలో.. భవిష్యత్తులో మెదడు నుంచి ఆలోచనలు, ఐడియాలను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన వాటిని మెదడులోకి అప్లోడ్ చేసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నామని కూడా చెప్పారు.
పక్షవాతం వచ్చినవాళ్లు నడవొచ్చు!
శరీరంలో నాడులు దెబ్బతినడం వల్ల అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పడిపోయిన వారికి ఈ ఇంప్లాంట్లతో ఎంతో మేలు జరుగుతుందని న్యూరాలింక్ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వారు తమ మెదడులో ఆలోచనలతోనే.. స్మార్ట్‌ఫోన్‌ను, ఇతర సాంకేతిక పరికరాలను నియంత్రించే అవకాశం ఉంటుందని అంటున్నారు. భవిష్యత్తులో పక్షవాతం వచ్చినవారు నడవడానికి కూడా ఈ టెక్నాలజీ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. మెదడు వద్ద, పడిపోయిన అవయవాల వద్ద రెండు చోట్ల న్యూరాలింక్ ఇంప్లాంట్లను అమర్చి.. మెదడు సంకేతాలను నేరుగా అవయవాలు, కండరాలకు అందజేస్తే.. అవి యధావిధిగా పనిచేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
సగం మనిషి.. సగం మెషీన్!
హాలీవుడ్లో వచ్చిన టెర్మినేటర్ వంటి సినిమాలను చాలా మందే చూసి ఉంటారు. సగం మనిషి, మరో సగం రోబోతో ఉండే ‘సైబోర్గ్’లు ఆ సినిమాల్లో నానా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాంటి సైబోర్గ్లే హీరోలు గా ఉండి కాపాడుతుంటాయి. న్యూరాలింక్ తరహా సాంకేతికత అభివృద్ధి చెందితే ‘సైబోర్గ్’లు నిజంగానే మొదలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా మనుషుల మెదడును హైజాక్ చేసి, తాము చెప్పినట్టుగా నడుచుకునేట్టు చేస్తే ఎలాగన్న సందేహాలూ వస్తున్నాయి. న్యూరాలింక్ మానవ ప్రయోగాలకు అనుమతి ఇవ్వొద్దన్న డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈ పరిశోధనలు మానవాళికి మేలు చేసే ఆవిష్కరణలు తెస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
చదవండి: ఆన్లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!