వేడుకగా ధ్వజారోహణం
కాణిపాకం(ఐరాల) : స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ధ్వజారోహణంతో వైభవంగా ముగిశాయి. వినాయక చవితి రోజున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నేత్రపర్వంగా జరిగాయి. భాగంగా బుధ వారం సాయంత్రం ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభం వద్ద వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై నుంచి మూషిక చిత్రపటాన్ని అవరోహణ చేశారు. ధ్వజ స్తంభానికి పవిత్రజలాలతో అభిషేకించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు,ఏసి వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు మల్లి కార్జున, చిట్టిబాబు,ఉత్సవ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.
నేత్రపర్వం.. త్రశూలస్నానం
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం ఆలయ పవిత్ర పుష్కరణిలో త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. తొలుత సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణì కి వద్దకు వేంచేపు చేశారు. పుష్కరిణి ఒడ్డున త్రిశూలాన్ని ఉంచి సంప్రదాయబద్ధంగా అభిషేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలకు పూజలు చేసి, పుష్కరిణిలో ఆ కలశాలలోని తీర్థాలను కలిపారు. ఆతర్వాత త్రిశూలానికి అవభతస్నానం చేయించారు. ఈ సందర్భంగా అర్చకులు, సిబ్బంది, భక్తులు కోనేరులో పవిత్రస్నానాలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత ఆలయంలోకి వేంచేపు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, అధికారులు రవీంద్ర బాబు, చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.