ఇక సెల్ఫోన్లను ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అత్యవసరంగా ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం వస్తే.. సమయానికి స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతే... పవర్ బ్యాంక్‌లో కూడా పవర్ అయిపోతే... చార్జింగ్కు ఎలాంటి అవకాశం లేకపోతే...ఎలాంటి కమ్యూనికేషన్‌కు ఆస్కారం లేని ఎడారి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోతే!. ఇక నుంచి అలాంటి తిప్పలను తప్పించేందుకు బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచంలోని పలు సంస్థలు ఇప్పటికీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి.
ఇక ఇలాంటి పరిశోధనలు ఇంకేమాత్రం అవసరం లేదని, తాము శాశ్వత పరిష్కారం కనుగొన్నామని బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఇక జీవితాంతం చార్జింగ్ చేయాల్సిన అవసరంలేని డైమండ్ బ్యాటరీని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ జీవితాంతం అంటే మన జీవితాంతమని కాదు. ఆ డైమండ్ బ్యాటరీ కాలం అని. ఇంతకు దాని జీవితం ఎంతంటే 11,460 సంవత్సరాలట. అందులో సగం చార్జింగ్ అయిపోవడానికి 5,730 సంవత్సరాలు పడుతుందట. ఈ బ్యాటరీని సెల్ఫోన్ల్తోపాటు ట్యాబ్, ల్యాప్‌ట్యాప్ లాంటి అన్ని చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థ అణుథార్మికతలో కార్బన్ 14 ఉంటుందని, దాని నుంచి కృత్రిమ వజ్రాలను తయారు చేయవచ్చని, అణు థార్మిక శక్తిగల ఆ వజ్రం నుంచి నిరంతం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని బ్రిస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ కృత్రిమ డైమండ్ బ్యాటరీ నుంచి అణుధార్మికత నేరుగా మనపై ప్రభావం చూపించకుండా ఆ డైమండ్‌పై మరో పొరను కవచంలా ఏర్పాటు చేయవచ్చని వారు చెప్పారు. ఈ కవచం వల్ల అణు డైమండ్ బ్యాటరీ నుంచి వెలువడే అణు ధార్మికత శక్తి ఓ అరటి పండు నుంచి వెలువడేదానికి సమానంగా ఉంటుందని, కనుక మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని వారు తెలిపారు. అయితే ఎంతకాలంలో అవి మనకు అందుబాటులోకి వస్తాయో మాత్రం వారు తెలపలేదు.