british army
-
లెక్కచేయలేదు.. లెక్కచెప్పింది..
మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు... లెక్కచేయలేదు. ఎముకలు కొరికే అత్యంత చల్లటి గాలులు... లెక్కచేయలేదు. వేల మైళ్ల ప్రయాణంలో తోడు ఎవరూ ఉండరు... లెక్కచేయలేదు. 40 రోజుల్లో అంటార్కిటికా దక్షిణ ధ్రువ యాత్రను ఒంటరిగా పూర్తి చేసి లెక్క చెప్పింది ‘700 మైళ్లు ప్రయాణించాను’ అని. ‘నేను గాజు పైకప్పును పగులకొట్టాలనుకోలేదు, దానిని మిలియన్ల ముక్కలు చేయాలనుకున్నాను’ అని సగర్వంగా చాటింది. మొక్కవోని ధైర్యంతో వజ్రంలా మెరిసింది. ‘సైనికుల దృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ చాందీ’ అంటూ బ్రిటిష్ ఆర్మీ ఆమెకు అభినందనలు తెలియజేసింది. బ్రిటిష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ అంటార్కిటికా దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ప్రయాణించిన భార త సంతతికి చెందిన తొలి మహిళ. ఆమె యాత్ర కిందటేడాది నవంబర్‌లో ప్రారంభమై 700 మైళ్లు అంటే సుమారు 1,127 కిలోమీటర్లు 40 రోజుల పాటు కొనసాగింది. మొన్నటి సోమవారం తన లైవ్ బ్లాగ్‌లో చరిత్ర సృష్టించిన ఘనతను ప్రకటించింది. తెలియని ప్రపంచంలోకి... 32 ఏళ్ల కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో గాలి వేగంతో పోరాడుతూ, తనకు అవసరమైనవన్నీ ఉంచిన స్లెడ్జ్‌ను లాగుతూ దక్షిణ ధ్రువంలో వందల మైళ్లు ప్రయాణించింది. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. ప్రస్తుతం చాలా భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటిది, ఇక్కడ ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టం. నేను విజేతగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆమె బ్లాగులో రాసింది. సరిహద్దులను దాటాలి ‘ఈ యాత్ర సాధారణమైనది కాదు, ఎంతో పెద్దది, ఊహకు కూడా అందనిది. ప్రజలు తమ సరిహద్దులను దాటడానికి తమని తాము నమ్మాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడానికే నా ఈ ప్రయాణం. మీరు నన్ను తిరుగుబాటుదారుని అని ముద్ర వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాలలో ఈ సాహసం ‘వద్దు’ అనే నాకు చాలా మంది చెప్పారు. ‘సాధారణం అనిపించే పనిని మాత్రమే చేయండి’ అన్నారు. కానీ, నేను నాదైన సాధారణాన్ని సృష్టిస్తాను’ అని చాందీ చెప్పారు. గాజు కప్పును పగలకొట్టేద్దాం తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఆమె తన ట్రెక్ లైవ్ ట్రాకింగ్ మ్యాప్‌ను అప్లోడ్ చేసింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో పోస్ట్ చేస్తూనే ఉంది. ‘40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో సోలో సాహస యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్ చివరి పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది. ‘మీకు కావల్సిన దేనినైనా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దానిని మిలియన్ ముక్కలుగా బద్దలు కొట్టాలనుకుంటున్నాను’ అని దృఢంగా వెలిబుచ్చిన పదాలు మన అందరినీ ఆలోచింపజేస్తాయి. వెడ్డింగ్ ప్లాన్ ఆమె తన సాహసయాత్రకు బయలుదేరే ముందు ఆర్మీ రిజర్విస్ట్ డేవిడ్ జర్మాన్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక వివాహ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని చలిలోనే ఉపయోగించుకుంది. ఈ నెలాఖరులో ఆమె దక్షిణ ధ్రువం నుండి తిరిగి వచ్చాక ఈ జంట చిలీలో తిరిగి కలుస్తారని భావిస్తున్నారు. పోలార్ ప్రీత్ అంటూ అంతా పిలుచుకునే ప్రీత్ చాందీ వాయవ్య ఇంగ్లండ్‌లోని మెడికల్ రెజిమెంట్‌లో భాగంగా సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గానూ శిక్షణ ఇస్తుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా. లండన్‌లోని క్వీన్ మెరీస్ యూనివర్శిటీలో పార్ట్‌టైమ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్ౖసైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేస్తోంది. స్లెడ్జ్‌కి ప్రత్యామ్నాయంగా పోలార్ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ శిక్షణ తీసుకుంది. స్లెడ్జ్లో కావల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్‌పోల్ మొత్తం ఇదే ప్రయాణం కొనసాగించింది. -
ఇంధన కొరతపై ఆర్మీని దించనున్న యూకే
లండన్: దేశాన్ని వణికిస్తున్న ఇంధన కొరత సమస్యను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించనుంది. సుమారు 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం నియోగించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇంధన కొరత కారణంగా పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత కారణంగా ఇంధన రవాణా కుంటుపడింది. ఆపరేషన్ ఎస్కాలిన్ పేరిట ఈ సమస్య పరిష్కారానికి మిలటరీ నుంచి కొందరిని నియమిస్తున్నామని, వీరు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, సోమవారం నుంచి ఇంధన సరఫరా బాధ్యతలు చేపడతారని డిఫెన్స్ కార్యదర్శి డెన్ వాలెస్ చెప్పారు. ఈ వారంలో ఇంధన సమస్య చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమస్య కనిపిస్తూనే ఉంది. సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. -
రాణిగారి ‘తీపి’ బహుమతికి 121 ఏళ్లు..
ఎప్పుడో ఒకసారి మనకు బుద్ధి పుట్టినప్పుడు అటకెక్కి చూస్తే అబ్బురపరిచే అలనాటి వస్తువులు గత జ్ఞాపకాలెన్నింటినో తట్టి లేపుతాయి. తాజాగా బ్రిటన్‌లో 121 ఏళ్ల నాటి చాక్లెట్ బార్ ఒకటి దొరికింది. వందేళ్ల తరువాత దొరికిన ఈ చాక్లెట్ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఓ ఇంట్లో అటకపై ఉన్న హెల్మెట్‌లో చాక్లెట్బార్ కనిపించింది. ఈ చాక్లెట్ ‘సర్ హెన్రీ ఎడ్వర్డ్ పాస్టన్ బేడింగ్ ఫీల్డ్’ అనే సైనికుడిదని యునైటెడ్ కింగ్డమ్ ద నేషనల్ ట్రస్టు ధ్రువీకరించింది. 1899, 1902 లలో రెండో బోయర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్ దళాలను ప్రోత్సహించేందుకు. క్వీన్ విక్టోరియా ఒక చిన్న బాక్స్‌లో చాక్లెట్ పెట్టి..‘సౌత్ ఆఫ్రికా 1900! ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్’ అని విక్టోరియా స్వదస్తూరిని రేపర్ మీద ముద్రించి బ్రిటిష్ దళాలకు పంపింది. ఈ చాక్లెట్ బరువు 226 గ్రాములు. అయితే గతేడాది సర్ హెన్రీ (100) మరణించడంతో ఆయన కుమార్తె హెన్రీకి సంబంధించిన వస్తువులను పరిశీలించగా ఈ చాక్లెట్ బయటపడింది. ఇప్పుడు ఈ చాక్లెట్‌ను ఇంగ్లాండ్ వారసత్వ సంపదగా భద్రపరుస్తున్నట్లు నేషనల్ ట్రస్టు ప్రకటించింది. బ్రిటిష్ సైనికులకు చాక్లెట్లు సరఫరా చేసేందుకు క్వీన్ విక్టోరియా మూడు చాక్లెట్ కంపెనీలను సంప్రదించారు. దీనికి ఆ కంపెనీలు ఎటువంటి రుసుమును తీసుకోకుండా చాక్లెట్‌ను తయారు చేసి ఇస్తామని చెప్పి అలానే ఇచ్చాయి. అంతేగాకుండా తమ కంపెనీ బ్రాండ్ నేమ్‌ను ఎక్కడా కనిపించనియ్యలేదు. పేరులేని బాక్సుల్లో చాక్లెట్‌ను పెట్టి సైనికులకు ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికాపై నియంత్రణ సాధించడానికి గ్రేట్ బ్రిటన్.. రెండు స్వతంత్ర బోయర్ రాష్ట్రాలపై యుద్ధాలు చేసింది. రెండవ బోయర్ యుద్ధం 1899–1902 మధ్య కాలంలో జరిగింది. 1902 మేనెలలో బోయర్ పక్షం బ్రిటిష్ నిబంధనలను అంగీకరించి, వెరెనిగింగ్ ఒప్పందంపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. -
ప్రపంచంలోనే ‘అరుదైన’ క్రికెట్ మ్యాచ్
నైరోబి: క్రికెట్ పూర్తిగా కమర్షియలైజైన తరుణాన ‘ఫ్రెండ్లీ మ్యాచ్’ అన్న మాటే వాడుకలో లేకుండాపోయింది! అయితే కొందరు జంటిల్మన్లు మాత్రం.. కాసుల కోసమో, కిక్కు కోసమో కాకుండా సదుద్దేశంతో ‘జెంటిల్మన్ గేమ్’ ఆడి ‘ఔరా’ అనిపించారు. దక్షిణ కెన్యాలో నివసించే మస్సాయ్ గిరిజనులు, బ్రిటిష్ ఆర్మీకి మధ్య.. పచ్చటి బయళ్లలో ఆసక్తికరంగా సాగిన రెండురోజుల క్రికెట్ మ్యాచ్.. క్రీడా, జంతుప్రేమికులను ఆకట్టుకుంది. ప్రపంచంలోని ఏకైక మగ తెల్ల ఖడ్గమృగాన్ని(నార్తర్న్ వైట్ రైనో) కాపాడుకోవడానికి వీళ్లిలా క్రికెట్‌ను సాధనంగా ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తద్వారా లభించే ప్రచారంతో ‘అరుదైన మృగాన్ని కాపాడాల’నే సందేశం ప్రజల్లోకి బలంగా వెళుతుందని వీరి ఆశ. ఖడ్గమృగం కోసం కమాండోల కాపలా: ఈ ఫొటోల్లో క్రీడాకారులతో కనిపిస్తోన్న తెల్ల ఖడ్గమృగం.. భూమ్మీద జీవించి ఉన్న ఏకైక జీవి. వేటగాళ్లబారిన పడి మిగతావన్నీ చనిపోగా.. మిగిలిన ఏకైక మగ ఖడ్గమృగమిది. అందుకే కెన్యా ప్రభుత్వం దీనిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఖడ్గమృగ రక్షణ కోసం ప్రత్యేకంగా కమాండోలను కూడా ఏర్పాటు చేసింది. గడ్డి మేయడానికి వెళ్లినా, పచ్చిక బయల్లో అటూ ఇటూ తిరగడానికి వెళ్లినా దాని వెంట కమాండోలు ఉండాల్సిందే. 24 గంటలు దీన్ని కాపలా కాస్తూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. -
యుద్ధ చరిత్రలో చివరి విలుకాడు
పీఛేముడ్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరఫున జాన్ మాల్కమ్ థోర్పే ఫ్లెమింగ్ జాక్ చర్చిల్ అనే అధికారి లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసేవాడు. ఆ కాలానికి మెషిన్గన్లు, రివాల్వర్లు వంటి అధునాతన ఆయుధాలెన్నో అందుబాటులోకి వచ్చినా, ఇతగాడు మాత్రం సంప్రదాయబద్ధమైన స్కాటిష్ ఖడ్గాన్ని, విల్లంబులను ధరించి రణరంగంలో పోరాడేవాడు. ఆధునిక యుద్ధ చరిత్రలో చిట్టచివరి విలుకాడు ఇతడే. ధనుర్విద్యలో ఇతగాడికి అపార నైపుణ్యం ఉండేది. అంతే స్థాయిలో తలతిక్కా ఉండేది. తన ఎదుటికి వచ్చే సైనికులు ఖడ్గాన్ని ధరించకుంటే, అగ్గిరాముడయ్యేవాడు. అప్పటికప్పుడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాడు. శత్రుబలగాలు తుపాకుల మోత మోగిస్తున్నా, విల్లంబులు ధరించి, రణరంగానికేగిన ఈ వెర్రి సేనాని, జర్మనీలోని నాజీ బలగాలకు చిక్కాడు. ఇతగాడి ఇంటిపేరు చర్చిల్ కావడంతో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు చుట్టం కావచ్చనే భ్రమలో తొలుత నాజీ నేతలు ఇతగాడిని చంపే ఆలోచనను విరమించుకున్నారు. విన్స్టన్ చర్చిల్తో ఇతగాడికి ఎలాంటి బంధుత్వం లేదని తేలిన మరుక్షణమే హిట్లర్ ఇతగాడిని చంపేయాలంటూ హుకుం జారీ చేశాడు. అయితే, ఆ ఆదేశాన్ని నాజీ కెప్టెన్ హాన్స్ థార్నర్ అమలు చేయకపోవడంతో జాక్ చర్చిల్ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
బ్రిటన్ సైన్యంలో బాలలు
లండన్: బ్రిటన్ సైన్యం చేపడుతున్న నియామకాల్లో దాదాపు పదోవంతు మందిని బాలలనే చేర్చుకుంటున్నారు. ప్రతి పదిమంది సైనికుల్లో ఒకరు నిండా పదహారేళ్ల లోపు వారే ఉంటున్నారు. బ్రిటన్ రక్షణ శాఖ స్వయంగా ఈ వివరాలను వెల్లడించింది. కొత్తగా సైన్యంలో చేరిన వారిలో నాలుగో వంతు మంది పద్దెనిమిదేళ్ల లోపు వారేనని, యుద్ధరంగానికి వెళ్లేందుకు తగిన వయసు లేనివారేనని తెలిపింది. బ్రిటిష్ దినపత్రిక ‘ది ఇండిపెండెంట్’ ఈ అంశంపై కథనాన్ని వెలుగులోకి తేవడంతో బ్రిటన్ సైన్యం తీరుపై విమర్శలు మొదలయ్యాయి. గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు 1991లో, కొసావోకు 1999లో 17 ఏళ్ల లోపు వారిని పంపినందుకు విమర్శల పాలైన బ్రిటన్.. 18 ఏళ్ల లోపు వారిని యుద్ధరంగానికి పంపరాదంటూ నిబంధనలను సవరించుకుంది. అయినా, రక్షణ శాఖ పొరపాట్ల కారణంగా అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లకు 17 ఏళ్ల లోపు వయసున్న ఇరవై మంది సైనికులను పంపింది. -
సంగ్రామం: బారులు తీరిన అబద్ధాలు
‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట. క్రొయడాన్లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు కూపర్డ్. వేల సంఖ్యలో, కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్. ‘అబద్ధాలాడే అబ్బాయిలు ఎక్కడికి వెళతారో తెలుసా?’ వ్యంగ్య చిత్రంలో సైనికాధికారి అడుగుతున్న ప్రశ్న. ఇందుకు ఆ బాలుడి సమాధానం- ‘ఫ్రంట్కే సార్!’ మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల ఎంపిక తీరుతెన్నులు ఎంతటి ప్రహసన ప్రాయమో చెప్పడానికి ‘పంచ్’ కార్టూన్ పత్రిక (1841-2002) ప్రచురించిన (ఆగస్టు 11, 1916) ఈ ఒక్క కార్టూన్ చాలు. ఎఫ్.హెచ్. టౌన్సెండ్ గీసిన ఆ వ్యంగ్య చిత్రం ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ఇంగ్లండ్ యుద్ధ కండూతికి గీటురాయి. అబద్ధాలాడితే నరకానికి పోతారన్న నీతిని బోధించడం ఆ అధికారి ఉద్దేశం. తన వయసు 13 సంవత్సరాలయితే, ఆ కుర్రాడు పదహారు అని అబద్ధం ఆడాడు. అప్పటిదాకా అక్కడ జరిగినదంతా అబద్ధాల కవాతే. దానిని బట్టి ఆ కుర్రాడు, సార్జెంట్ ప్రశ్నకు జవాబుగా నరకం అని చెప్పకుండా, ‘ఫ్రంట్కే సార్!’ అన్నాడు. ఫ్రంట్ అంటే, వెస్ట్రన్ ఫ్రంట్. బెల్జియం- ఫ్రాన్స్ దేశాల మధ్య దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల యుద్ధభూమి. నిజానికి వెస్ట్రన్ ఫ్రంట్ నరకానికి నకలేనని కొద్ది రోజుల్లోనే సైనికులందరికీ అనుభవానికి వచ్చింది. బ్రిటిష్ సైన్యంలో చేరడానికి నిబంధనలు కఠినంగా ఉండేవి. ఐదడుగుల ఆరు అంగుళాల పొడవు తప్పనిసరి. ఛాతీ చుట్టుకొలత 35 అంగుళాలు ఉండాలి. పద్దెనిమిది నిండితేనే సైన్యానికి ఎంపిక చేసేవారు. కానీ విదేశాలలో జరిగే యుద్ధానికి వెళ్లాలంటే పందొమ్మిదేళ్లు తప్పనిసరి. మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం తరువాత ఎంపిక నిబంధనలన్నీ సడలిపోయాయి. ఐదడుగుల ఆరు అంగుళాలు కాస్తా, ఐదూ మూడుకూ, ఆ పై ఐదడుగులకూ కుదించారు. వీళ్లనే బంటామ్ దళం అనేవారు. అంటే పొట్టివాళ్ల సైన్యం. కనీస వయో పరిమితిని పందొమ్మిదేళ్ల నుంచి పదిహేనుకు తగ్గిం చారు. గరిష్ట వయో పరిమితి 40 సంవత్సరాలకి పెంచారు. ఇన్ని సడలింపులతో కొత్తగా ఐదు లక్షల మందిని చేర్చుకున్నారు. యుద్ధ కార్యదర్శి హెచ్ హెచ్ కిష్నర్ లక్ష్యం పూర్త యింది. ఏడు లక్షలున్న ఇంగ్లండ్ సైన్యం అప్పటికి పదమూడు లక్షలకు చేరింది. కవులు, చిత్రకారులు, ఆటగాళ్లు ఎవరూ బయట మిగలలేదు. ఒక్కొక్క దళం పేరుతో యుద్ధంలో చేరారు. ఆర్టిస్ట్స్ రైఫిల్స్ ఇందుకు మంచి ఉదాహరణ. ఆగస్టు 4, 1914న జర్మనీ మీద ఇంగ్లండ్ యుద్ధం ప్రకటించి, మొదటి ప్రపంచ యుద్ధంలో అడుగు పెట్టింది. తటస్థ దేశం బెల్జియం మీద జర్మనీ దాడిని ఖండిస్తూ ఇంగ్లండ్ ఆ దేశం మీద యుద్ధం ప్రకటించింది. కానీ ఆగస్టు 14నే జర్మనీ, ఇంగ్లండ్ సేనలు మొదటిగా మోన్స్లో తలపడ్డాయి. ఇంగ్లండ్ మొదటి అడుగే తడబడింది. దీనితో ఆ జాతి కుంగిపోయింది. దీనికి తోడు పోస్టర్లు, తెల్ల ఈకలతో కుర్రాళ్లు సొంతూళ్లలో ఉండడానికి భయపడిపోతూ సైనిక ఎంపిక కేంద్రాల వైపు పరుగులు తీశారు. 1914 సెప్టెంబర్ మొదటి వారంలోనే ఇంగ్లండ్‌లో రెండు లక్షల మంది సైన్యంలో చేరిపోయారు. ఒక్క లండన్ నగరంలోనే 21,000 మంది చేరారు. నిజానికి శాంతి వేళ ఒక సంవత్సరానికి ఇంగ్లండ్‌లో 25,000 నుంచి 30,000 మందిని చేర్చుకునేవారు. బ్రిటన్ వలస దేశాలలో కూడా ఈ హడావుడి నియామకాలు జరిగాయి. ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌లలో ఇది చూడొచ్చు. భారతదేశంలో పంజాబ్ మొదటి ప్రపంచ యుద్ధం మీద మోజు పెంచుకుని, శ్వేత పాలన పట్ల వీరభక్తిని ప్రదర్శించింది. 1910 ప్రాంతానికి 69,458 మంది పంజాబీలు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పని చేస్తున్నారు. ఈ సంఖ్య యుద్ధారంభానికి 3,62,027కు (రెండు కోట్ల జనాభాలో 1.8 శాతం) చేరుకుంది. ఇలాగే దేశమంతా ప్రత్యేక నియామకాలు జరిగాయి. ఆ యుద్ధం కోసం ఫ్రాన్స్‌కు 1,38,000, మెసపటోమియాకు 6,75,000 మంది, ఈజిప్ట్‌కు 1,44,000 మంది భారత సైనికులు వెళ్లారు. ఇంగ్లండ్ చేర్చుకున్న ఐదు లక్షల మంది స్వచ్ఛంద సైనికులలో సగం మంది బాలురే. ఇంగ్లండ్‌లోనే కాదు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీలలో కూడా పెద్ద సంఖ్యలో బాలురు చేరారు. ఇంగ్లండ్ బాలలు ఎలాంటి అబద్ధాలు చెప్పారో తరువాత వారు రాసుకున్న లేఖలతో, జీవిత చరిత్రలతో, ఆ సైనికుల కుటుంబ సభ్యుల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. పిల్లలు చెబుతున్నది పచ్చి అబద్ధమని సైనికాధికారులకి పూర్తిగా తెలుసు. హ్యారీ పాచ్ అనే అబ్బాయి ఎంపిక కేంద్రానికి వెళ్లాడు. వయసు అడిగితే చటుక్కున ‘పదహారు’ అని నిజం చెప్పేశాడు. దీనితో ఎంపిక అధికారి, ‘పద్దెనిమిది నిండాక మళ్లీ రా!’ అని చెప్పి పంపేశాడు. అలాగే వచ్చాడు పాచ్- అదే క్యూలో వెనుక నిలబడి. పద్దెనిమిదేళ్లు అని చెబితే, వెంటనే అదే అధికారి చేర్చుకున్నాడు. టామీ గ్రే అని మరో బాలుడి అనుభవం ఇంకా నవ్వు తెప్పిస్తుంది. పదహారేళ్ల టామీ తడుముకోకుండా ‘పద్దెనిమిది’ అని చెప్పాడు. దానికి అధికారి, ‘సైన్యంలో చేరేవాళ్లు ఎలా ఉండాలని మేం అనుకుంటామో, అలాగే ఉన్నావ్!’ అంటూ ఎంపిక చేసుకున్నాడు. ఇలా ఎంపికై యుద్ధరంగానికి వచ్చిన బాలురలో అతి పిన్న వయస్కుడు జార్జి మాహెర్. ఇతడి వయసు కేవలం పదమూడేళ్లు. సొమ్మె అనే చోట జరిగిన ఒక యుద్ధంలో ఇతడు పాల్గొ న్నాడు. నిజానికి, హోరెస్ అనే ఇంకో బాలుడి రికార్డుని బద్దలుకొట్టి మాహెర్ చరిత్రలో నిలిచాడు. హోరెస్ వయసు పద్నాలుగేళ్లే. మాహెర్ తన 91వ ఏట 1999లోనే కన్నుమూశాడు. 1917లో రాయల్ లాంకాస్టర్ రెజిమెంట్‌లో చేరిన మాహెర్ అసలు వయసు యుద్ధభూమిలో బయటపడింది. ఒక షెల్ దగ్గరగా వచ్చి పడడంతో ‘అమ్మా!’ అంటూ బావురుమన్నాడట మాహెర్. దీనితో ఇంటికి పంపేశారు. మాహెర్ తన రికార్డును బద్దలుకొట్టే ఇంకో వాస్తవం బయటపెట్టాడు. ఇలాంటి పిల్లలే ఐదురుగురుని రెలైక్కించి లండన్ పంపారట. ఆ ఐదుగురిలో ఒక బాలుడి వయసు కేవలం పన్నెండేళ్లు. ‘ట్రెంచ్ బయట ఏం జరుగుతోందో నిన్ను ఎత్తుకుని చూపించేవారా?’ అంటూ మిగిలిన పిల్లలు రైల్లో జోక్ చేశారట. రిచర్డ్ డిక్ట్రాఫోర్డ్ అనే మరో బాల సైనికుడి కథ ఇంకా చిత్రం. ఇతడి వయసు పదిహేనేళ్లే. కానీ పద్దెనిమిదేళ్లని చెప్పాడు. నాకు నమ్మకం లేదన్నాడు అధికారి. కావాలంటే బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తానని దబాయించాడు రిచర్డ్. దానితో పక్కనే ఉన్న అధికారి ఆ కుర్రాడి మాటే చాలు ఎంపిక చెయ్యమన్నాడు. బెల్జియం తమాషా, ఇంకొకటి- ‘క్షమించాలి! నీ పండ్లు సరిగ్గా లేవు. నిన్ను సైన్యానికి ఎంపిక చెయ్యలేను!’ అన్నాడట సార్టెంట్. అందుకు చేరడానికి వచ్చిన ఆ యువకుడు ‘నేను జర్మన్లని కొరికి చంపక్కర్లేదు. కాల్చి చంపుతాను’ అన్నాడట. జార్జి కూపర్డ్ అనే పదహారేళ్ల అబ్బాయి క్రొయడాన్ అనే చోట, అప్పటి తన అనుభవాన్ని ఒక ఉత్తరంలో వర్ణించాడు. సరాయేవోలో ఫెర్డినాండ్, సోఫీల హత్య, యుద్ధం మొదలు కావడం, మోన్స్ యుద్ధం వంటి సంగతులన్నీ కూడళ్లలో ప్లకార్డుల మీద దర్శనమిచ్చేవట. అన్నింటికీ మించి సైన్యంలో చేరి ‘హూణుల’ (జర్మన్లు) పీచమణచాలని తహతహలాడిపోయిన పిల్లలు ఎంపిక కేంద్రాల దగ్గర ఎన్ని ఇక్కట్లు పడ్డారో కూడా ఇతడి ఉత్తరంతో తెలుస్తుంది. ‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట. దీనితో సైన్యం ఎంపిక కేంద్రానికి పరుగులు తీశానని కూపర్డ్ రాసుకున్నాడు. క్రొయడాన్లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు. కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్. ఇతడు ఠంచనుగా మరునాడు వెళితే ఎంపిక చేశారు. వీళ్లలో చాలామంది పేర్లు తప్పు చెప్పారు. దొంగ చిరునామాలు ఇచ్చారు. అందుకే చాలామంది ఆచూకీ తరువాత లభించలేదు. తమ పిల్లల ఆచూకీ కోసం జీవితాంతం ఎదురుచూసిన తల్లిదండ్రులు ఎందరో! - డా॥గోపరాజు నారాయణరావు