బ్రిటన్ సైన్యంలో బాలలు
లండన్: బ్రిటన్ సైన్యం చేపడుతున్న నియామకాల్లో దాదాపు పదోవంతు మందిని బాలలనే చేర్చుకుంటున్నారు. ప్రతి పదిమంది సైనికుల్లో ఒకరు నిండా పదహారేళ్ల లోపు వారే ఉంటున్నారు. బ్రిటన్ రక్షణ శాఖ స్వయంగా ఈ వివరాలను వెల్లడించింది. కొత్తగా సైన్యంలో చేరిన వారిలో నాలుగో వంతు మంది పద్దెనిమిదేళ్ల లోపు వారేనని, యుద్ధరంగానికి వెళ్లేందుకు తగిన వయసు లేనివారేనని తెలిపింది.
బ్రిటిష్ దినపత్రిక ‘ది ఇండిపెండెంట్’ ఈ అంశంపై కథనాన్ని వెలుగులోకి తేవడంతో బ్రిటన్ సైన్యం తీరుపై విమర్శలు మొదలయ్యాయి. గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు 1991లో, కొసావోకు 1999లో 17 ఏళ్ల లోపు వారిని పంపినందుకు విమర్శల పాలైన బ్రిటన్.. 18 ఏళ్ల లోపు వారిని యుద్ధరంగానికి పంపరాదంటూ నిబంధనలను సవరించుకుంది. అయినా, రక్షణ శాఖ పొరపాట్ల కారణంగా అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లకు 17 ఏళ్ల లోపు వయసున్న ఇరవై మంది సైనికులను పంపింది.