అత్యంత ఎత్తైన ప్రాంతంలో డీజే
కఠ్మాండు:
సముద్ర మట్టానికి 5,380 అడుగుల ఎత్తులో బ్రిటన్‌కు చెందిన డీజే పాల్ ఓకెన్‌ఫోల్డ్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. అదెక్కడా అనే కదా మీ సందేహం. అదే ఎవరెస్టు బేస్ క్యాంపు. ఈ ప్రదర్శనకు ‘హయ్యెస్ట్ పార్టీ ఆన్ ది ఎర్త్’ అని నామకరణం చేశారు. మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫోల్డ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణి వద్ద ఈ ప్రదర్శన జరగనుండడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నాడు.
ట్రెక్కింగ్ విషయంలో తనకు ఎంతమాత్రం అనుభవం లేదని 53 ఏళ్ల ఈ డీజే చెప్పాడు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నాడు. ఇక్కడ గాలి అత్యంత పలచగా ఉందని, శ్వాస తీసుకోవడం ఒక్కోసారి కష్టం కూడా కావొచ్చని ఓకెన్‌ఫోల్డ్ వెంట వచ్చిన నేపాల్‌కు చెందిన మరో డీజే రంజీన్ ఝా చెప్పాడు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని అందరి దృష్టికి తీసుకుపోవాలనే లక్ష్యసాధనలో భాగంగానే ఇక్కడ కార్యక్రమం నిర్వహించతలపెట్టామని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని చారిటీలకు అందజేస్తామని పేర్కొన్నాడు. మరోవైపు ఎవరెస్టు వద్ద ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. హిమాలయాల ప్రశాంతతకు ఇది భంగం కలిగిస్తుందనేది వారి ఆరోపణ.