మోదీ సోదరుడిలాంటి వారు: ఆస్ట్రేలియా ప్రధాని
మెల్బోర్న్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులనే గాక దేశాధినేతలను సైతం ఆకట్టుకుంటున్నారు. మోదీ తనకు సోదరుడి లాంటి వారని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించడం విశేషం.
ఆస్ట్రేలియాలో మోదీ, టోనీ అత్యంత సన్నిహితుల్లా మెలిగారు. వీరిద్దరూ కలసి పాల్గొన్న కార్యక్రమాల్లో టోనీ పలుమార్లు 'నరేంద్ర, నేను' అని సంబోధించారు. జి-20 సదస్సు సందర్బంగా మోదీ టోనీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కలసి సెల్ఫీ కూడా దిగారు. మోదీ మంగళవారం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ బయల్దేరారు. 'నా చిరస్మరణీయ ఆస్ట్రేలియా పర్యటన ఈ రోజుతో ముగిసింది. ఇక సరికొత్త అధ్యాయం మొదలైంది' అని మోదీ అన్నారు.