Brutal murder of a young man
-
యువకుడి దారుణ హత్య.. కారుతో తొక్కించి చంపిన స్నేహితుడు
ఏలేశ్వరం: స్నేహితుడే కాలయముడయ్యాడు. నిత్యం కలిసి తిరుగుతూ ఉన్న స్నేహితుడే కారుతో తొక్కించి కర్కశంగా తుది ముట్టించిన ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. ఈ ఘటనలో పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ(23) మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ, బంటు దుర్గాప్రసాద్ స్నేహితులు. అర్ధరాత్రి 11, 12 గంటల మధ్య దుర్గాప్రసాద్ కారులో మణికంఠను బయటికి తీసుకువెళ్లాడు. ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటలకు మణికంఠ తండ్రి శ్రీనివాసరావు బంధువులతో కలిసి వెతికాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు రాగా కారులో బయటకు వస్తున్న దుర్గాప్రసాద్‌ను నిలదీశారు. దీంతో మణికంఠ తన తాతను తిట్టాడని దీనిపై నిలదీయగా నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తానని చెప్పడంతో కారుతో తొక్కించి చంపేశానని దుర్గాప్రసాద్ చెప్పాడు. దీంతో మృతుడు తండ్రి శ్రీనివాసరావు ిఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సరదాగా మాట్లాడుకుందామని పిలిచిన స్నేహితులు ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. గురువారం అర్ధరాత్రి మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ హత్యోదంతానికి సంబంధించి ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రేపాక సాయితేజ (22) తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లుతో కలిసి పంజాబ్ హోటల్ సమీప గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొద్ది రోజుల కిందట వేరే వ్యక్తి అంత్యక్రియల సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఓ యువకుడిని సాయితేజ కొట్టాడు. అది మనసులో పెట్టుకున్న ఆ యువకుడి స్నేహితులు తేజపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సాయి తేజ స్నేహితులు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పిలిచారు. వారంతా మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌కు చేరుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నాక వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో తేజపై దాడికి యత్నించారు. వెంటనే ప్రాణభయంతో పరుగులు తీసిన తేజ సమీపంలోని ఓ ఇంటి మెట్లు ఎక్కుతుండగా బలవంతంగా కిందకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఓ యువకుడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సన్నిహితులే హంతకులు! పాత కక్షలు కారణంగా రాత్రి సమయంలో కొంత మంది స్నేహితులు తమ కుమారుడికి ఫోన్ చేసి తీసుకెళ్లి చంపేశారని మృతుని తండ్రి పైడిరాజు ఆరోపిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇంతలోనే చంపేశారని బోరున విలపిస్తున్నారు. తన కొడుకుతో తిరుగుతూ, మా ఇంట్లో తిన్నవారే పొట్టన పెట్టుకున్నారంటూ మృతుడి తల్లి లక్ష్మి వాపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా తేజపై కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్లు కనిపించింది. ఆ దిశగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులుగా భావిస్తున్న బంగారిరాజు, మోహన్, యూసఫ్ ఖాన్, రవి, సురేష్, నాని, బాలు, హరిపై మృతుని తండ్రి ఫిర్యాదు చేశారు. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితులంతా గ్రీన్ గార్డెన్స్, రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వారని గుర్తించారు. యువకుడి హత్యపై దర్యాప్తు చేస్తున్నామని ఏడీసీపీ పెంటారావు తెలిపారు. మృతునికి, అతని స్నేహితులకు పాత కక్షలున్నాయని... ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో హత్యకు దారి తీసిందని పేర్కొన్నారు. -
పెళ్లి చేసుకుందామని కువైట్ నుంచి తిరిగొచ్చాడు.. పాత కక్షలకు బలయ్యాడు
కడప అర్బన్: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం పాత కడప చెరువు వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్ సముధాన్ అలియాస్ సంధానీ(25) కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మూడు నెలల క్రితం కువైట్ నుంచి కడపకు వచ్చాడు. వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన రియాజ్ అనే వ్యక్తికి, సముధాన్‌కు మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగింది. గతంలో కూడా వీరి మధ్య విభేదాలుండేవని సమాచారం. కాగా గురువారం మధ్యాహ్నం పాతకడపకు చెందిన ఓ వ్యక్తి, తనకు కుమారుడు పుట్టాడని, సముధాన్‌తో పాటు స్నేహితులకు పార్టీ ఇస్తున్నట్లు ఆహ్వానించాడు. అంతా కలిసి సాయంత్రం వరకు పాతకడప చెరువు కట్టమీద సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రియాజ్‌కు సమాచారం అందింది. దీంతో రియాజ్ తన స్నేహితులను వెంట తీసుకుని మారణాయుధాలతో సంఘటన స్థలానికి వెళ్లాడు. అక్కడున్న సముధాన్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో సముధాన్ స్నేహితులను బెదిరించడంతో వారు పరారయ్యారు. సముధాన్‌ను ఇష్టానుసారంగా కత్తులతో పొడిచి, రక్తపుమడుగులో ఉన్న అతను చనిపోయాడని నిర్ధారించుకుని మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లారు. నిందితులు పరారవగానే, సముధాన్ స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ బూడిద సునీల్, చిన్నచౌక్ సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్ఐ జి. అమర్నాథ్రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెరువులో పడిన మృతదేహాన్ని వెలికితీసి, రిమ్స్‌కు తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హతుని స్నేహితులను కూడా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై హతుని సోదరుడు సయ్యద్ మహబూబ్‌బాషా మాట్లాడుతూ తనకు సోదరుని స్నేహితులు ఫోన్ చేయగా వచ్చానని, ఇక్కడికి వచ్చి చూడగా శవమై పడి ఉన్నాడని విలపించాడు. కువైట్ నుంచి 3 నెలల క్రితమే వచ్చాడని, వివాహ సంబంధాలు చూస్తున్నామని ఇంతలోపే ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కత్తులతో పొడిచి.. రాయితో మోది
నాగారం (తుంగతుర్తి) : ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. ఈ ఘటన ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధులువు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన కొమ్ము యాకయ్య అలియాస్ రమేశ్ (33) హైదరాబాద్‌లోని వారసిగూడలో పశువుల వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. పదిరోజుల క్రితం యాకయ్య తన స్వగ్రామమైన జలాల్‌పురానికి వచ్చి ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. ఫణిగిరి గ్రామానికి చెందిన తన రెండో భార్య కొమ్ము మమత మేనమామ వివాహానికి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ మూరగుండ్ల సురేష్‌తో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం కొమ్ము యాకయ్య తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి ఫణిగిరి గ్రామానికి కారులో వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. మాటేసి.. వేటేసి.. రాత్రి 8గంటల సమయంలో ఇంటినుంచి కారులో బయటికి వెళ్లిన కొమ్ము యాకయ్య గ్రామశివారులో బంధం మైసమ్మ ఆలయం వద్ద గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కారులో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఫణిగిరికి చెందిన మూరగుండ్ల సురేష్, జలాల్‌పురానికి చెందిన కొమ్ము చింతయ్య వచ్చి మద్యం సేవిస్తున్న యాకయ్య కుడివైపు చాతిపై కత్తితో పొడిచారు వెంటనే యాకయ్య వారినుంచి తప్పించుకునేందుకు కారు అద్దాలను బిగించుకుని 100 ఫోన్ చేశాడు. దుండగులు వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి మరోమారు కత్తితో యాకయ్యపై దాడిచేశారు. వెంటనే యాకయ్యను కారు నుంచి కిందికి లాగి బండరాయితో తలపై మోదడంతో ప్రాణా లు విడిచాడు. 100 కాల్ నుంచి సమాచారం అందుకున్న స్థాని క పోలీసులు వర్షం పడుతుండటంతో పరిసర ప్రాంతాలను గాలించి రాత్రి 11.30సమయంలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాకయ్య తల్లీ కొమ్ము సో మలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పాత కక్షలతోనే.. యాకయ్య, మూరగుండ్ల సురేష్‌లు గతంలో ఇద్దరు కలిసి పశువుల వ్యాపారం చేసే వారు. ఇద్దరి మధ్య లావాదేవీల్లో తేడా రావడంతో ఐదు నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ చో టు చేసుకుంది. దీంతో సురేష్ ఎలాగైన యాకయ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుని అదునుకోసం వేచి చూస్తున్నాడు. యాకయ్య ఐదు నెలల అనంతరం బం«ధువు వివాహ నిమిత్తం ఫణిగిరికి రావడంతో సురేష్ ఇదే అదునుగా భావించాడు. తొలుత శుభకార్యం జరుగుతున్న సూర్యాపేటలోనే యాకయ్యతో ఘర్షణ పడ్డాడు. అక్కడ పలువురు సముదాయించడంతో మిన్నకుండి పోయాడు. ఆ తర్వాత గ్రామంలో పథకం ప్రకారం కాపుకాసి మరికొందరితో కలిసి ఘాతుకానికి తెగబడ్డాడు. నలుగురు కలిసి హత్యచేశారా? మద్యం తాపించాలంటూ రాత్రి 8గంటల సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌చేసి యాకయ్యను గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడే సురేష్, చింతయ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, చింతయ్యలతో పాటు బయటికి తీసుకెళ్లిన వ్యక్తి, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి పథకం ప్రకారం యాకయ్యను హత్యచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ప్రధాన నిందితులు సురేష్, చింతయ్యలు పరారీలో ఉండగా...మరో ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
లండన్‌లో హైదరాబాదీ హత్య
హైదరాబాద్: లండన్‌లో హైదరాబాద్ యువకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర లండన్‌లోని వెల్లింగ్టన్ స్ట్రీట్‌లో టెస్కో సూపర్మార్కెట్లో పనిచేస్తున్న నదీముద్దీన్ (24) అదే సంస్థ పార్కింగ్‌లో కత్తిపోట్లతో చనిపోయాడు. అయితే, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. నదీముద్దీన్తో పరిచయం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారని లండన్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఓ 26 ఏళ్ల అనుమానితుడు (అదే సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్తానీ) పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నదీమ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి లండన్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే ఈయనకు పర్మనెంట్ రెసిడెన్సీ హోదా లభించగా.. మరికొద్ది రోజుల్లో బ్రిటన్ పౌరసత్వం లభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. మే 8న (బుధవారం) విధులకు వచ్చిన తర్వాత నదీమ్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో లండన్‌లో ఆయనతోపాటు ఉంటున్న తల్లిదండ్రులు, భార్య డాక్టర్ అఫ్షా.. సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో ఆ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వెతుకుతుండగా.. పార్కింగ్ స్థలంలో తీవ్రమైన గాయాలతో పడివున్న నదీమ్‌ను గుర్తించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. హత్య విషయం తెలియగానే ఆయన భార్య షాక్‌కు గురయ్యారు. వైద్యులు ఆమెకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందిస్తున్నారు. నదీమ్ మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. లండన్‌లోనే అంత్యక్రియలు హైదరాబాద్‌లో 2012లో డిగ్రీ పూర్తి చేసిన నదీమ్.. ఉపాధికోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే తల్లిదండ్రులను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అఫ్షాతో ఆయనకు వివా హం జరిగింది. గర్భిణీ అయిన 25 రోజుల క్రితమే లండన్ వెళ్లారు. హత్య విషయం తెలియగానే.. పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతం లోని నూర్ఖాన్ బజార్‌లోని నదీమ్ ఇంటి వద్ద బంధువులు విషాదంలో మునిగిపోయారు. కాగా, నదీమ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశాల్లేవని.. లండన్‌లోనే అంత్యక్రియలు జరి పే అవకాశముందని సన్నిహిత వర్గాలంటున్నాయి. దీంతో కొందరు సన్నిహిత కుటుంబసభ్యులే లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరి ప్రయాణానికి సహకరించాలంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. -
యువకుడి దారుణహత్య
సాక్షి, అనంతపురం సెంట్రల్ : నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన శ్రీరాములు(35) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాగుడు అలవాటున్న శ్రీరాములు రోజూ పొద్దుపోయేంత వరకు ఇంటికి వెళ్లేవాడు కాదు. సోమవారం కూడా పూటుగా మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుత్తిరోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో జన సంచారం తక్కువగా ఉండటంతో ఆలస్యంగా గుర్తించారు. భూ వివాదమే కారణమా..? గుంతకల్లు పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి, హేమకోటరెడ్డి దాయాదుల మధ్య 30 ఎకరాల భూ వివాదం నడుస్తోంది. సదరు భూమిని సుధాకర్‌రెడ్డి.. శ్రీరాములు పేరుతో జీపీఏ చేయించాడు. అనంతరం తాడిపత్రికి చెందిన మరో వ్యక్తికి అమ్మాడు. హేమకోటిరెడ్డి కూడా అదే భూమిని మరో వ్యక్తికి విక్రయించాడు. ప్రస్తుతం భూ సమస్య గుంతకల్లు కోర్టులో నడుస్తోంది. శ్రీరాములు సోమవారం కూడా అక్కడి కోర్టుకు హాజరై వచ్చాడు. దాదాపు రూ.కోట్లలో ఈ భూమి విలువ జేస్తుండడంతో శ్రీరాములును తప్పించేందుకే హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అదృశ్యమైన యువకుడు దారుణ హత్య
తుర్కయంజాల్: అదృశ్యమైన ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సత్తి తండాకు చెందిన నేనావత్ రాజు నాయక్ (26) లింగోజిగూడ విజయపురికాలనీలో భార్య కవిత, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా రాజునాయక్ మాదన్నపేటలోని ఓ హోటల్లో ఉదయం వేళల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం సంతోష్‌నగర్‌లో మిర్చి కొట్టు దగ్గర పనిచేస్తున్నాడు. గత నెల 31న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి పిలిపించుకున్నారని, ఆ తర్వాత రాజునాయక్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. సోమవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ సాగర్ రోడ్డు పక్కనే ఉన్న విపశ్యన ధ్యాన కేంద్రం చెట్ల పొదల్లో రాజునాయక్ మృతదేహం, బైకు, చెప్పులు పడి ఉన్నాయి. గమనించిన కొందరు వ్యక్తులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించడంతో వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ, ఎస్సై రాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం అదృశ్యమైన రాజు నాయక్‌దిగా గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య
•డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో పోలీసుల వేట •కొడుపాక శివారులో కలకలం పాపన్నపేట: మండల పరిధిలోని కొడుపాక శివారులో గుర్తు తెలియని పాతికేళ్ల యువకుడు శుక్రవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధాలతో గొంతుకోసి తలపై నరికి చంపారు. గ్రామ శివారులో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన హంతకులను పట్టుకునేందుకు పోలీసు లు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో వేట ప్రారంభించారు. మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కొడుపాక శివారులో రోడ్డు పక్కనే గల వరిపొలాల్లో తీవ్రగాయాల పాలైన గుర్తు తెలియని యువకుడు కొన ఊపిరిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. ఉదయం 9 గంటల వరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే బాధితుడు మృత్యువాత పడ్డాడు. అతని జేబుల్లో వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపై ఆకుపచ్చ ఫుల్ షర్ట్, నలుపురంగు జీన్స్‌ప్యాంట్ ఉన్నా యి. బెల్టు బకెల్పై ఆర్ అనే అక్షరం ఉంది. ఎడమచేతి మడమపై ఆంగ్లలో కె.ఎస్. అనే అక్షరాలు, కుడిచేతి బొటనవేలిపై కె.ఎస్.సాయి అనే అక్షరాలు, కుడిచేతి భుజంపై ఓం ఆకారంలో పచ్చబొట్లు ఉన్నాయని ఎస్ఐ వివరించారు. కాగా సంఘటన స్థలాన్ని క్లూస్‌టీం సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింలు, డాగ్‌స్క్వాడ్ అధికారులు సందర్శించి పరిశోధన ప్రారంభించారు. సదరు యువకుడిని హత్య చేసిన చోట పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గొంతు, తలపై పదునైన ఆయుధాలతో దాడి చేయడం వల్ల అతడు మరణించి ఉంటాడని పోలీసులు అనుకుంటున్నారు.ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉం టుందని భావిస్తున్నారు. మృతుడు సమీప జిల్లాల కు చెందిన వాడైఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
భూ వివాదంలో యువకుడి దారుణహత్య
పాపన్నపేట : భూ వివాదంలో యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని శానాయిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాగా తోటి ఇల్లరికపు అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన బక్కొళ్ల హన్మయ్యకు కొంతకాలం క్రితం నర్సమ్మతో వివాహం జరిగింది. ఆమెకు దుర్గమ్మ అనే కూతురు జన్మించాక అనారోగ్య పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. అనంతరం హన్మయ్య పోచమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాక.. గంగమణి అనే కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో మొదటి భార్య కుమార్తె దుర్గమ్మను మెదక్ మండలం ముత్తాయికోట గ్రామానికి చెందిన సత్తయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. అనంతరం రెండో భార్య పోచమ్మ కుమార్తె గంగమణిని శానాయిపల్లి గ్రామానికి చెందిన అంతయ్య, మల్లవ్వల దంపతుల కుమారుడు ఏసయ్య (30)తో పెళ్లి చేసి వారిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సత్తయ్య, ఏసయ్యల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ నెల 24న ఏసయ్య కుమారులు ప్రభు, ప్రశాంత్‌లను వారి పెద్దనాన్న అయిన సత్తయ్య దూషించాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగాయి. కాగా గురువారం రాత్రి ఏసయ్య తన పొలానికి నీరు పారబెట్టేందుకు కాపాలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం తెల్లవారే సమయానికి ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య గంగమణి తన పెద్ద కొడుకు ప్రభును పొలం వద్దకు పంపింది. అక్కడికి వెళ్లే సరికి ఏసయ్య తలకు తీవ్రగాయాలై చనిపోయి ఉన్నాడు. సత్తయ్యనే హంతకుడా? కాగా తోడల్లుడు సత్తయ్య గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారు జామున సత్తయ్య చేతికి రక్తం అంటిన విషయాన్ని ఆయన భార్య దుర్గమ్మ గుర్తించి ఆ విషయమై నిలదీసింది. అంతలోనే ఏసయ్య తన పొలం వద్ద హత్యకు గురైన విషయం దుర్గమ్మకు తెలియడంతో ఆమె తన భర్త సత్తయ్యను నిలదీస్తూ ఏసయ్య హత్యకు సత్తయ్యనే కారకుడని ఆరోపించింది. ఈ మేరకు పాపన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మెదక్ సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంగారెడ్డి నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ గ్రామంలో కలియ తిరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు సత్తయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఏసయ్య మృతి పట్ల గ్రామస్తులంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సత్తయ్యను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.