లండన్‌లో హైదరాబాదీ హత్య | Hyderabad Man killed in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో హైదరాబాదీ హత్య

May 11 2019 2:06 AM | Updated on May 11 2019 10:01 AM

Hyderabad Man killed in London - Sakshi

నూర్‌ఖాన్‌బజార్‌లోని నదీముద్దీన్‌ నివాసం, హత్యకు గురైన మహ్మద్‌ నదీముద్దీన్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌: లండన్‌లో హైదరాబాద్‌ యువకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర లండన్‌లోని వెల్లింగ్టన్‌ స్ట్రీట్‌లో టెస్కో సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న నదీముద్దీన్‌ (24) అదే సంస్థ పార్కింగ్‌లో కత్తిపోట్లతో చనిపోయాడు. అయితే, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. నదీముద్దీన్‌తో పరిచయం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారని లండన్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఓ 26 ఏళ్ల అనుమానితుడు (అదే సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్తానీ) పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నదీమ్‌ తల్లిదండ్రులు, భార్యతో కలిసి లండన్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే ఈయనకు పర్మనెంట్‌ రెసిడెన్సీ హోదా లభించగా.. మరికొద్ది రోజుల్లో బ్రిటన్‌ పౌరసత్వం లభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలోనే ఈ దారుణం జరిగింది.

మే 8న (బుధవారం) విధులకు వచ్చిన తర్వాత నదీమ్‌ తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో లండన్‌లో ఆయనతోపాటు ఉంటున్న తల్లిదండ్రులు, భార్య డాక్టర్‌ అఫ్షా.. సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో ఆ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వెతుకుతుండగా.. పార్కింగ్‌ స్థలంలో తీవ్రమైన గాయాలతో పడివున్న నదీమ్‌ను గుర్తించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. హత్య విషయం తెలియగానే ఆయన భార్య షాక్‌కు గురయ్యారు. వైద్యులు ఆమెకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. నదీమ్‌ మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.  

లండన్‌లోనే అంత్యక్రియలు 
హైదరాబాద్‌లో 2012లో డిగ్రీ పూర్తి చేసిన నదీమ్‌.. ఉపాధికోసం లండన్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే తల్లిదండ్రులను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అఫ్షాతో ఆయనకు వివా హం జరిగింది. గర్భిణీ అయిన 25 రోజుల క్రితమే లండన్‌ వెళ్లారు. హత్య విషయం తెలియగానే.. పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతం లోని నూర్‌ఖాన్‌ బజార్‌లోని నదీమ్‌ ఇంటి వద్ద  బంధువులు విషాదంలో మునిగిపోయారు. కాగా, నదీమ్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశాల్లేవని.. లండన్‌లోనే అంత్యక్రియలు జరి పే అవకాశముందని సన్నిహిత వర్గాలంటున్నాయి. దీంతో కొందరు సన్నిహిత కుటుంబసభ్యులే లండన్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరి ప్రయాణానికి సహకరించాలంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీకి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement