సాయితేజపై రాడ్లు, కత్తులతో దాడి చేస్తున్న నిందితులు (సీసీ టీవీ ఫుటేజీ)
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సరదాగా మాట్లాడుకుందామని పిలిచిన స్నేహితులు ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. గురువారం అర్ధరాత్రి మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ హత్యోదంతానికి సంబంధించి ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రేపాక సాయితేజ (22) తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లుతో కలిసి పంజాబ్ హోటల్ సమీప గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొద్ది రోజుల కిందట వేరే వ్యక్తి అంత్యక్రియల సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఓ యువకుడిని సాయితేజ కొట్టాడు.
అది మనసులో పెట్టుకున్న ఆ యువకుడి స్నేహితులు తేజపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సాయి తేజ స్నేహితులు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పిలిచారు. వారంతా మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌కు చేరుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నాక వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో తేజపై దాడికి యత్నించారు. వెంటనే ప్రాణభయంతో పరుగులు తీసిన తేజ సమీపంలోని ఓ ఇంటి మెట్లు ఎక్కుతుండగా బలవంతంగా కిందకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఓ యువకుడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
సన్నిహితులే హంతకులు!
పాత కక్షలు కారణంగా రాత్రి సమయంలో కొంత మంది స్నేహితులు తమ కుమారుడికి ఫోన్ చేసి తీసుకెళ్లి చంపేశారని మృతుని తండ్రి పైడిరాజు ఆరోపిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇంతలోనే చంపేశారని బోరున విలపిస్తున్నారు. తన కొడుకుతో తిరుగుతూ, మా ఇంట్లో తిన్నవారే పొట్టన పెట్టుకున్నారంటూ మృతుడి తల్లి లక్ష్మి వాపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా తేజపై కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్లు కనిపించింది.
ఆ దిశగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులుగా భావిస్తున్న బంగారిరాజు, మోహన్, యూసఫ్ ఖాన్, రవి, సురేష్, నాని, బాలు, హరిపై మృతుని తండ్రి ఫిర్యాదు చేశారు. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితులంతా గ్రీన్ గార్డెన్స్, రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వారని గుర్తించారు. యువకుడి హత్యపై దర్యాప్తు చేస్తున్నామని ఏడీసీపీ పెంటారావు తెలిపారు. మృతునికి, అతని స్నేహితులకు పాత కక్షలున్నాయని... ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో హత్యకు దారి తీసిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment