నూరేళ్లకూ మసకబారని చూపు...
బేతి శ్రీరాములు బి.ఎస్.రాములుగా పాఠకులెరిగిన రచయిత. పుట్టిన గడ్డ జగిత్యాల . తండ్రి ‘బొంబాయి’ బట్టలమిల్లు కార్మికుడు. తల్లి బీడీ కార్మికురాలు. ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు. 1964లో ఆర్.ఎస్.ఎస్ క్రియాశీలిగా మొదలయ్యి ’78లో ముఖ్యశిక్షక్‌గా ఎదిగి ఆ తర్వాత 90 వరకూ విప్లవరాజకీయాల్లో కొనసాగి పూలే-అంబేద్కర్ల అధ్యయనం వల్ల దళిత-బహుజన దార్శనికతతో రచనలు చేశారు. కరీంనగర్ మాండలీకంలో 1982లో ప్రచురితమైన ఆయన తొలి నవల ‘బతుకు పోరు’. ఇప్పుడు రెండవ నవల ‘చూపు’ ముద్రణలో ఉంది. ‘చూపు’ ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ కేంద్రకం నుంచి చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలను కలుపుతూ మలచిన వృత్తం! ‘చూపు’ గురించి ఆయన మాటల్లోనే...
ఏ మంచి నవలైనా సమాజాన్ని వ్యక్తీకరిస్తుంది. భవిష్యత్‌కూ ఉపకరిస్తుంది. బంకించంద్ర ‘ఆనందమఠ్’, రవీంద్రుని ‘గోరా’, ప్రేమ్‌చంద్ ‘రంగభూమి’ ఇందుకు ఉదాహరణలు. 1948లో లక్షీకాంత మోహన్ తెలంగాణపై తొలి నవల రాశారు. ఆ తర్వాత ఆళ్వారుస్వామి, దాశరథి తాము చూసిన తెలంగాణ సమాజపు సంక్షోభాలను నవలీకరించారు. ‘చూపు’లో తెలంగాణ ఉద్యమంలో మూడవ దశ కు సంబంధించిన సంఘటనలుంటాయి. తీసుకున్న కాలం 1989 నుంచి 2008 వరకూ. అంటే రాష్ట్ర ఆవిర్భావానికి ఐదేండ్ల ముందు వరకూ. 1996 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన 36 సంస్థలతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరించుకుని తెలంగాణ గురించి ఫిక్షన్‌గా చెప్పిన నాన్ఫిక్షన్ ‘చూపు’.
ఎన్నో ‘చూపు’ల సమదృష్టి!
‘చూపు’లో తల్లి- తండ్రి- విద్యార్థులు- అధ్యాపకులు- స్త్రీవాదులు- దళితులు- వామపక్షవాదులు- కాంట్రాక్టర్లు ఇలా కీలకమైన 15 పాత్రలు ఉన్నాయి. ఆధిపత్యకులాల నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించాల్సి రావడం వెనుక ఉన్న కారణాలను ఈ పాత్రలు వెల్లడిస్తాయి. ఈ పాత్రల్లో ఎవరి చూపు వారిదే. నవలను ఆకళింపు చేసుకుంటే రచయిత ‘చూపు’ తెలుస్తుంది. అది ఎంత వరకు నిష్పాక్షికం ఏ మేరకు ఆ విశ్లేషణను ఆచరణలో వినియోగించుకోవాలి అనే అంశాన్ని పాఠకులు నిర్ణయించుకుంటారు. ఇందులోని పాత్రలు వాస్తవిక వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రొ.లక్ష్మీపతి పాత్ర ప్రొ.జయశంకర్ వంటి తెలంగాణ మేథావుల సమ్మిళిత రూపం.
పార్టీ ఐఏఎస్‌లూ, పార్టీ సీఈవోలు!
ఉద్యమాలు విజయవంతం అయిన తర్వాత ‘మరోప్రపంచం’ ఊడిపడదని ఇందులో కొన్ని పాత్రలు కుండబద్దలు కొడతాయి. కమ్యూనిస్ట్ పాలన వస్తే ఇప్పటి ఐ.ఏ.ఎస్‌లు, ిసీ.ఈ.వోలూ, కాంట్రాక్టర్లు అంతరించి పోరని వీరి కుర్చీల్లో పార్టీ ప్రముఖులు వారి వారసులు ఆయా హోదాలలో వస్తారని వర్తమాన ‘కమ్యూనిస్ట్’ దేశాల పాలనాధోరణులను సోదాహరణంగా వివరించే కేపిటలిస్టులూ నవలలో ఉన్నారు. కులవృత్తుల సమాజం పారిశ్రామికవేత్తలు వచ్చేవరకూ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటుంది. పెట్టుబడికి కులస్వభావం ఉండదు. వర్గస్వభావం కూడా ఉండదు. ‘లాభ’స్వభావం మాత్రమే ఉంటుందనే సంభాషణలూ ఉన్నాయి!
ఎందుకివ్వాలి? ఎందుకివ్వకూడదు!
కొన్ని పాత్రలు ఆంధ్రా-తెలంగాణ ఆర్థిక మనస్తత్వాలను చర్చిస్తాయి. ఆంధ్రావాళ్లు దోపిడీ చేస్తున్నారనే ఆవేదనలుంటాయి. అందుకు ఎటువంటి పరిస్థితులు దోహదపడుతున్నాయి అనే వివేచన ఉండాలి కదా! ఆంధ్రప్రాంతంలో కేపిటలిస్ట్ దృక్పథం ఉంది. తెలంగాణలో భూస్వామ్యధోరణే చలామణిలో ఉంది. ఇక్కడి సమాజంపై జైన, శైవ ప్రభావాలున్నాయి. ఉన్నది చాలులే అనే ‘అంతఃచేతన’ ఉంది. అయితే ‘వనరులు ఎన్ని ఉన్నా స్థానికులు వాటిని ఉపయోగించుకుని ఎదగకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పారిశ్రామిక వేత్తలుగా, పెట్టుబడి దారులుగా స్థిరపడిపోతారు’ అని ‘చూపు’లో ఒక పాత్ర స్పష్టం చేస్తుంది. తెలంగాణ సమాజం తన సాంస్కృతిక విలువలను కోల్పోకుండా ‘వాణిజ్య దృక్పథం’ సంతరించుకోవాలని ‘ఎంటర్‌ప్రెన్యూయర్ సైకాలజీ’ అవసరమని కొన్ని పాత్రలు నొక్కిచెబుతాయి! సారాంశంలో నూరేళ్ల తర్వాతైనా ‘చూపు’ మసకబారదని, పాఠకులతో సంభాషిస్తుందని విశ్వసిస్తున్నాను!
- పున్నా కృష్ణమూర్తి