BS rao
-
శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. BS రావు కన్నుమూత
హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు కన్నుమూశారు. BS రావు వయస్సు 75 ఏళ్లు. ఈ ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురయినట్టు శ్రీచైతన్య వర్గాలు తెలిపాయి. దీంతో బి.ఎస్. రావును హుటాహుటిన జూబ్లీహిల్స్ అపొలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించినా.. బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడలోని తాడిగడపకు తరలిస్తారు. ఆయన కూతురు సీమ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. ఆమె తిరిగిరాగానే BS రావు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తారు. అలుపెరుగుని విద్యా ప్రస్థానం డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన BS రావు.. లండన్ లో MRSH చదివారు. అక్కడే ఇంగ్లండ్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలం ఇరాన్ లో వైద్య సేవలు అందించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. భార్య భర్తలిద్దరు విదేశాల్లో మెడిసిన్ ప్రాక్టీస్ అనంతరం 1986లో దేశానికి తిరిగి వచ్చారు. (భార్య ఝాన్సీ లక్ష్మీబాయితో బీఎస్ రావు) పోరంకి నుంచి అన్ని రాష్ట్రాల్లోకి 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, వాటిని అగ్రపథంలో నడిపించారు. విజయవాడలోని పోరంకిలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛండీఘర్, రాంచీ, బొకారో, ఇండోర్ లలో బ్రాంచ్ లు నెలకొల్పారు. కర్ణాటకలో బెంగళూరు, గంగావతి, రాయచూరులలో ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 CBSE స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 8లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానానికి చేరడానికి విశేషకృషి చేశారు BS రావు. వారసత్వానికి బాధ్యతలు BS రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు సీమ, మరొకరు సుష్మ. ఇద్దరు కూతుళ్లకు విద్యాసంస్థల బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు BS రావు. శ్రీచైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్ గా సీమ ఉన్నారు. ఇక సుష్మ సంస్థకు CEOగా, అకడమిక్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 45 వేల మంది పని చేస్తున్నారు. సమాజానికి తన వంతుగా విద్యారంగంలో BS రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధిత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్ కారణంగా కన్ను మూసిన కుటుంబాల నుంచి వంద మంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు BS రావు. -
చైతన్య గ్రూప్ కాలేజీస్ ఛైర్మన్ సంచలన ఆరోపణలు
-
లింగమనేని రమేష్ మోసం చేశారు: చైతన్య గ్రూప్ ఛైర్మన్ ఆరోపణలు ఇవే..
సాక్షి, అమరావతి: చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్టపై ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు అప్పగించాడు లింగమనేని రమేష్. కాగా, బీఎస్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లింగమనేని రమేష్‌కు 2012-13లో రూ.310 కోట్లు ఇచ్చాం. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారు. లింగమనేని కావాలనే మమ్మల్ని మోసం చేశాడు. రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చెల్లలేదు. లింగమనేని మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఆయన మోసాలపై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. తీసుకున్న డబ్బుకు మాకు న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. 2016లో ఎంవోయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. లింగమనేని చేసిన మోసాలపై ఇప్పటివరకు 6 FIR లు ఫైల్ అయ్యాయని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయగా.. లింగమనేని చేసిన మోసాలపై నెలవారీగా తనకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని బీఎస్ రావు తెలిపారు. -
‘ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్’ విజేత శ్రీ చైతన్య
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో సేవలకు గాను ఏషియావన్ మేగజైన్ ప్రకటించిన ‘ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్–2017’ అవార్డు శ్రీ చైతన్య విద్యాసంస్థలకు దక్కింది. విజేతను ప్రఖ్యాత సంస్థ ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ ఎంపిక చేసింది. సింగ పూర్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బీఎస్ రావు తరఫున అకడమిక్ డైరెక్టర్ సుష్మ అవార్డును స్వీకరించారు. ఇది తమ సంస్థ అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవమని బీఎస్ రావు పేర్కొన్నారు. -
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో..
శ్రీచైతన్య స్కూల్ టెక్నో విద్యార్థుల జయభేరి హైదరాబాద్: సీబీఎస్ఈ-2014 పదోతరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ విద్యార్థులు జయభేరి మోగించినట్టు అకడమిక్ డెరైక్టర్ సీమ ఓ ప్రకటనలో తెలిపారు. 253 మంది సంస్థ విద్యార్థులు సీజీపీఏ 10కి 10 పాయింట్లు సాధించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా సీబీఎస్ఈ బ్రాంచీల్లో సగటున 25 శాతం విద్యార్థులకు జీపీఏ 10కి 10 పాయింట్లు, 100 శాతం పాస్ పర్సంటేజ్ సాధించి దేశంలో నంబర్ 1 పాఠశాలగా నిలిచినట్టు తెలిపారు. కోర్ సబ్జెక్టులతో పాటు భాషల్లో కూడా తామందిస్తున్న పటిష్ట ఫౌండేషన్, పరిశోధనాత్మక కార్యక్రమాలు, ఒత్తిడిలేని బోధనా పద్ధతుల కారణంగానే తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ బీఎస్ రావు అభినందించినట్టు తెలిపారు.