హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు కన్నుమూశారు. BS రావు వయస్సు 75 ఏళ్లు. ఈ ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురయినట్టు శ్రీచైతన్య వర్గాలు తెలిపాయి. దీంతో బి.ఎస్. రావును హుటాహుటిన జూబ్లీహిల్స్ అపొలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించినా.. బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడలోని తాడిగడపకు తరలిస్తారు. ఆయన కూతురు సీమ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. ఆమె తిరిగిరాగానే BS రావు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తారు.
అలుపెరుగుని విద్యా ప్రస్థానం
డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన BS రావు.. లండన్ లో MRSH చదివారు. అక్కడే ఇంగ్లండ్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలం ఇరాన్ లో వైద్య సేవలు అందించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. భార్య భర్తలిద్దరు విదేశాల్లో మెడిసిన్ ప్రాక్టీస్ అనంతరం 1986లో దేశానికి తిరిగి వచ్చారు.
(భార్య ఝాన్సీ లక్ష్మీబాయితో బీఎస్ రావు)
పోరంకి నుంచి అన్ని రాష్ట్రాల్లోకి
1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, వాటిని అగ్రపథంలో నడిపించారు. విజయవాడలోని పోరంకిలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛండీఘర్, రాంచీ, బొకారో, ఇండోర్ లలో బ్రాంచ్ లు నెలకొల్పారు. కర్ణాటకలో బెంగళూరు, గంగావతి, రాయచూరులలో ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 CBSE స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 8లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానానికి చేరడానికి విశేషకృషి చేశారు BS రావు.
వారసత్వానికి బాధ్యతలు
BS రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు సీమ, మరొకరు సుష్మ. ఇద్దరు కూతుళ్లకు విద్యాసంస్థల బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు BS రావు. శ్రీచైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్ గా సీమ ఉన్నారు. ఇక సుష్మ సంస్థకు CEOగా, అకడమిక్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 45 వేల మంది పని చేస్తున్నారు.
సమాజానికి తన వంతుగా
విద్యారంగంలో BS రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధిత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్ కారణంగా కన్ను మూసిన కుటుంబాల నుంచి వంద మంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు BS రావు.
Comments
Please login to add a commentAdd a comment