BSE 30
-
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్..
ఎఫ్ అండ్ వో ముగింపు ఎఫెక్ట్ ఆయిల్ ధరల కదలికలూ కీలకమే ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: రుతుపవనాల పురోగతి, ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా వేడెక్కిన ఆయిల్ ధరలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచా వేశారు. వీటికితోడు గురువారం(26న) జూన్ నెల ఎఫ్ అండ్ వో సిరీస్ ముగియనున్నందున ప్రధాన ఇండెక్స్‌లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. జూన్ డెరివేటివ్ పొజిషన్లను ట్రేడర్లు రోల్ఓవర్ చేసుకోవడం కూడా ఇందుకు కారణంగా నిలవనుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు కూడా దేశీ ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. భారీ పొజిషన్లు వద్దు గడిచిన శుక్రవారం మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి దిగివచ్చాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25,105 వద్ద, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,511 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే వారం ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అత్యధిక స్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యే కౌంటర్లకు దూరంగా ఉండటమే మేలని, ఇదే విధంగా గరిష్ట స్థాయిలో ట్రేడర్లు పొజిషన్లు తీసుకోవడం సమర్థనీయం కాదని సూచించారు. ధరల పెరుగుదలకు అవకాశం ఈ వారం మార్కెట్లకు రుతుపవనాలు కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆహారోత్పత్తి తగ్గుతుందని, ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగభాగం వ్యాపించినప్పటికీ 4 రోజులు ఆలస్యమైన విషయం విదితమే. దీంతో జూన్ 1-18 మధ్య సాధారణంకంటే 45% తక్కువగా వర్షాలు పడ్డాయి. వెరసి ఇకపై వీటి పురోగమనం దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుందని మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై దృష్టి ఇకపై రుతుపవనాల కదలికలతోపాటు, జూలై రెండో వారంలో వెలువడనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా చెప్పారు. సమీప కాలానికి ఈ రెండు అంశాలే మార్కెట్లకు దిశను నిర్దేశిస్తాయని తెలిపారు. ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోపాటు, ఇతర సంస్కరణలను ప్రకటిస్తే దేశీ మార్కెట్లు ఇతర వర్ధమాన మార్కెట్లకు మించి దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. అయితే ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగితే కరెంట్ ఖాతాలోటు, రూపాయి, ద్రవ్యోల్బణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అమెరికా గణాంకాలు... ఈ వారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. మే నెలకు వినియోగ వస్తు రంగ ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. కాగా, ఇరాక్‌లో చెలరేగిన అంతర్యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 115 డాలర్లను తాకడంతో దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. చమురు అవసరాలకు విదేశాలపై అధికంగా ఆధారపడటంతో దిగుమతుల బిల్లు పెరిగి దేశీ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న అంచనాలు గత వారం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ వరుసగా రెండో వారం కూడా నష్టాలతో ముగిసింది. -
వచ్చే ఐదేళ్లు సెన్సెక్స్ సగటున 25 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో వచ్చే ఐదారేళ్లు ఈక్విటీలు ఏడాదికి సగటున 20 నుంచి 25 శాతం లాభాలను అందించే అవకాశం ఉందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేసింది. అంచనాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే 2020 నాటికి సెన్సెక్స్ కీలకమైన 1,00,000 పాయింట్లను దాటుతుందని కార్వీ పీఎంఎస్ హెడ్ వేణు గోయల్ తెలిపారు. అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా అన్ని అంశాలు ఈక్విటీ మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి, రానున్న కొద్ది సంవత్సరాలు సెన్సెక్స్ కంపెనీల ఆదాయం 20 నుంచి 25 శాతం వృద్ధి ఉంటే, అది సెన్సెక్స్ ఈపీఎస్‌కి 15 నుంచి 17 రెట్లకు సమానమని, ఈ విధంగా చూసినా సెన్సెక్స్ లక్ష మార్కును సులభంగా దాటుతుందన్నారు. 2012-13లో సెన్సెక్స్ కంపెనీల ఆదాయంలో 5 శాతం వృద్ధి ఉంటే అది 2013-14కి 10 శాతానికి చేరిందని, అది ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని కార్వీ తన నివేదికలో పేర్కొంది. అత్యాశ కాదు.. ఐదేళ్లలో సగటున 20 నుంచి 25 శాతం రాబడిని ఆశించడం అత్యాశ కాదని, అంతర్జాతీయ మార్కెట్లలో పలు సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కార్వీ ఆ నివేదికలో పేర్కొంది. ముఖ్యం గా 1980వ దశకంలో డౌజోన్స్ వ్యవహరించిన తీరుకు ఇప్పటి మన మార్కెట్లకు చాలా సామీప్యం ఉంది. 1982లో 777 పాయింట్ల వద్ద ఉన్న డౌజోన్స్ కేవలం ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగి 2,742 పాయింట్లకు చేరింది. 1987లో భారీ పతనం తర్వాత 1990 వరకు ఒక పరిమిత శ్రేణిలో కదిలింది. ఆ తర్వాత ప్రారంభమైన ర్యాలీ ఆగకుండా పదేళ్లు కొనసాగి డౌజోన్స్ 11,750 పాయింట్లకు పెరిగింది. అంటే 18 ఏళ్లలో డౌజోన్స్ ఇన్వెస్టర్లకు 1,500%కిపైగా లాభాలను అందించింది. ఇప్పుడు మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కార్వీ తన నివేదికలో పేర్కొంది. అన్ని శుభ సూచనలే.. ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 6 శాతానికి చేరుకొని అది రానున్న కాలంలో 8 శాతానికి చేరుతుందని కార్వీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, సేవల రంగాల వృద్ధి బాగుంటుందని, దీనికి వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తోడైతే తయారీ రంగం కూడా గాడిలో పడుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని పేర్కొంది. ఇప్పటికే 2013లో ఎఫ్ఐఐలు 20 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ఈ ఏడాది మరింత అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడుల వాతావరణం మెరుగవుతుండటం, అమెరికా, యూరోప్ ఆర్థిక వ్యవస్థలు వృద్ధిబాటలో పడుతుండటం ఇలా అన్ని ఈక్విటీలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిం టినీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నట్లు కార్వీ పేర్కొంది.