వచ్చే ఐదేళ్లు సెన్సెక్స్ సగటున 25 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో వచ్చే ఐదారేళ్లు ఈక్విటీలు ఏడాదికి సగటున 20 నుంచి 25 శాతం లాభాలను అందించే అవకాశం ఉందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేసింది. అంచనాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే 2020 నాటికి సెన్సెక్స్ కీలకమైన 1,00,000 పాయింట్లను దాటుతుందని కార్వీ పీఎంఎస్ హెడ్ వేణు గోయల్ తెలిపారు. అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా అన్ని అంశాలు ఈక్విటీ మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి, రానున్న కొద్ది సంవత్సరాలు సెన్సెక్స్ కంపెనీల ఆదాయం 20 నుంచి 25 శాతం వృద్ధి ఉంటే, అది సెన్సెక్స్ ఈపీఎస్‌కి 15 నుంచి 17 రెట్లకు సమానమని, ఈ విధంగా చూసినా సెన్సెక్స్ లక్ష మార్కును సులభంగా దాటుతుందన్నారు. 2012-13లో సెన్సెక్స్ కంపెనీల ఆదాయంలో 5 శాతం వృద్ధి ఉంటే అది 2013-14కి 10 శాతానికి చేరిందని, అది ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని కార్వీ తన నివేదికలో పేర్కొంది.
అత్యాశ కాదు..
ఐదేళ్లలో సగటున 20 నుంచి 25 శాతం రాబడిని ఆశించడం అత్యాశ కాదని, అంతర్జాతీయ మార్కెట్లలో పలు సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కార్వీ ఆ నివేదికలో పేర్కొంది. ముఖ్యం గా 1980వ దశకంలో డౌజోన్స్ వ్యవహరించిన తీరుకు ఇప్పటి మన మార్కెట్లకు చాలా సామీప్యం ఉంది. 1982లో 777 పాయింట్ల వద్ద ఉన్న డౌజోన్స్ కేవలం ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగి 2,742 పాయింట్లకు చేరింది. 1987లో భారీ పతనం తర్వాత 1990 వరకు ఒక పరిమిత శ్రేణిలో కదిలింది. ఆ తర్వాత ప్రారంభమైన ర్యాలీ ఆగకుండా పదేళ్లు కొనసాగి డౌజోన్స్ 11,750 పాయింట్లకు పెరిగింది. అంటే 18 ఏళ్లలో డౌజోన్స్ ఇన్వెస్టర్లకు 1,500%కిపైగా లాభాలను అందించింది. ఇప్పుడు మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కార్వీ తన నివేదికలో పేర్కొంది.
అన్ని శుభ సూచనలే..
ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 6 శాతానికి చేరుకొని అది రానున్న కాలంలో 8 శాతానికి చేరుతుందని కార్వీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, సేవల రంగాల వృద్ధి బాగుంటుందని, దీనికి వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తోడైతే తయారీ రంగం కూడా గాడిలో పడుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని పేర్కొంది. ఇప్పటికే 2013లో ఎఫ్‌ఐఐలు 20 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ఈ ఏడాది మరింత అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడుల వాతావరణం మెరుగవుతుండటం, అమెరికా, యూరోప్ ఆర్థిక వ్యవస్థలు వృద్ధిబాటలో పడుతుండటం ఇలా అన్ని ఈక్విటీలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిం టినీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నట్లు కార్వీ పేర్కొంది.