Buddhaprasad Council
-
నేడు రజని వేడుక
ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదినాన్ని (అధిక మాసాలు కలుపుకొని 100వ జన్మదినం) పురస్కరించుకుని నేటి సాయంత్రం విజయవాడలో ఆయన అభిమానులు, మిత్రులు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. స్థానిక మినర్వా గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో వేడుకలు ప్రారంభం అవుతాయి. మండలి బుద్ధప్రసాద్, మోహన్ కందా, వి.ఎ.కె. రంగారావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేడుకల్లో పాల్గొని రజనీకాంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం భాగవతుల వెంకట్రామశర్మ బృందం రజని ‘విశ్వయానం’ రూపకాన్ని, ‘మహేశ్వరీ మహాకాళి’ గేయ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే రజని అభిమానుల నోట ఆయన గేయాల గానం ఉంటుంది. ఈ ఆత్మీయ సత్కార వేడుకలకు ఆహ్వాన సంఘ సభ్యులుగా డాక్టర్ జంధ్యాల శంకర్, కె.సదాశివరావు, సి.రాఘవాచారి, అండవిల్లి సత్యనారాయణ, గోవిందరాజన్, డాక్టర్ హేమ పరిమి, డాక్టర్ పరిమి, డాక్టర్ జి.వి.పూర్ణచందు, వి.వి.ఎమ్.కృష్ణ, వి.నాగలక్ష్మి, డి.ఇందుమతి, మూల్పూరు నర సింహారావు వ్యవహరిస్తున్నారు. చిత్రం: శంకర నారాయణ (శంకర నారాయణ ప్రముఖ చిత్రకారుడు ‘బాపు’ సోదరుడు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేశారు. ఆ సమయంలో చిత్రాన్ని గీసి రజనీకి చూపించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారట!) -
విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం
ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : తెలుగును ప్రపంచ భాషగా గుర్తించాలని, విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలని కోరుతూ యూకే (యునెటైడ్ కింగ్డమ్) తెలుగు సంఘం సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఆయన స్థానిక తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్, అమెరికాలో పర్యటిం చిన తాను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో చర్చించినట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రపంచ భాషగా తెలుగును గుర్తించి, గూగుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించినా సంస్థ ప్రతినిధులు మరుసటి రోజే గూగుల్లో తెలుగుకు స్థానం కల్పించారని, ప్రత్యేక తెలుగు పాంట్లు రూపొందించారని వివరించారు. ప్రపంచ విద్యావ్యవస్థలో తెలుగుకు రెండో భాషగా ప్రాముఖ్యత కల్పించడానికి తాముచేసిన కృషి సత్ఫాలితలనిచ్చే దిశగా సాగుతోందన్నారు. గత నెల 26, 27 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రపంచ భాషగా తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విదేశీయులు సైతం తెలుగు అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. జన్మభూమిపై ప్రవాసాంధ్రుల ఆసక్తి రాష్ట్రంలో అమలుచేస్తున్న జన్మభూమి కార్యక్రమంపై ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో వారు జన్మించిన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తుపాను నష్టంపై ప్రాథమిక సమాచారం అందించటంతో స్పందించిన అమెరికాలోని తెలుగువారు విరాళాలు ప్రకటించారని బుద్ధప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయటానికి వారికి సహకారం అందించటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు.