'వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ఆ నివేదిక..'
హైదరాబాద్: ప్రభుత్వం కావాలనే కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చతోపాటు వీడియో ఫుటేజి లీకేజీ తదితర అంశాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. కాగా ఈ కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు.
కమిటీ భేటీ అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీపై బురదజల్లే ఎజెండాతో బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక రూపొందించిందని అన్నారు. వీడియో లీకేజ్ అంశంపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేద్దామన్నా స్పందించలేదని చెప్పారు. మంత్రులు అధికార సభ్యులకు స్పీకర్ మైకు ఇచ్చి.. ప్రతిపక్ష నేతను దూషించే విధానాన్ని మానుకోవాలని నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తప్పుడు వీడియోలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొంతమందిపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందని ఇదే విషయం కమిటీలో చెప్పానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరీ, బోండా ఉమ ఎంత దారుణంగా మాట్లాడినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.