
కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకునేలా ఉంది
అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై నియమించిన బుద్ధప్రసాద్ కమిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకునేలా ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నియమించిన ఈ కమిటీ భేటీ ముగిసింది. స్పీకర్‌కు నివేదిక ఇచ్చేందుకు ఈనెల 19న కమిటీ చివరిసారిగా సమావేశం కానుంది. తాము లేవనెత్తిన అంశాలకు కమిటీ నుంచి సరైన సమాధానం రాలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
తమ అభ్యంతరాలను కమిటీ చర్చించలేదని, కేవలం వైఎస్ఆర్‌సీపీనే టార్గెట్‌గా చేసుకుని చర్చించిందని ఆయన అన్నారు. సోషల మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేద్దామని అడిగినా కమిటీ ముందుకు రాలేదని చెప్పారు. బుద్ధప్రసాద్ కమిటీతో తమకు న్యాయం జరిగేలా లేదని అన్నారు. అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీని దారుణంగా విమర్శించిన టీడీపీ నేతలపై కమిటీలో చర్చించకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలతో న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.