Burj
-
బుర్జ్ ఖలీఫా కన్నా ఎత్తైన టవర్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా కన్నా పొడవైన నిర్మాణం చేపట్టేందుకు దుబాయ్ పావులు కదుపుతోంది. దీంతో ప్రపంచంలోనే ఎత్తయిన భవనం నిర్మించి...తన రికార్డును తానే అధిగమించేందుకు సన్నద్ధం అవుతోంది. 'ది టవర్' పేరుతో దుబాయ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని నిర్మించనుంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఎత్తు ఎంత ఉంటుందన్న విషయం మాత్రం నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రకటిస్తామని వెల్లడించింది. స్పానిష్-స్విస్ శిల్పి శాంటియాగో కాలట్రవ వల్స్ రూపకల్పనలో దుబాయ్‌లో నిర్మాణం రూపొందనున్నట్లు ఎమార్ వెల్లడించింది. ఈ ప్రత్యేక నిర్మాణంలో రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటళ్ళు నిర్వహించేందుకు 18 నుంచి 20 అంతస్తులు మిశ్రమ వినియోగానికి పనికొచ్చేట్టుగా నిర్మించేందుకు పరిశీలనలో ఉన్నట్లు ఎమార్ సంస్థ ఛైర్మన్ అలబ్బర్ తెలిపారు. దుబాయ్ లోని జెడ్డాలో నిర్మించ తలపెట్టిన ఈ అత్యాధునిక నిర్మాణం... ఇకముందు నగరానికే కాక ప్రపంచంలోనే ఓ సొగసైన స్మారక చిహ్నంగా ఉంటుందని ఆయన వివరించారు. ఓ సన్నని స్తంభంలా ఆకట్టుకునేట్లు కనిపించే టవర్... భూమిలోనూ బలమైన పునాదులు కలిగి ఉంటుందన్నారు. ఆకాశమే హద్దుగా డజన్లకొద్దీ నిర్మాణాలను చేపట్టడంలో ఎంతో గుర్తింపును సాధించిన దుబాయ్ నగరం... భవిష్యత్ లోనూ ఈ అత్యంత పొడవైన నిర్మాణంతో ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుత ప్రాజెక్టుకు సుమారు 664 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని, బుర్జ్ ఖలీఫా కన్నా పొడవుగా ఉంటుందంటూ అలబ్బర్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎతైన నిర్మాణంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు ఉండగా.. దాన్ని నిర్మించేందుకు సుమారు 997 కోట్ల రూపాయలు ఖర్చయింది. -
హెలికాప్టర్లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి..
దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తై భవనం బుర్జ్ దుబాయ్‌లో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే..? అదీ ఆకాశంలో అంతెత్తున వేలాడుతున్నట్లుగా ఉండే.. హెలీప్యాడ్‌పై ఆ ముచ్చట తీర్చుకోగలిగితే..? భలేగా ఉంటుంది కదూ.. బుర్జ్ దుబాయ్ హోటల్ నిర్వాహకులు ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. భూమి నుంచి 212 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హెలిప్యాడ్‌పై పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. పైగా మీ విడిది నుంచి ‘అగస్టా 109’ హెలికాప్టర్లోగానీ, అత్యంత ఖరీదైన రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కారులోగానీ హోటల్ వద్దకు వెళ్లొచ్చు.. హోటల్లోని ఖరీదైన సూట్లో బస చేయొచ్చు. అక్కడి ప్రఖ్యాత వంటగాళ్లతో మనకిష్టమైన వంటకాలు చేయించుకునీ తినొచ్చు.. అసలు మొత్తంగా పెళ్లంటే ఇదేరా..! అనేట్లుగా వైభవోపేతంగా వేడుకలు జరుపుకోవచ్చు. దీనంతటికీ జస్ట్.. 35 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు. అయితే, పెళ్లికొడుకు, పెళ్లికూతురు కోరుకునే డెకరేషన్, ఇతర సౌకర్యాల ఆధారంగా చెల్లించాల్సిన రుసుమును నిర్ణయిస్తారట.