bus facilities
-
నిలువ నీడ లేక..
సాక్షి, చోడవరం(విశాఖ) : ఒక పక్క ఎండలు..మరో పక్క వర్షాలు...ప్రయాణికులకు మాత్రం అవస్థలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జంక్షన్లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్తితి. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ వారు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. 80 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు చోడవరం నియోజకవర్గంలో సుమారు 80 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోగా మిగతా 100 గ్రామాలకు బస్సులు వెళుతున్నా 60 శాతానికి పైగా గ్రామాలకు బస్ షెల్టర్లు లేవు. నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 40 వేలకు మందికి పైగా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రోజువారీ పనులు, ఇతర కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఎండలకు మండుతూ, వర్షాలకు తడుస్తూ ఎప్పుడో వచ్చే బస్సులు, ఆటోల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రూట్లలో సైతం కనిపించని షెల్టర్లు చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, మాడుగుల ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బీఎన్‌రోడ్డు, మాడుగుల రోడ్డు, అనకాపల్లి –బంగారు మెట్ట, తోటకూపాలెం, రావికమతం రోడ్లులో సైతం చాలా గ్రామాల వద్ద బస్ షెల్టరు లేవు. నాలుగైదు గ్రామాల్లో స్థానిక దాతల సాయంతో బస్షెల్టర్లు నిర్మించగా, మరో ఏడు చోట్ల గతంలో పార్లమెంటు సభ్యుల నిధులతో నిర్మించారు. మిగతా గ్రామాల్లో కనీసం నిలబడడానికి నీడ కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం పరుగులు చోడవరం మండలంలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, గంధవరం, లక్కవరం, గాంధీగ్రామం, నర్సయ్యపేట, గౌరీపట్నం జంక్షన్, నర్సాపురం జంక్షన్, రాయపురాజుపేట, శీమునాపల్లి, ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి ఉండడానికి బస్ షెల్టర్లు లేవు. కొన్ని చోట్ల గ్రామాలు దూరంగా ఉండడంతో ఆయా జంక్షన్లలో మరీ దయనీయంగా ఉంది. స్కూళ్లు ప్రారంభం కావడం, వర్షాకాలం వచ్చేయడంతో సాధారణ ప్రయాణికులతోపాటు రోజూ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. షెల్టర్లు లేక వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు ప్రయాణికుల దుస్థితి గమనించి బస్ షెల్టర్లు కట్టించాలని జనం కోరుతున్నారు. ఐదేళ్లుగా నిర్లక్ష్యం గడిచిన ఐదేళ్లలో ఒక్క బస్‌షెల్డర్ కూడా గత ప్రభుత్వం నిర్మించలేదు. అసలే ఎండలు మండిపోవడం, అకాల వర్షాలు కురవడంతో ప్రయాణికులు తలదాచుకోడానికి నిలువు నీడలేకుండా ఉంది. చెట్ల కింద ఉన్నా, కొన్ని గ్రామాలకు జంక్షన్ల వద్ద చెట్లు కూడా లేవు. బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నాం. మా గ్రామం అనకాపల్లి –చోడవరం రోడ్డులో ఉన్నప్పటికీ బస్ షెల్టర్ లేదు. – మొల్లి ప్రసాద్, గంధవరం షెల్టరు నిర్మించాలి మా రూట్లో ఒకటి రెండు బస్సులే నడుస్తున్నాయి. అవికూడా సకాలంలోరావు. ఆ బస్సుకోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. ఎండకి ఎండి, వర్షానికి తడిసి నిలబడాల్సి వస్తుంది. బస్ షెల్టర్ కోసం పలుమార్లు గత ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాం. కానీ ఆయన పట్టించుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకొని మా జంక్షన్ వద్ద బస్‌షెల్టర్ నిర్మించాలని కోరుతున్నాం. –అప్పారావు, వీఆర్‌పేట -
రెండు నెలల్లో సత్యగిరికి బస్సులు ఏర్పాటు
దేవస్థానం అధికారులకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశం సాక్షి ఎఫెక్టు... అన్నవరం: దేవస్థానంలోని సత్యగిరిపై ఉన్న ‘హరిహర సదన్’ సత్రానికి భక్తులు చేరుకునేందుకుగాను రత్నగిరి నుంచి రెండు ఉచిత బస్సులను నడపాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ బస్సులు 24 గంటలు తిరుగుతూ రత్నగిరి, సత్యగిరి మీదనున్న అన్ని సత్రాలు, అన్నదానం, బుకింగ్‌కౌంటర్, ఆలయ మార్గం, రాజగోపురాలు, బస్టాప్ తదితర చోట్ల ఆగేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం ఆయన దేవస్థానానికి వచ్చి సత్యగిరిపై పర్యటించారు. ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సత్తెన్నా..సత్రానికి చేరేదెలా...’ కథనానికి ఆయన స్పందించి, సత్యగిరిని సందర్శించారు. సత్యగిరిపై ఉన్న హరిహరసదన్ సత్రంలో భక్తులు ఎక్కువ మంది బస చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అలా చేయకుండా కేవలం కార్లు ఉన్నవారికే ఈ సత్రంలో గదులు కేటాయిస్తున్నామని చెప్పడం సరైన సమాధానం కాదని తెలిపారు. ప్రస్తుతం ఆ సత్రంలో 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందని, దానిని కనీసం 80 శాతానికి పెంచాలంటే రత్నగిరి, సత్యగిరి మధ్య ఉచిత బస్సులు నడపాలని ఆదేశించారు. ఆ బస్సుల్లో ఒక దాన్ని తిరుమలలో తిరిగే రథం మాదిరిగాను, మరొకటి డబల్డెక్కర్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఈ బస్సులు ఏర్పాటు చేసి, బస్టాప్‌ల వద్ద షెల్టర్స్, బోర్డులు రూపొందించాలన్నారు. ఈ పనులను మారుతి కన్సల్టెన్సీ అధినేత కృష్ణన్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అప్పగించారు. అలాగే హరిహర సదన్ సత్రంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఆ షాపుల్లో అన్ని రకాల వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు 1,365 బస్సులు
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని ఘాట్లకు బస్సులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం ప్రత్యేకంగా 1,365 బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తకుండా ఆర్టీసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 55 పుష్కర ఘాట్లు ఉన్నాయని, వాటిల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 27, నల్లగొండలో 28 ఉన్నాయని చెప్పారు. కృష్ణానది ప్రవహించే ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా అక్కడికి బస్సులను నడిపిస్తామని పేర్కొన్నారు. బీచుపల్లికి 248, నాగార్జునసాగర్ 160, శ్రీశైలం 150, విజయవాడ 50, సోమశిల 60, మఠంపల్లి 60, వాడపల్లి 32, నెట్టెంపాడు, గండిమల, మక్తల్, కైపూర్, పెబ్బేరు ప్రాంతాలకు 165 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి విజయవాడకు 235 బస్సులు నడుపుతామని, 400 మంది ఆర్టీసీ సిబ్బంది వీటిని సమన్వయం చేస్తారని అన్నారు. పుష్కరాల కోసం ఈసారి 300 ఏసీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. పుష్కరఘాట్ల నుంచి బస్టాండ్లకు 210 ఉచిత బస్సులు నడుపుతున్నామని చెప్పారు. పుష్కర బస్సుల వివరాలు రంగాపూర్, బీచుపల్లి ఘాట్లకు వెళ్లే బస్సులను పెబ్బేరు వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్లకు రాకపోకలు సాగించేందుకు 60 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళ్లే బస్సులను సాగర్ ఘాట్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని పొట్టిచెలమ వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్ వరకు 60 బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం క ల్పిస్తారు. మట్టపల్లికి వెళ్లే బస్సులను 6 కిలోమీటర్ల దూరంలో నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్‌కు 25 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. వాడపల్లికి మాత్రం నేరుగా ఘాట్ వరకు బస్సులు వెళ్తాయి. ఒక్క ఆర్టీసీ ప్రయాణికులే కాకుండా సొంత, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్లు సైతం ఘాట్ల వరకు ఆర్టీసీ ఉచిత బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులను మినహా ఇతర వాహనాలను ఘాట్ల వరకు అనుమతించరు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం 5 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, 10 మంది రీజి నల్ మేనేజర్ స్థాయి అధికారులు, 20 మం ది సీనియర్ స్కేల్ అధికారులు, 60 మంది డిపో మేనేజర్లు, అన్ని ప్రధాన ప్రాంతాల్లో మెకానిక్ బృందాలను మోహరించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) వేణు తెలిపారు. ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని, 24 గంటలపాటు బస్సులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.