పుష్కరాలకు 1,365 బస్సులు
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని ఘాట్లకు బస్సులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం ప్రత్యేకంగా 1,365 బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తకుండా ఆర్టీసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 55 పుష్కర ఘాట్లు ఉన్నాయని, వాటిల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 27, నల్లగొండలో 28 ఉన్నాయని చెప్పారు.
కృష్ణానది ప్రవహించే ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా అక్కడికి బస్సులను నడిపిస్తామని పేర్కొన్నారు. బీచుపల్లికి 248, నాగార్జునసాగర్ 160, శ్రీశైలం 150, విజయవాడ 50, సోమశిల 60, మఠంపల్లి 60, వాడపల్లి 32, నెట్టెంపాడు, గండిమల, మక్తల్, కైపూర్, పెబ్బేరు ప్రాంతాలకు 165 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి విజయవాడకు 235 బస్సులు నడుపుతామని, 400 మంది ఆర్టీసీ సిబ్బంది వీటిని సమన్వయం చేస్తారని అన్నారు. పుష్కరాల కోసం ఈసారి 300 ఏసీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు. పుష్కరఘాట్ల నుంచి బస్టాండ్‌లకు 210 ఉచిత బస్సులు నడుపుతున్నామని చెప్పారు.
పుష్కర బస్సుల వివరాలు
రంగాపూర్, బీచుపల్లి ఘాట్‌లకు వెళ్లే బస్సులను పెబ్బేరు వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్‌లకు రాకపోకలు సాగించేందుకు 60 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళ్లే బస్సులను సాగర్ ఘాట్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని పొట్టిచెలమ వద్ద నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్ వరకు 60 బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం క ల్పిస్తారు.
మట్టపల్లికి వెళ్లే బస్సులను 6 కిలోమీటర్ల దూరంలో నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఘాట్‌కు 25 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. వాడపల్లికి మాత్రం నేరుగా ఘాట్ వరకు బస్సులు వెళ్తాయి.
ఒక్క ఆర్టీసీ ప్రయాణికులే కాకుండా సొంత, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్లు సైతం ఘాట్‌ల వరకు ఆర్టీసీ ఉచిత బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులను మినహా ఇతర వాహనాలను ఘాట్ల వరకు అనుమతించరు.
మరోవైపు బస్సుల నిర్వహణ కోసం 5 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు, 10 మంది రీజి నల్ మేనేజర్ స్థాయి అధికారులు, 20 మం ది సీనియర్ స్కేల్ అధికారులు, 60 మంది డిపో మేనేజర్లు, అన్ని ప్రధాన ప్రాంతాల్లో మెకానిక్ బృందాలను మోహరించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) వేణు తెలిపారు. ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని, 24 గంటలపాటు బస్సులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.