లోకల్ కేడర్ విభజన పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు త్వరలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర కేడర్ పోస్టులను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) పేరుతో రాష్ట్రపతి కొత్తగా ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 109 ప్రభుత్వ విభాగాలకు గాను 57 విభాగాల నుంచి ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకు చెందిన ముసాయిదా జీవోలు అందాయి.
మిగిలిన 52 విభాగాలు సైతం కొత్తగా రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పైనాలుగు కేటగిరీల్లో పోస్టులు విభజిస్తూ ముసాయిదా జీవోలను వెంటనే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. ఆ ఉత్తర్వుల అమలుపై శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో 17 శాఖల అధికారులతో సమీక్ష చేశారు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ పోస్టుల వర్గీకరణ పూర్తయిన తర్వాత ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను గుర్తించి ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి.