ట్రాయ్ కొత్త నిబంధనలతో రూ.400కోట్ల భారం
న్యూఢిల్లీ: అనుచిత వాణిజ్య కాల్స్ (పెస్కీ కాల్స్), మెసేజ్‌లకు సంబంధించి ట్రాయ్ నూతన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగానికి రూ.200–400 కోట్ల మేర వ్యయం చేయాల్సి వస్తుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పెదవి విరిచింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. సీవోఏఐలో ప్రధాన ప్రైవేటు టెలికం కంపెనీలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. పెస్కీ కాల్స్‌ను, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు టెలికం కంపెనీలు ట్రాయ్ కొత్త నిబంధనలను డిసెంబర్ నాటికి అమలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఈ విధానం ప్రపంచంలో మరెక్కడా అమలు చేయలేదు. కచ్చితమైన పెట్టుబడులు, సమయాన్ని అంచనా వేయడం కష్టం.
కానీ, సుమారు రూ.200–400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ గడువు కూడా అచరణ సాధ్యం కానిదిగా పేర్కొన్నారు. పూర్తి వ్యవస్థ ఏర్పాటుకు కనీసం ఏడాది, ఏడాదిన్నర సమయం అవసరం అవుతుందన్నారు. నిబంధనల అమలుకు అయ్యే అదనపు వ్యయాల భారాన్ని కస్టమర్లపై అధిక చార్జీల రూపంలో మోపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎన్డీ వద్ద నమోదు చేసుకున్న కస్టమర్లకు సైతం అదే పనిగా అనుచిత వాణిజ్య కాల్స్, సందేశాలు వస్తుండటంతో ట్రాయ్ గత నెలలో నూతన నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం ఏ వాణిజ్య సర్వీస్‌కు అయినా తానిచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే వెసులుబాటు కస్టమర్‌కు ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య కాల్స్‌ను ఏఏ రోజుల్లో, ఏ సమయాల్లో స్వీకరించే ప్రాధాన్యాన్ని కూడా నిర్దేశించుకోవచ్చు.