canvasing
-
మోడీపై చర్యలకు ఈసీ సిఫార్సు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రం ఎదుటే బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపుతూ మీడియా సమావేశంలో మాట్లాడటంతో నరేంద్ర మోడీ మీద ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 12 (1బి) సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది. నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసేవరకు ఏ రకమైన ప్రచారం చేయకూడదు. అందులోనూ అభ్యర్థి అయి ఉండి, తన ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడటం, అదంతా వీడియోలలో రికార్డు కావడంతో మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. -
ప్రచారంలో పొదుపు.. పంపిణీకి మదుపు
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రచారానికి లక్షలు ఖర్చుపెట్టే బదులు... పోలింగ్‌కు ముందు ఆ సొమ్ములను ఓటర్లకు పంచితే ఫలితముంటుందని కొందరు భావిస్తున్నారు. ప్రచారం సొమ్ములను పొదుపు చేసి పంపిణీకి వాడుకుంటున్నారు. బలమైన పోటీ ఉన్నచోట అసెంబ్లీ అభ్యర్థి ప్రచారానికి కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రచార వాహనం, ఆటోలు, డీసీఎం వాహనాలు, వీటితో పాటు వెంట వచ్చే కార్యకర్తల బైక్‌లకు కొట్టించే పెట్రోలు, భోజనాలు, ప్రచారం చివర్లో వచ్చినవాళ్లకు నగదు చెల్లింపు కలిపి అభ్యర్థి స్థాయిని బట్టి రోజుకు కనీసం మూడు, నాలుగు లక్షల వరకు ఖర్చవుతుంది. పోలింగ్ గడువు దగ్గర పడేకొద్దీ ప్రచారానికి మరింత సొమ్ము వెచ్చించాలి. ఎంత చేసినా చివరి రోజు ఓట్ల కొనుగోలుకు డబ్బులు ఖర్చుపెట్టడం తప్పదనుకుంటున్న వాళ్లు.. ప్రచారానికి వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకుంటేనే మంచిదని భావిస్తున్నారు. దీంతో ప్రచారానికి జనాన్ని తీసుకురావడం తగ్గించి అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే సరిపెడుతున్నారు. ఇలా ఖర్చును తగ్గించుకుంటున్నారు. రోజుకు కనీ సం రూ.లక్ష, రెండు లక్షలు మిగిలినా.. ఆ డబ్బుతో ఎన్నో కొన్ని ఓట్లు కొనుక్కోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. గెలుపు భరోసా లేక ఓటర్లకు భారీ ఎత్తున నగదు ఎరవేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు కొద్దిమంది కార్యకర్తలు, నాయకులతో ప్రచా రం ముగిస్తున్నారు. -
నాడు సౌందర్య.. నేడు శోభ
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే నాడు సినీనటి సౌందర్య, నేడు వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణించారు. 2004 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సౌందర్య (31).. ఆ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన బెంగళూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించిన సౌందర్య, కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించడంతో మూడు రాష్ట్రాల్లోనూ ఆమెకు పెద్దసంఖ్యలో అభిమానులుండేవారు. ఆ అభిమానాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవాలని బీజేపీ కోరగా.. ఆమె ప్రచారం చేసేందుకు అంగీకరించి తన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు శోభా నాగిరెడ్డి కూడా ఎన్నికల ప్రచార సంరంభం ముమ్మరంగా ఉన్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నాయకురాళ్లలా తండ్రి చాటునో, భర్త చాటునో ఉండిపోకుండా తనకంటూ సొంతంగా నాయకత్వ లక్షణాలు సాధించి, రాయలసీమలోని మహిళా నేతల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి.. బుధవారం సాయంత్రం వైఎస్ షర్మిలతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తారని, మంచి ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రిగా కూడా చేస్తారని కర్నూలు జిల్లావాసులు భావించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం.. కేర్ ఆస్పత్రిలో కన్నుమూయడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు.