ప్రచారంలో పొదుపు.. పంపిణీకి మదుపు
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రచారానికి లక్షలు ఖర్చుపెట్టే బదులు... పోలింగ్‌కు ముందు ఆ సొమ్ములను ఓటర్లకు పంచితే ఫలితముంటుందని కొందరు భావిస్తున్నారు. ప్రచారం సొమ్ములను పొదుపు చేసి పంపిణీకి వాడుకుంటున్నారు. బలమైన పోటీ ఉన్నచోట అసెంబ్లీ అభ్యర్థి ప్రచారానికి కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రచార వాహనం, ఆటోలు, డీసీఎం వాహనాలు, వీటితో పాటు వెంట వచ్చే కార్యకర్తల బైక్‌లకు కొట్టించే పెట్రోలు, భోజనాలు, ప్రచారం చివర్లో వచ్చినవాళ్లకు నగదు చెల్లింపు కలిపి అభ్యర్థి స్థాయిని బట్టి రోజుకు కనీసం మూడు, నాలుగు లక్షల వరకు ఖర్చవుతుంది. పోలింగ్ గడువు దగ్గర పడేకొద్దీ ప్రచారానికి మరింత సొమ్ము వెచ్చించాలి.
ఎంత చేసినా చివరి రోజు ఓట్ల కొనుగోలుకు డబ్బులు ఖర్చుపెట్టడం తప్పదనుకుంటున్న వాళ్లు.. ప్రచారానికి వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకుంటేనే మంచిదని భావిస్తున్నారు. దీంతో ప్రచారానికి జనాన్ని తీసుకురావడం తగ్గించి అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే సరిపెడుతున్నారు. ఇలా ఖర్చును తగ్గించుకుంటున్నారు. రోజుకు కనీ సం రూ.లక్ష, రెండు లక్షలు మిగిలినా.. ఆ డబ్బుతో ఎన్నో కొన్ని ఓట్లు కొనుక్కోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. గెలుపు భరోసా లేక ఓటర్లకు భారీ ఎత్తున నగదు ఎరవేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు కొద్దిమంది కార్యకర్తలు, నాయకులతో ప్రచా రం ముగిస్తున్నారు.