votes purchase
-
ఓట్లు అమ్ముకుంటే మంచి నాయకులు ఎలా వస్తారు?
సాక్షి, చెన్నై: ఓటును నోటు, బిర్యానీకి, బాటిల్‌కు అమ్ముకుంటే..ఎలా మంచి నాయకుల్ని ఎదురు చూడగలమని మదురై ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉచితా పథకాలతో సోమరితనం పెరిగినట్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని ఉంచి, సమాధానాలు ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి హుకుం జారీ చేశారు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో కడయనల్లూరుకు చెందిన చంద్రమోహన్ వాసుదేవనల్లూరు నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరి పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో ఈసీని ఆదేశించాలని కోరుతూ గతంలో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కృపాకరణ్, పుహలేంది బెంచ్ ముందుకు వచ్చింది. ఈసందర్భంగా ఇటు ప్రజ లకు, అటు రాజకీయపక్షాలకు, ఎన్నికల యంత్రాంగానికి చురకలు అంటించే రీతిలో, అక్షింతలు వేస్తూ న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. అమ్మేసుకుంటే ఎలా.. నోటుకు, కానుకలకు, బిర్యానీ, మందు బాటిళ్లకు ఓట్లను అమ్మేసుకుంటే, ఎలా మంచి నాయకులు సేవల్ని అందించేందుకు వస్తారని ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంటూ ప్రకటించే ఉచిత పథకాలు ప్రజల్ని సోమరి పోతులుగా మార్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాల వాగ్ధానాలు ఇచ్చే పార్టీలను నిషేధించ వచ్చుగా అని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు చూస్తుంటే, కళ్లు బైర్లు కమ్మేసుకున్నట్టుందని పేర్కొన్నారు. గృహిణిలకు నెలకు ఒకరు రూ. వెయ్యి ఇస్తామంటే, తాము రూ.1500 ఇస్తామంటూ పోటా పోటీగా హామీలను రాజకీయ పక్షాలు ఇచ్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసే వాళ్లకే తమ ఓటు అంటూ తమను తాము అవినీతి పరులుగా ప్రజలు చూపించుకుంటుండడం విచారకరంగా పేర్కొన్నారు. ఈసీకి 20 ప్రశ్నలు.. అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు, చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు చేయలేని రీతిలో ఉన్నా యని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలు, స్థానిక ప్రగతి, అభివృద్ధి, విద్య, వైద్య, మౌలిక సదుపాయలపై దృష్టి పెడితే చాలు అని హితవు పలికారు. ఇటీవల తమిళనాడులో చిన్న చిన్న దుకాణాల్లోనూ ఉత్తరాది వాసులే అధికంగా పనుల్లో కనిపిస్తున్నారని పేర్కొంటూ, మున్ముందు వలసలు వచ్చిన వాళ్లు యజమానులుగా, ఇక్కడి వారు కూలీలుగా మారే పరిస్థితులు తప్పవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఉచితాలకే ప్రధాన్యత ఉంటూ వస్తున్నదని పేర్కొంటూ, ఎన్నికల కమిషన్ ముందు 20 ప్రశ్నల్ని న్యాయమూర్తులు ఉంచారు. 2013లో సుబ్రమణ్య బాలాజీ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు ఉచిత వాగ్దానాలు, ఆచరణలో అమలు చేయలేని వాగ్దానాల క్రమబద్ధీకరణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ తీర్పును ఎన్నికల్లో ఏ మేరకు అమలు చేశారో, వాగ్దానాలు ఎన్నింటిని తిరస్కరించారా, పార్టీలు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాయో, అందులో ఏ మేరకు అమలయ్యేయో అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉచితాల పేరిట ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్న పార్టీలకు నిషేధం విధించవచ్చుగా, గెలిచిన అభ్యర్థి అధికారంలోకి వచ్చాక, ఎన్ని వాగ్దానాల్ని సక్రమంగా నెరవేర్చాడో అనే ప్రశ్నల్ని అడుగుతూ వీటన్నింటికి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తర్వాత విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
‘ఓటు ధరను 10వేల రూపాయలకు తీసుకెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల పాలన కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఓటుకు 500 రూపాయలు ముట్ట చెప్పే పద్దతిని చంద్రబాబు 1996లోనే ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే ఓటు ధరను పదివేల రూపాయలకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ధరను 20 కోట్ల రూపాయలకు, ఎంపీల ధరను 50 కోట్ల రూపాయలకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా తప్ప.. ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా అని నిలదీశారు. ఇద్దరు బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించ రాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో బిసిల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకుంది లేదు. నెల రోజల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది కులానికో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని. మోసాలకూ ఒక హద్దుండాలి చంద్రబాబు గారూ. — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 బిసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా చంద్రబాబు? ఇద్దరు బిసిలను హైకోర్టు జడ్జిలుగా నియమించరాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా? జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయట పెట్టారు కదా? బతుకంతా నయవంచనే గదా? — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 దేశంలో ఓటుకు 500 ముట్టచెప్పే పద్థతిని 1996 లోనే చంద్రబాబుగారు ప్రవేశపెట్టారు. ఇప్పడు దానిని పది వేల స్థాయికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ధర 20 , ఎంపీలు ధరను 50 కోట్లకు చేర్చారు. రాజకీయ మనుగుడకు ఇంత నీచత్వానికి పాల్పడే వ్యక్తి ఎవరంటే చంద్రబాబునే చూపిస్తారు. — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 -
ప్రచారంలో పొదుపు.. పంపిణీకి మదుపు
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రచారానికి లక్షలు ఖర్చుపెట్టే బదులు... పోలింగ్‌కు ముందు ఆ సొమ్ములను ఓటర్లకు పంచితే ఫలితముంటుందని కొందరు భావిస్తున్నారు. ప్రచారం సొమ్ములను పొదుపు చేసి పంపిణీకి వాడుకుంటున్నారు. బలమైన పోటీ ఉన్నచోట అసెంబ్లీ అభ్యర్థి ప్రచారానికి కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రచార వాహనం, ఆటోలు, డీసీఎం వాహనాలు, వీటితో పాటు వెంట వచ్చే కార్యకర్తల బైక్‌లకు కొట్టించే పెట్రోలు, భోజనాలు, ప్రచారం చివర్లో వచ్చినవాళ్లకు నగదు చెల్లింపు కలిపి అభ్యర్థి స్థాయిని బట్టి రోజుకు కనీసం మూడు, నాలుగు లక్షల వరకు ఖర్చవుతుంది. పోలింగ్ గడువు దగ్గర పడేకొద్దీ ప్రచారానికి మరింత సొమ్ము వెచ్చించాలి. ఎంత చేసినా చివరి రోజు ఓట్ల కొనుగోలుకు డబ్బులు ఖర్చుపెట్టడం తప్పదనుకుంటున్న వాళ్లు.. ప్రచారానికి వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకుంటేనే మంచిదని భావిస్తున్నారు. దీంతో ప్రచారానికి జనాన్ని తీసుకురావడం తగ్గించి అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే సరిపెడుతున్నారు. ఇలా ఖర్చును తగ్గించుకుంటున్నారు. రోజుకు కనీ సం రూ.లక్ష, రెండు లక్షలు మిగిలినా.. ఆ డబ్బుతో ఎన్నో కొన్ని ఓట్లు కొనుక్కోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. గెలుపు భరోసా లేక ఓటర్లకు భారీ ఎత్తున నగదు ఎరవేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు కొద్దిమంది కార్యకర్తలు, నాయకులతో ప్రచా రం ముగిస్తున్నారు.