మోడీపై చర్యలకు ఈసీ సిఫార్సు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రం ఎదుటే బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపుతూ మీడియా సమావేశంలో మాట్లాడటంతో నరేంద్ర మోడీ మీద ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 12 (1బి) సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది.
నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసేవరకు ఏ రకమైన ప్రచారం చేయకూడదు. అందులోనూ అభ్యర్థి అయి ఉండి, తన ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడటం, అదంతా వీడియోలలో రికార్డు కావడంతో మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.