capsized in water
-
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
విశాఖపట్నం: సీలేరు రిజర్వాయర్‌లో నాటు పడవ బోల్తా
-
సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా
విశాఖపట్నం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడ బోల్తా పడ్డాయి. ఈ ఘటన సీలేరుగుంట వాడ దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రెజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో అయిదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు. ► సీలేరు నాటు పడవల ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులు ఒడిశా వాసులైనా పూర్తి సహాయం అందించాలని అధికారుకు తెలిపారు. అవసరమైతే నేవీ సహాయం తీసుకోమని మంత్రి అవంతి అధికారులను ఆదేశించారు. చదవండి: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు -
పొంగి ప్రవహిస్తున్న వాగు... డ్రైవర్ నిర్లక్ష్యంతో
సాక్షి, నల్గొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం కిష్టారం పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న వాగులో ప్యాసెంజర్ ఆటో బోల్తా కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు నీటిలో కొంత దూరం కొట్టుకు పోగా, రాములమ్మ అనే మహిళ నీట మునిగి మృతి చెందింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆటోని పోనివ్వడంతో తమ ఇంటి దీపం ఆరిపోయిందని రాములమ్మ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. -
సముద్రంలో పడవ బోల్తా.. 26 మంది మృతి
హోండురస్ : సముద్రంలో పీతల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడిన ఘటనలో 26 మృతి చెందారు. ఈ ఘటన కరీబియన్ తీరంలోని హోండురస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 47 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సముద్ర పీతల వేటపై అక్కడి ప్రభుత్వం సీజనల్ బ్యాన్ ఎత్తివేయడంతో జాలర్లు వేటకు బయలుదేరారు. 70 టన్నుల బరువుగల పెద్ద పడవలో వారు పీతల వేటకు తీరజలాల్లో ప్రవేశించారు. అయితే ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. పడవ కెప్టెన్ ప్రమాదపు సిగ్నల్ పంపినప్పటికీ.. కొద్ది సేపటికే అతను చనిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై భద్రతా దళాల అధికార ప్రతినిధి జోస్ మెజా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అక్కడికి దగ్గర్లోని ప్యూర్టో లెంపిరా ప్రాంతానికి చేర్చామని తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డవారిని అక్కడికే తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగేందుకు ముందే అదే ప్రదేశంలో మరో బోటు మునిగిపోయిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవరు చనిపోలేదని.. పడవలోని 40 సురక్షితంగా తీరానికి చేర్చామని వెల్లడించారు. -
బోటు మునక: 700 మంది గల్లంతు
పట్టెడన్నం కోసం పక్కదేశానికి వలస వెళ్లాలనుకున్న వెతజీవులు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరుకాదు ఇద్దరు కాదు దాదాపు 700 మంది నీటమునిగారు. వలసల చరిత్రలో అత్యంత విషాదంగా భావిస్తోన్న ఈ ఘటన మద్యదరా సముద్రంలో ఆదివారం జరిగింది. గడాఫీ మరణం తర్వాత కల్లోలితంగా మారిన లిబియా నుంచి చేపలు పట్టే బోట్ల ద్వారా ఇటలీకి బయలుదేరిన 700 మంది కూలీలు మధ్యదరా సముద్రంలో నీట మునిగారని ఇటలీ నౌకాదళం భావిస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న నౌకా దళం.. 28 మందిని కాపాడగలిగింది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడగలిగే అవకాశాలు తక్కువేనని మెరైన్ అధికారులు చెబుతున్నారు. ' లిబియా తీరం నుంచి ఇటలీలో భాగంగా ఉన్న లంపేడుసా ద్వీపానికి బయలుదేరిన శరణార్థులు.. చేపలు పట్టే బోటులో పరిమితికి మించి ప్రయాణించారు. ఓ వ్యాపారనౌక వీరు ప్రయాణిస్తోన్న బోటుకు దగ్గరగా రావడంతో ప్రమాదం సంభవించింది. దీంతో బోటు తలకిందులై 700 మంది గల్లంతయ్యారు' అని ఐక్యరాజ్యసమితి సహాయ పునరావాస సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి 28 మందిని కాపాడగలిగామని, మిగతావారి కోసం గాలింపుచర్యలు చేపట్టామని, అయితే దాదాపు వారు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోన్న ఇటాలియన్ కోస్ట గార్డ్ ఆఫీసర్ వివరించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి యూరప్ కు వలసవెళుతూ ఇలా మధ్యధరా సముద్రంలో మరణించిన శరణార్థుల సంఖ్య ఇప్పటికే 1500 కు చేరుకోవడం శోచనీయం. గత ఫిబ్రవరిలో రబ్బరు బోట్లు ప్రమాదానికి గురికావడంతో ఇటలీవైపు వెళుతోన్న 300 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. గతేడాది సెప్టెంబర్ లో ఇదేవిధంగా 500 మంది నీటమునిగారు.