captivity
-
ఇండియా 'లాడెన్' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం!
గువాహటి: భారత ‘బిన్ లాడెన్’గా పేరొంది.. ప్రజలను చంపేస్తూ బీభత్సం సృష్టించిన ఓ ఏనుగు పట్టుబడిన ఆరు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అటవీ అధికారుల సంరక్షణలో బందీగా ఉన్న ఆ ఏనుగు ఆదివారం ఉదయం 5.30 గంటలకు చనిపోయిందని ఇక్కడి ఓరంగ్ నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. తమ సంరక్షణలో బందీగా ఉన్న ఈ ఆరు రోజులుగా ఏనుగు చక్కగా ఉందని, ఈ క్రమంలో అనూహ్యంగా ప్రాణాలు విడిచిందని వివరించారు. అసోంలోని గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఈ ఏనుగును వారం కిందట అధికారులు పట్టుకున్నారు. భారత ఒసామా బిన్ లాడెన్‌గా పేరొందిన ఈ ఏనుగు గత అక్టోబర్‌లో గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తులను చంపింది. స్థానికంగా బీభత్సం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న ఈ ఏనుగు గత అక్టోబర్ నెలలో గోల్పారా జిల్లాలో గ్రామాలపై దాడి చేస్తూ.. ఐదుగురు స్థానిక గ్రామస్తులను చంపేసింది. దీంతో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరును ఈ ఏనుగుకు స్థానికులు పెట్టారు. ఈ ఏనుగు పేరు చెబితేనే స్థానికులు హడలిపోయేవారు. ఈ క్రమంలో అటవీ అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి.. ఈ ‘లాడెన్’కు ఉచ్చుబిగించారు. చాలారోజులపాటు అడవిలో ఈ ఏనుగు సంచారాన్ని ట్రాక్ చేశారు. నిపుణులైన ఆర్చర్లు మత్తు మందుతో కూడిన బాణాలను సంధించడం ద్వారా ఈ ఏనుగును బంధించి.. అక్కడి నుంచి తరలించారు. -
15 ఏళ్ల చెర తప్పింది
న్యూఢిల్లీ: గజరాజుకు 15 ఏళ్ల చెర తప్పింది. ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి రక్షణ కార్యకర్తలు, పోలీసులు, అటవీ అధికారుల చొరవతో 55 ఏళ్ల ఏనుగు 'మోహన్'కు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాలతో కఠినాత్ముడైన యజమాని నుంచి మోహన్ ను రక్షించామని జంతుప్రేమికులు, అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రతాప్‌గఢ్ కు చెందిన ఓ వ్యక్తి 2001లో బిహార్ లోని సోనెపూర్ పశువుల సంతలో ఈ ఏనుగును కొన్నాడు. దానికి సరిగా తిండి పెట్టకుండా హింసించేవాడు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అధికారుల దృష్టికి రావడంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టులోనూ ఏడాదిపైగా వాదనలు నడిచారు. చివరకు డిస్ట్రిక్ కోర్టు ఆదేశాలతో 'మోహన్'కు స్వేచ్ఛ లభించింది. మూడు రోజుల్లో యజమాని నుంచి మోహన్'ను విడిపించాలని జూలై 12న డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. కోర్టు ఆదేశాలతో చెర నుంచి 'మోహన్'ను విడిపించారు.