15 ఏళ్ల చెర తప్పింది
న్యూఢిల్లీ: గజరాజుకు 15 ఏళ్ల చెర తప్పింది. ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి రక్షణ కార్యకర్తలు, పోలీసులు, అటవీ అధికారుల చొరవతో 55 ఏళ్ల ఏనుగు 'మోహన్'కు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాలతో కఠినాత్ముడైన యజమాని నుంచి మోహన్ ను రక్షించామని జంతుప్రేమికులు, అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రతాప్గఢ్ కు చెందిన ఓ వ్యక్తి 2001లో బిహార్ లోని సోనెపూర్ పశువుల సంతలో ఈ ఏనుగును కొన్నాడు. దానికి సరిగా తిండి పెట్టకుండా హింసించేవాడు.
ఈ విషయం ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అధికారుల దృష్టికి రావడంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టులోనూ ఏడాదిపైగా వాదనలు నడిచారు. చివరకు డిస్ట్రిక్ కోర్టు ఆదేశాలతో 'మోహన్'కు స్వేచ్ఛ లభించింది. మూడు రోజుల్లో యజమాని నుంచి మోహన్'ను విడిపించాలని జూలై 12న డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. కోర్టు ఆదేశాలతో చెర నుంచి 'మోహన్'ను విడిపించారు.