కళ్లెదుటే ఆరిన కంటి దీపాలు
కోరుట్ల: కొద్దిరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి. హైదరాబాద్ వెళ్లి మూడ్రోజులు షాపింగ్ చేశారు. అంతే ఆనందంతో కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఢీకొట్టింది. ప్రమాదం లో ఇద్దరు చిన్నారులు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా కోరుట్ల–మేడిపల్లి మండలాల సరిహద్దుల్లోని మోహన్‌రావుపేట వంతెన మూలమలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
కారును కిరాయికి మాట్లాడుకొని..
కోరుట్లలోని బిలాల్‌పురాకు చెందిన సులేమాన్ జావీద్, సుమయ్య దంపతులు. జావీద్ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దుబాయ్‌లో ఉంటున్న ఆయన బావమరిది ఫుర్ఖాన్కు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈనెల 28న విహహం ఉంది.
పెళ్లి షాపింగ్ కోసం జావీద్ దంపతులు తమ ముగ్గురు కొడుకులు ఆనస్, అస్సర్, అజాన్.. జగిత్యాలలో ఉండే అత్త రేష్మ, మరో బావమరిది రుషాన్‌తో కలిసి బుధవారం హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోరుట్లకే చెందిన తన స్నేహితుడు సాజిద్ అలీ కారును కిరాయికి మాట్లాడుకున్నారు. ఆదివారం పొద్దున్నే కారులో బయలుదేరారు. మధ్యలో అత్త రేష్మ, బావమరిది రుషాన్‌ను జగిత్యాలలో దింపారు.
కోరుట్లకు చేరుకుంటుందనగా..
జావీద్ కుటుంబం ఇంకో పది నిమిషాల్లో కోరుట్లకు చేరుకుంటుందనగా కోరుట్ల మండలం మోహన్ రావుపేట వంతెన మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీళ్ల కారును ఢీకొంది. కారు నుంచి ఎగిరిబయటపడ్డ జావీద్ చిన్నకొడుకు అజాన్ (5) అక్కడిక్కడే మృతిచెందాడు.
రెండో కొడుకు అస్సర్ (8) ఎగిరి కారు ఇంజిన్‌పై పడి కాలిపోయాడు. జగిత్యాల ఆస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. డ్రైవర్ సాజిద్ అలీ (32) కారులోనే ప్రాణాలు వదిలాడు. అనస్ (12) పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించారు. జావీద్, సుమయ్యను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
తల్లిదండ్రుల కళ్లెదుటే..
ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న జావీద్, సుమయ్య దంపతులు.. కారులో అచేతనంగా పడి ఉన్న పిల్లలను చూసి బోరున విలపించారు. తీవ్రంగా గాయపడిన మరో కుమారుడిని చూసిన వారి వేదన వర్ణనాతీతం. జావీద్ ఒళ్లో షాపింగ్ సామగ్రి ఉండటం, కారు బెలూన్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అందరినీ ఆస్పత్రికి తరలించాక అక్కడ తమ పిల్లలెలా ఉన్నారని జావీద్ దంపతులు అడగగా, ఏం కాలేదని బంధువులు చెప్పారు.
చివరకు పిల్లల అంత్యక్రియలు చేయాల్సి ఉండటంతో వాళ్లు చనిపోయిన విషయాన్ని జావీద్‌కు చెప్పగా ఒక్కసారిగా కుప్పకూలారు. రాత్రి 8 గంటల సమయంలో పిల్లల అంత్యక్రియలను జావీద్ పూర్తిచేసి చికిత్స కోసం తిరిగి ఆస్పత్రికి వెళ్లడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో జావీద్ పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి.