తాజ్‌మహల్‌ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్‌మహల్‌ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్‌మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్
టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్‌ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్‌మహల్‌ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది.
రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి
తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్‌పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు.