Carvey and stock broking
-
కార్వీ కేసులో ‘షాక్’ ఎక్స్చేంజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) కేసులో సంచలనం. స్టాక్ ఎక్స్చేంజీలకు షాక్ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీల దుర్వినియోగాన్ని గుర్తించే విషయంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వైఫల్యాన్ని సెబీ ఎత్తి చూపింది. ఈ మేరకు బీఎస్ఈకి రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. 95,000లకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల సెక్యూరిటీలను కేవలం ఒక డీమ్యాట్ ఖాతా నుండి తాకట్టు పెట్టి కార్వీ దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కేఎస్‌బీఎల్, గ్రూప్ కంపెనీలు 8 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.851.43 కోట్ల రుణం పొందాయి. నిస్సందేహంగా ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తాకట్టు పెట్టడం ద్వారా కేఎస్‌బీఎల్ దుర్వినియోగానికి పాల్పడిందని సెబీ స్పష్టం చేసింది. నష్టానికి కార్వీదే బాధ్యత..: ‘పెట్టుబడిదారులకు, అలాగే రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టంతో సహా.. సొంతం కాని సెక్యూరిటీలను తాకట్టు పెట్టడం వల్ల కలిగే నష్టానికి కేఎస్‌బీఎల్ బాధ్యత వహిస్తుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సభ్యుడిగా ఉండటంతో స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ పర్యవేక్షణలో కార్వీ ఉంది. ఎక్స్చేంజీల వైఫల్యం ఉంది. ఫలితంగా కేఎస్‌బీఎల్‌లో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో స్టాక్ ఎక్స్చేంజీలు జవాబుదారీగా ఉండాలి’ అని సెబీ తన ఉత్తర్వుల్లో ఘాటుగా స్పందించింది. జూన్ 2019 నుండి కార్వీలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెబీ సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి. -
పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్జీత్ సింగ్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్ బండారీ ఇటీవల హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లలిత్ బండారీకి డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తామని, ట్రేడింగ్ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై సెబీ రూ. 10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: రీగాలియా రియాలిటీ లిమిటెడ్ సంస్థలో షేర్లను కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే విషయంలో జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. నిర్దేశిత వ్యవధిలోగా తప్పనిసరిగా ప్రకటించకపోవడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే జరిమానా విధించామని సెబీ పేర్కొంది. వివరాల్లోకి వెడితే రీగాలియా ప్రమోటర్లు 55.56 శాతం వాటాలను తనఖా పెట్టి కార్వీ నుంచి రూ. 7 కోట్లు రుణం తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను కార్వీ స్వాధీనం చేసుకుంది. దీంతో రీగాలియాలో కార్వీ వాటాలు సెబీ నిర్దేశిత స్థాయికి మించి 55.56 శాతానికి చేరాయి. ఫలితంగా పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి షేర్ల కొనుగోలుకు 45 రోజుల్లోగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించినప్పటికీ కార్వీకి చుక్కెదురైంది. సెబీని సమర్థిస్తూ 2018 ఏప్రిల్‌లో శాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా కార్వీ బహిరంగ ప్రకటన చేయాల్సింది. కానీ 81 రోజుల తర్వాత 2018 ఆగస్టులో కార్వీ ఓపెన్ ఆఫర్ ప్రకటన చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘన కింద భావిస్తూ సెబీ తాజాగా జరిమానా విధించింది. -
కార్వీపై 6 నెలల నిషేధం
పదేళ్ల కిందట... అంటే 2003-05 మధ్య జరిగిన ఐపీవో (తొలి పబ్లిక్ ఇష్యూ) కుంభకోణానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ తీర్పునిచ్చింది. ఆరు నెలల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కంపెనీని నిషేధిం చింది. కాని ఈ తీర్పు అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు సెబీ స్పష్టం చేసింది. దీనిపై న్యాయపరంగా పోరాడనున్నట్లు కార్వీ అధికారులు సాక్షికి వెల్లడించారు. 2003-05 మధ్య దాదాపు 21 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని బ్రోకింగ్ కంపెనీలు నకిలీ పేర్లతో డీమ్యాట్ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఆయా ఐపీఓలకు దరఖాస్తు చేశాయి. అప్పట్లో చాలా కంపెనీల ఐపీఓలు రిటైల్ విభాగంలో భారీ ఎత్తున ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యేవి. దీంతో వెయ్యి షేర్లకు దరఖాస్తు చేసిన రిటైలర్లకు కొన్ని సందర్భాల్లో 20-30 షేర్లు మాత్రమే దక్కేవి. లిస్టింగ్‌లోనే మంచి లాభాలొచ్చేవి కూడా. దీనికోసం కొందరు కీలక ఆపరేటర్లు నకిలీ పేర్లతో డీమ్యాట్ ఖాతాలు తెరిచి ద రఖాస్తులు పెట్టడం, షేర్లు అలాట్ కాగానే వాటిని తమ ఖాతాలకు బదిలీ చేసుకోవటం... తరవాత వాటిని మార్కెట్ వెలుపల విక్రయించటం వల్ల అంతిమంగా ఈ ఐపీఓలకు ఫైనాన్స్ చేసినవారికే లబ్ధి చేకూరిందని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్, కార్వీ కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్, కార్వీ సెక్యూరిటీస్ లిమిటెడ్, కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలున్న కార్వీ గ్రూపు... ఈ వ్యవహారంలో కీలక ఆపరేటర్లకు సహాయపడటం, సహకరించటం, ప్రోత్సహించటం వంటివి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. వీటిపై విచారించిన సెబీ... ఆరు నెలల పాటు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌ను కొత్త పథకాలు ఆరంభించకుండా, కొత్త బాధ్యతలు చేపట్టకుండా, కొత్త ఒప్పందాలపై సంతకాలు పెట్టకుండా నిషేధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. కొత్త కస్టమర్లు, క్లయింట్లను కూడా తీసుకోకూడదు. ఈ తీర్పు కార్వీపై తీవ్ర ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాల అంచనా.