case sheet
-
చికిత్స.. పక్కా లెక్క
సాక్షి, అమరావతి: రోగి ఆస్పత్రికి వెళితే చిత్తు కాగితం మీద కూడా మందులు రాసిన సందర్భాలు అనేకం. కేస్ షీట్లు రాసేందుకు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో పేపర్లు ఉండేవి కావు. ఇదంతా గతం. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నిర్వహణ జరుగుతోంది. ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) ప్రమాణాల మేరకు ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహిస్తారు. ప్రతి పేషెంట్‌కు సంబంధించిన వివరాలు నిబంధనల మేరకు రిజిస్ట్రీ (నమోదు) అవుతాయి. గతంలోలా కాకుండా ఓపీ, ఐపీ స్లిప్పులూ మారనున్నాయి. ఇన్ పేషెంట్‌కు సంబంధించి ఏకంగా 16 పేజీల పుస్తకం నిర్వహిస్తారు. ఎవరు ఎలాంటి వైద్యం చేశారు.. ఏం మందులు రాశారు.. ఏయే రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు వంటి వివరాలన్నీ ఈ కేస్ షీట్లో ఉంటాయి. ఒక్కసారి ఇన్ పేషెంట్‌గా చేరిన వ్యక్తి సమాచారం మొత్తం ఈ పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలు.. ► ప్రస్తుతం రాష్ట్రంలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) మదింపు జరుగుతోంది. ఈ ప్రమాణాలను అందుకోవాలంటే ఆస్పత్రుల్లో ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఓపీ, ఐపీ స్లిప్పులు, రిజిస్ట్రీలో భారీగా మార్పులు తెచ్చారు. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్‌క్యూఏఎస్ మదింపు పరిధిలోకి ఇన్ని ఆస్పత్రులను తీసుకురాలేదు. ఏపీలో మాత్రమే ఈ విధానంతో ముందుకెళుతున్నారు. ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాల మదింపు సుమారు 90 రకాల సేవలకు సంబంధించి చేస్తారు. ఇందులో ఓపీ..ఐపీ ప్రధానమైనవి. ఒక పేజీ ఓపీ షీట్, 16 పేజీల కేస్ షీట్ ► తాజాగా ఇన్ పేషెంట్ షీట్‌ను మార్చారు. ఇందులో జబ్బు వివరాలు, పేషెంట్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ చేసి అందులో రాయాలి. ► కేస్ షీట్.. 16 పేజీలతో ముద్రించిన పుస్తకం డాక్టర్ల దగ్గర ఉంటుంది. మొదటి పేజీలో పేషెంట్ వివరాలు, అంగీకార పత్రం మొదలుకుని అన్ని వివరాలు ఉంటాయి. ► ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్.. అంటే రోగ నిర్ధారణ పరీక్షలు చేశాక ఫలితాలు విధిగా రాయాల్సి ఉంటుంది. 3వ పేజీలో రోగి హిస్టరీ అంటే పేషెంట్‌కు దీర్ఘకాలిక జబ్బులున్నాయా.. ఎలాంటి మందులు వాడుతున్నారు, కుటుంబ హిస్టరీ వంటివన్నీ రాస్తారు. ► మెడికల్ చార్ట్ పేరుతో 5వ పేజీ రూపొందించారు. ఇందులో మందు పేరుతో పాటు డోసు, ఎన్ని వాడాలి, ఏ టైములో వాడాలి అనేది రాసి ఉంటుంది. ► నర్సు ఏ షిఫ్టులో ఎన్నిసార్లు పరీక్షించిందో, సేవలు అందించిందో అనే దానికి ఒక పేజీ కేటాయించారు. రోగికి కౌన్సిలింగ్ చేయడం, ఆహారం గురించి చెప్పడం విధిగా రాయాలి. ► డిశ్చార్జి సమ్మరీతో పాటు రోగి చనిపోతే డెత్ సమ్మరీ కాపీ ఒకటి ఆస్పత్రి వద్ద ఉంచుకుని, మరొకటి పేషెంట్ కుటుంబ సభ్యులకు విధిగా ఇవ్వాలి. ఇందులో విధిగా కారణాలను రాయాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్ డేటాలో నిక్షిప్తం చేస్తారు. -
‘కోవిడ్ కేస్‌షీట్’ ఏం చేద్దాం?
హైదరాబాద్: తెలంగాణలో నమోదైన తొలి కోవిడ్ కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్కుతుంది. అయితే బాధితుడికి అందించిన వైద్యసేవలు, చికిత్స వంటి వివరాల్ని పొందుపర్చిన కేస్‌షీట్ వ్యవహారం మాత్రం గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. నగరంలోని మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు దుబాయ్‌కు వెళ్లొచ్చాక కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఈ నెల 1న గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు, తర్వాత అత్యవసర విభాగంలోని ఎక్యూట్ మెడికల్ వార్డులో చేర్చుకుని చికిత్స అందించారు. ఎట్టకేలకు కోలుకోగా, చివరిగా అనేక పరీక్షల అనంతరం కోవిడ్ నెగెటివ్ రావడంతో ఈ నెల 13న రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఇన్ని రోజుల పాటు బాధితునికి అందించిన సేవలు, చికిత్స, మందులు, ఫ్లూయిడ్స్, బీపీ, సుగ ర్ వంటి వివరాలన్నీ కేస్‌షీట్‌లో పొందు పర్చారు. మామూలు రోగులను డిశ్చార్జ్ చేస్తే అతని కేస్‌షీట్‌ను పదేళ్లపాటు భద్రపరచాలని నిబంధన. దీంతో ఆయా కేస్షీట్లను ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డు రూంలో భద్రపరుస్తారు. తాజా కేస్‌షీట్ కోవిడ్ బాధితునిది కావడం, కేస్‌షీట్ కాగితాలపై వైరస్ అంటు కుని ఉంటుందని, దానిని తాకితే ఇతరులకూ వ్యాపిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ కేస్‌షీట్‌ను జిరాక్స్ లేదా స్కానింగ్ చేస్తే.. యంత్రాలకూ వైరస్ అంటుకుని ఇతరులకు వ్యాపిస్తుందనేది మరికొందరి వాదన. ఈ నేపధ్యంలో ‘కోవిడ్ కేస్‌షీట్’ను ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. బాధితుడు వాడిన చెప్పులు, టూత్‌బ్రష్, దుస్తులు, వాడిన సిరంజీలు, సెలైన్ ఫ్లూయిడ్ బ్యాగులు వంటివన్నీ బయో మెడికల్ వేస్టేజ్ ద్వారా నిర్వీర్యం చేశారు. ఒక్క కేస్‌షీట్ విషయం మాత్రం తేలలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేస్‌షీట్‌ను దళసరి పాలిథిన్ బ్యాగ్‌లో పెట్టి, సీల్చేసి, దానిపై వైరస్ నివారణకు వినియోగించే ద్రావణాలను పూసి, ప్రత్యేక బీరువాలో భద్రపర్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
కేస్ షీట్లు మారటం వాస్తవమే: డాక్టర్ బుద్ధ
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు. కేస్ షీట్లు మారిడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సత్యవతికి సరైన వైద్యమే అందించామని.... అనుమానాలు ఉంటే పోస్ట్‌మార్టం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూపరింటిండెంట్ అన్నారు. కాగా వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్... మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించక పోవడంతో... రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారని... ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.